పట్టణాలకు పైప్‌లైన్ ప్రాజెక్ట్ రెడీ
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:06 AM
జిల్లాలోని పల్లెలకు, పట్టణాలకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పల్లెలకు విజ్జేశ్వరం వద్ద గోదావరి జలాలను శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా నేరుగా అందించే వాటర్ గ్రిడ్ పనులు మొదలయ్యాయి.
భీమవరం, పాలకొల్లు, తణుకు, నర్సాపురం,
ఆకివీడు పట్టణాలకు రూ.607.33 కోట్లు
తాడేపల్లిగూడెంకు భూగర్భ డ్రైనేజీ, అంతర్గత పైపులైన్‌లకు 116.61 కోట్లు
ఐసీసీ సంస్థకు కాంట్రాక్టు ఖరారు
త్వరలోనే ప్రభుత్వంతో ఒప్పందం..
ఆపై మొదలు కానున్న పనులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని పల్లెలకు, పట్టణాలకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పల్లెలకు విజ్జేశ్వరం వద్ద గోదావరి జలాలను శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా నేరుగా అందించే వాటర్ గ్రిడ్ పనులు మొదలయ్యాయి. తాజాగా పట్టణాలకు పైపులైన్‌ల ద్వారా కాలుష్య రహిత గోదావరి జలాలను రప్పించే పైప్‌లైన్ ప్రాజెక్ట్ టెండరు ఖరారైంది. ప్రభుత్వం వర్క్ ఆర్డర్ మంజూరుచేసింది. ఈ మేరకు రూ.607.33 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న ఐసిసి సంస్థ త్వరలోనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించనుంది. భీమవరం, పాలకొల్లు, తణుకు, నర్సాపురం, ఆకివీడు పట్టణాల్లో పంపుల చెరువులకు పైప్‌లైన్ ద్వారా నీటిని మళ్లించనున్నారు. అక్కక నీరు శుద్ధి చేసి పట్టణాల్లోని ప్రజలకు పంపిణీ చేస్తారు. ప్రాజెక్ట్ పూర్తయితే పట్టణాల్లో సరఫరా అవుతున్న మంచినీటికి కాలుష్య సమస్య తీరనుంది. ప్రస్తుతం పంట కాలువలు కాలుష్యం కావడంతో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. వేసవిలో సమృద్ధిగా మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నారు. వున్న పంపుల చెరువుల నీరు వేసవిలో సరఫరాకు సరిపోవడం లేదు. నెలన్నరపాటు కాలువలు మూసి వేస్తే పట్టణాల్లో మంచినీటికి కటకట ఏర్పడుతోంది. విజ్జేశ్వరం నుంచి పైప్‌లైన్‌ల ద్వారా మళ్లిస్తే వేసవిలోనూ సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంటుంది. ఇందు కోసం అమృత్ 2.0లో పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతం వేసవి చివరి దశలో పట్టణాల్లోని పంపుల చెరువుల్లో నీరు అడుగంటిపోతుంది. అప్పుడు ఒక్కపూట మాత్రమే నీరు ఇచ్చే పరిస్థితి ఉంటోంది. ఇటీవల రెండు పూటలా ఇస్తున్నా సరే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. తర్వాత పునరుద్ధరిస్తున్నా సరే వేసవిలో మంచి నీరు సమృద్ధిగా ఇవ్వలేకపోతున్నారు. అదే పైపులైన్ల ద్వారా నీటిని చెరువులకు మళ్లిస్తే
ఏడాది పొడవునా గోదావరి జలాలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు తాడేపల్లిగూడెంలో భూగర్భ డ్రైనేజీకి రూ.88.13 కోట్లు, అంతర్గత పైపులైన్‌లకు రూ.28.43 కోట్లు కేటాయించారు. సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు నిర్మించనున్నారు.
పట్టణాల వారీగా నిధులు రూ.కోట్లలో
భీమవరం 167.72
పాలకొల్లు 119.26
నర్సాపురం 125.92
తణుకు 118.11
ఆకివీడు 76.32
తాడేపల్లిగూడెం
భూగర్భ డ్రైనేజీలకు 88.18
అంతర్గత పైప్‌లైన్‌లకు 28.43
రూ.1400 కోట్లతో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనులు
మంత్రి నిమ్మల సమీక్ష
పాలకొల్లు అర్బన్, జనవరి 21(ఆంధ్ర జ్యోతి):గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు అమరజీవి జల ధార వాటర్ గ్రిడ్ పథకానికి రూ.1400 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు జలవ నరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామా నాయుడు తెలిపారు. ఈ పథకంపై బుధ వారం పాలకొల్లులోని తన కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఏజెన్సీ ప్రతి నిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథ కం ద్వారా గోదావరి జలాలను పైపుల ద్వారా ఇళ్లకు అందిస్తామన్నారు. విజ్జేశ్వరం వద్ద 155 ఎంఎల్‌డి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్, ఇంటెక్‌వెల్, ఓహెచ్ బీఆర్, ఫిల్టర్ బెడ్స్ సంపులు, పైప్‌లైన్ వంటి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు సురక్షిత తాగు నీటిని అందించలేకపోయారని విమర్శించా రు. కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.