వంటింట్లోకి పైప్‌లైన్ గ్యాస్
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:09 AM
పదేళ్ల క్రితమే జిల్లావ్యాప్తంగా కొన్ని పట్టణాల్లో పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇళ్లలో కూడా కనెక్షనులు ఇచ్చారు.కానీ తర్వాత వదిలేశారు
పదేళ్ల క్రితమే పట్టణాల్లో కనెక్షన్లు
తాడేపల్లిగూడెంలో ఇళ్లకు మీటర్లు బిగింపు ..100 శాతం పూర్తి
అప్పటి నుంచి ముందుకు కదలని ప్రాజెక్టు
గ్యాస్ కొరత నేపథ్యంలో తెరపైకి
పైప్‌లైన్ ద్వారా అందించాలనిగూడెం వాసుల డిమాండ్
తాడేపల్లిగూడెం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): అమెరికా–ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో కరెంటు స్టవ్, కట్టెల పొయ్యిలు వంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచించారు. ఇందులో భాగంగానే పైప్‌లైన్ గ్యాస్ (పీఎన్‌జీ) ప్రచారంలోకి వచ్చింది.. పదేళ్ల క్రితమే జిల్లావ్యాప్తంగా కొన్ని పట్టణాల్లో పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇళ్లలో కూడా కనెక్షనులు ఇచ్చారు. వినియోగించే గ్యాస్ వివరాలను తెలుసు కునేందుకు మీటర్లను కూడా బిగించారు. నేరుగా గ్యాస్ పొయ్యి వరకు పైపులైన్ కలిపారు. కానీ తర్వాత వదిలేశారు. ఎంతో ఖర్చుపెట్టి జీజీపీఎల్ గ్యాస్ కంపెనీ ఇదంతా చేసింది. కానీ అప్పటి నుంచి అటువైపు చూడలేదు.
పైసా తీసుకోలేదు..
పైపులైన్ నుంచి గ్యాస్ సరఫరా నేరుగా ఇళ్లకు కనెక్షన్ ద్వారా ఇచ్చి ఉంటే ఈ యుద్ధ సమ యంలో ఇబ్బందులు ఉండేవి కాదని పలువురు అంటున్నారు. దీనివల్ల పొదుపుగా వినియోగం జరుగుతుంది. సంబంధిత గ్యాస్ పైపులైన్ కంపెనీ వినియోగదారుడి నుంచి ఒక్కపైసా వసూలు చేయకుండా సర్వీస్ కనెక్షన్ ఇళ్లకు ఏర్పాటు చేసింది. తాడేపల్లిగూడెం పట్టణంలోని పీఎన్‌టీ కాలనీ, సుబ్బారాయుడు పేట ప్రాంతాల్లో ఇళ్లతో పాటు అపార్టుమెంట్లకు కూడా పైపులైన్ వేసి మీటర్లను బిగించింది. ఈ ప్రాజెక్టును 100 శాతం పూర్తి చేసింది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాల వల్ల పారదర్శకత ఉంటుంది.గ్యాస్ పక్కదారి పట్టేందుకు వీలుండదు. కరెంట్ వినియోగం బట్టి బిల్లు ఎలా వస్తుందో అదే మాదిరిగా గ్యాస్ వినిగించే వారికి వారి వినియోగ ప్రాతిపదికన బిల్లు వచ్చే అవకాశం ఉండేది. అంతే కాకుండా సిలిండర్లతో పోల్చితే భద్రత కూడా. ఇన్ని ప్రయోజనాలు ఉండే గ్యాస్‌ను పైపులైన్ ద్వారా సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. పదేళ్ల కిందట నిలిచిపోయిన ఈ పఽథకాన్ని పునరుద్ధరించాలి కోరుతున్నారు.
కొరతే ఉండదు : రాగిరెడ్డి ప్రసాద్, వినియోగదారుడు
ఆ సమయంలో గ్యాస్ పైపులైన్ ద్వారా సరఫరా చేస్తారంటే ఆనందపడ్డాం. పైపులైన్ వేసే ఏజెన్సీ మా నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. మీటర్లు ఏర్పాటు, కనెక్షన్, గ్యాస్ పొయ్యివరకు అంతా పూర్తిచేసింది. గ్యాస్ సిలెండర్ల మోత తప్పుతుందని ఆనందపడ్డాం. కానీ అది నెరవేరలేదు.
గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి : అన్నపూర్ణ, గృహిణి
పైపులైను వేస్తే ఆనందపడ్డాం. ఇప్పుడు గ్యాస్ కొరత సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. అధిక ధరల వసూలుకు అవకాశం లేకుండా ఉండేది. గ్యాస్ వినియోగం రీడింగ్‌ను బట్టి పొదుపుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.