మోక్షం కలిగేనా?
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:33 AM
కరువు పీడిత గ్రామాల్లో 50 వేల ఎకరాలను గోదావరి జలాలలో సస్య శ్యామలం చేయడమే కాక 70 గ్రామాలకు తాగునీటి ఇబ్బం దులు తీర్చడానికి ఉద్దేశించిన పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పఽథకానికి మోక్షం ఉందా? లేదా? అని ఆయకట్టు రైతులు ఆశ–నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకంపై నీలినీడలు
గతంలో టీడీపీ సర్కార్ హయాంలో మంజూరు
ఆపై అట్టకెక్కించిన వైసీపీ ప్రభుత్వం
ప్రస్తుతం కూటమి సర్కార్ రద్దు..?
ఆయకట్టు రైతుల్లో ఆవేదన
చాట్రాయి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కరువు పీడిత గ్రామాల్లో 50 వేల ఎకరాలను గోదావరి జలాలలో సస్య శ్యామలం చేయడమే కాక 70 గ్రామాలకు తాగునీటి ఇబ్బం దులు తీర్చడానికి ఉద్దేశించిన పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పఽథకానికి మోక్షం ఉందా? లేదా? అని ఆయకట్టు రైతులు ఆశ–నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో పరిధిలో నూజివీడు, తిరువూరు, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు మండలాలకు సాగు, తాగునీరు అందించడానికి నవ్యాంధ్రలో తొలి టీడీపీ ప్రభు త్వం అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చొరవతో ఈ పథకాన్ని రూపొందించింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పరిధిలోకి రాని గ్రామాలకు కోసం ఈ పథకాన్ని రూపొందించారు. కూటమి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం పిట్టలవారిగూడెం ఎత్తిపోతలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ఆయకట్టు రైతులు కూటమి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నవ్యాంధ్ర సీఎంగా ఉండగా ఇచ్చిన హామీ మేరకు రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు రద్దు నిర్ణయం సీఎం చంద్రబాబుకు తెలిసి జరిగిందా? తెలియక జరిగిందా? అని రైతులు చర్చించుకుంటున్నారు. 2017 సెప్టెంబరులో అప్పటి సీఎం చంద్రబాబు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్–2 శంకుస్థాపనకు ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలోని మద్దులపర్వ గ్రామానికి వచ్చారు.స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు సీఎంను కలిసి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్–2 కాలువపై లిఫ్టులు ఏర్పాటు చేసి కరువు పీడిత గ్రామాలకు సాగు తాగునీరు అందించాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు లిఫ్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించి, తక్షణమే సమగ్ర సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు సర్వే చేసి చింతలపూడి ఎత్తిపోతల ఫేజ్–2 ప్రధాన కాల్వపై చాట్రాయి మండలం పిట్టలవారిగూడెం, కోటపాడు, సూరంపాలెం గ్రామా ల వద్ద ప్రధాన లిఫ్టులు, విస్సన్నపేట వద్ద స్టేజి–1 కాల్వపై ఆరుగొలనుపేట, చిత్తపూరు గ్రామాల వద్ద సబ్ లిప్టులు ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. 2019 ఫిబ్రవరి 6న ఈ పథకానికి సంబంధించి జీవో నెంబ రు 15 ద్వారా రూ.698.9 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా ఆమోదం ఇచ్చింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు అప్పగించారు.
పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
ప్రాజెక్టుకు కావాల్సిన కాంటూరు, భూసేకరణ ప్లాన్లు తయారు చేస్తుండగా 2019 ఎన్నికల కోడ్ రావడంతో పనులకు బ్రేక్ పడింది. దీంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో పఽథకానికి దుర్దశ వచ్చింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చింతలపూడితో పాటు ఈ పథకాన్నీ పట్టించుకోలేదు. 2022లో అప్పటి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, నూజివీడు, తిరువూరు, మైలవరం ఎమ్మెల్యేలు మేకా ప్రతాప అప్పారావు, రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్ పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పఽథకానికి నిధులు మంజూరు చెయ్యాలని అప్పటి సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అయినా మోక్షం కలగలేదు. అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా నిధులు మంజూరుకు అవకాశంగా ఈ పఽథకాన్ని డీ కేటగిరిలో ఉంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పఽథకానికి నిధులు మంజూరు అవుతాయని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తుండగా పథకాన్ని రద్దు చేయడంతో ఖంగుతిన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పఽథకం పనులు ప్రారంభించాలంటే సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉన్నందున, దానికి అనుబంధంగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసి ఉంటారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే పథకం రద్దును సంబంధిత అధికారులు ధ్రువీకరించడం లేదు. నూజివీడు ఎమ్మెల్యే, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు, విజయవాడ ఎంపీలు మహేశ్ కుమార్ యాదవ్, కేశినేని శివనాథ్, తిరువూరు, మైలవరం ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్ చొరవ తీసుకొని ఈ పఽథకానికి ఊపిరి పోయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
రద్దు కాదు.. పక్కన పెట్టారు
పథకాన్ని రద్దు చేయలేదు.. పక్కన పెట్టారు. కొత్త శాంక్షన్స్‌లో ఈ పథకం రాలేదు. మెయిన్ ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి క్లియరెన్స్ రావాల్సి ఉన్నందున దీనిని ఆపి ఉంటారని భావిస్తున్నాం. ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుంటే మళ్ళీ పథకాన్ని లైవ్‌లోకి తీసుకురావచ్చు.
– చిన్నబాబు, ఈఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం