పగిలిన సత్యసాయి పైపులైన్
ABN , Publish Date - May 24 , 2026 | 11:56 PM
రేపల్లెవాడ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న సత్యసాయి పైపులైను పగిలిపోయి గోదావరి జలాలు గ్రామంలో వరదలా ప్రవహిస్తున్నాయి.
వృథాగా పోతున్న జలాలు
పోలవరం, మే 24(ఆంధ్రజ్యోతి): అసలే ఎండలు.. నీటి కరువుతో అల్లాడుతున్న ప్రజానీకం.. ఇలాంటి సందర్భాల్లో నాలుగు నియోజకవర్గాలైన గోపాలపురం, పోలవరం, చింతలపూడి, కొవ్వొరుల్లోని 240 గ్రామాలకు గోదావరి మంచినీటిని అందించే సత్యసాయి పైపులైను పగిలిపోయి నీరు వృఽథాగా పోతే మెట్ట ప్రాంతాలకు మంచినీటి కరువే కదా.. అక్షరాలా అదే పరిస్థితి పోలవరం మండలం రేపల్లెవాడ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. జీలుగుమిల్లి నుంచి కొవ్వూరు వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా హైవే అథారిటీ యంత్రాలు చేస్తున్న తవ్వకాలలో రేపల్లెవాడ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న సత్యసాయి పైపులైను పగిలిపోయి గోదావరి జలాలు గ్రామంలో వరదలా ప్రవహిస్తున్నాయి. వృఽథాగా పోతున్న జలాలను అదుపు చేయడానికి వీలు లేకపోవడంతో గ్రామం వేసవిలో వరదల్లో చిక్కిన పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో మహిళలు బిందెలతో నీరు పట్టుకుని వెళుతున్నారు. పంచాయతీ అధికారులు గానీ సత్యసాయి మంచినీటి సరఫరా నిర్వహకులు గానీ, హైవే అథారిటీ గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజానీకం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం వలన కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, చింతలపూడి తదితర మండలాల్లో గోదావరి మంచినీటి సరఫరాకి అంతరాయం కలుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.