ప్లాన్ సక్సెస్
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:17 AM
కూటమి ప్రభుత్వం విద్యా విధానాల్లో మార్పు తెస్తూ వచ్చింది. ఇంటర్ విద్యపైన ఈ ఏడాది తీసుకున్న ప్లాన్ సక్సెస్ అయింది.
ఇంటర్‌లో గతేడాదికంటే పెరిగిన ఉత్తీర్ణత
ప్రభుత్వ, ప్లస్ వన్ కళాశాలల్లో ప్రతిభ
ఫలించిన ఓరియంటేషన్ తరగతులు
పదో తరగతిలోనూ ఉత్తమ ఫలితాలపై విద్యాశాఖ ధీమా
ఇంటర్మీడియెట్ పరీక్షలపై ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ముందు నుంచి ప్రణాళికగా విద్యాబోధన చేయించింది. ఓరియంటేషన్ క్లాసులు, సంకల్ప్ కార్యక్రమం వంటి కార్యక్రమాలతో అధ్యాపకులు చక్కటి బోధన చేశారు. ఉత్తీర్ణతతో పాటు మెరిట్ లిస్ట్‌లో ప్రభుత్వ విద్యార్థులు నిలిచారు.
భీమవరం రూరల్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం విద్యా విధానాల్లో మార్పు తెస్తూ వచ్చింది. ఇంటర్ విద్యపైన ఈ ఏడాది తీసుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు,ప్లస్‌వన్ కళాశాలల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ప్రైవేట్‌కు ధీటుగా ఎక్కువమంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. గతేడాది కంటే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత పెరిగింది. ద్వితీయ సంవత్సరంలో గతేడాది కంటే కొంచెం తగ్గింది. ప్లస్ వన్ కళాశాలలో మంచి ఫలితాలు వచ్చాయి. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ ఉంది. టెన్త్‌లోనూ ఉత్తమ ఫలితాల సాధి స్తారని ఆశిస్తున్నది. జిల్లా నుంచి ప్రభుత్వ విద్యార్థులు 12,777 మంది పరీక్షలు రాశారు. గతేడాది 70 శాతం ఉత్తీర్ణతలో నిలవగా అంతకంటే మెరుగైన ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్నారు.
మార్కుల్లో టాప్ లేపారు
2025లో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ 41 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత వచ్చింది. 2026లో ఫస్టియర్ విద్యార్థులు 49 శాతం ఉత్తీర్ణత సాధించగా సెకండియర్‌లో 66 శాతం ఉత్తీర్ణత పొందారు.ఫస్టియర్‌లో గత ఏడాది కంటే 8 శాతం ఉత్తీర్ణత పెరిగింది. సెకండియర్ 3 శాతం తగ్గింది. ప్లన్‌వన్ కళాశాలల్లో ఉత్తీర్ణత మెరుగుపడింది. జిల్లాలో 25 పైగా కళాశాలల్లో ఫస్టియర్ 47 శాతం, సెకండియర్ 57 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో 986 మార్కులు, బైపీసీలో 963, సీఈసీలో 920 మార్కులు సాధించారు.
ప్రైవేటుకు దీటుగా సత్తా చాటారు
ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు ప్రైవేట్‌కు ధీటుగా మార్కులు సాధించారు. ఎంపీసీ గ్రూపులో వీరవాసరంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థి 986 మార్కులు, భీమవరం ప్రభుత్వ కళాశాల విద్యార్థిని 983 మార్కులు సాధించారు. ఫస్టయిర్ ఎంపీసీలో పాలకొల్లు గవర్నమెంట్ కళాశాల విద్యార్థిని గోపిక 457, భీమవరం విద్యార్థిని 455 మార్కులు సాధించారు. బైపీసీ గ్రూపులో సెకండియర్‌లో తాడేపల్లిగూడెం విద్యార్థిని నివేదిత 968, తణుకు విద్యార్థిని 956 మార్కులు సాధించారు. సీఈసీలో తాడేపల్లిగూడెం విద్యార్థి మొహమ్మద్ ఆలియా నూర్ 958 మార్కులు, ఫస్టియర్‌లో భీమవరం విద్యార్థిని భువనసాయి 491 మార్కులు సాధించింది. మిగిలిన గ్రూపుల్లోనూ ప్రభుత్వ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చూపారు.