Share News

జవాబుదారీతనం ఏదీ..?

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:19 AM

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు ఏళ్ల తరబడి జవాబుదారీతనం లోపిస్తోంది. మాకు సంబంధం లేనట్లుగానే మండల స్థాయిలో అధికారులు తీరు ఉంటోంది.

 జవాబుదారీతనం ఏదీ..?

పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తుకు రశీదుల్లేవ్‌

చాలా మండలాల్లో పట్టించుకోని అధికారులు

సమస్యలు పరిష్కారం కాక జనం గగ్గోలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

కైకలూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన రైతు తన భూమిని రీ సర్వే చేయించాలని కోరుతూ మార్చి 30న అర్జీని తహసీల్దార్‌ కార్యాలయంలో దాఖలు చేశాడు. ఇప్పటికి ఈ సమస్య కోసం ఆరా తీసేవారు కరువయ్యారు. అలాంటప్పుడు దరఖాస్తు ఎందుకు చేయాలన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు ఏళ్ల తరబడి జవాబుదారీతనం లోపిస్తోంది. మాకు సంబంధం లేనట్లుగానే మండల స్థాయిలో అధికారులు తీరు ఉంటోంది. చాలాచోట్ల మండలాల్లో ఇప్పటికీ అర్జీ దాఖలు చేస్తే.. దానికి కనీసం రశీదు ఇవ్వడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు కార్యాలయాల వైపు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో 27 మండలాలుండగా చాలా మండలాల్లో ప్రజా పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ఒక ప్రహాసనంలా సాగుతోంది. ప్రజలు దరఖాస్తు ఇస్తే వాటిని ఎప్పటిలోగా పరిష్కరిస్తాం.. ఎవరు జవాబుదారీ అనే అంశాలతో రశీదు ఇవ్వడం లేదు. ఎవరైనా ధైర్యం చేసి రశీదు ఇవ్వాలని అడిగితే టెక్నికల్‌ స్టాఫ్‌ లేరనే సమాధానం వస్తోంది. ప్రధానంగా ముదినేపల్లి, కైకలూరు తదితర మండలాలతో పాటు చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది.

ఆర్డీవో కార్యాలయాల పరిధిలో కాస్తా మెరుగు

ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు సబ్‌ కలెక్టరేట్‌ పరిధిలోని కొన్ని మండలాల్లోనే రశీదులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్డీవోలు, సబ్‌ కలెక్టర్‌ తమ పరిధిలోని మండలాల్లో పీజీఆర్‌ఎస్‌ తీరుతెన్నులపై పరిశీలనలు, ఆకస్మిక తనిఖీల నిర్వహణ లేదు. దీంతో ఇష్టారాజ్యం గా మొక్కుబడిగా కిందిస్థాయి సిబ్బంది నేతృత్వంలో పీజీఆర్‌ఎస్‌ల నిర్వ హణ జరుగుతోంది. చాలా మండలాల్లో ప్రతి సోమవారం ఒకటి లేదా రెండు అర్జీలే వస్తుండటంతో మండలస్థాయిలో పరిష్కారం అనేది జరగట్లేదన్న సంకేతాలనే ఇస్తోంది.

క్షేత్రస్థాయిలో పర్యటనల్లేవ్‌ ..

పీజీఆర్‌ఎస్‌ ద రఖాస్తుల్లో కనీసం వారంలో కొన్నింటినైనా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధికారుల్లో ఉండడం లేదు. క్షేత్రస్థాయిలో జటిలమైనవి ఉంటే వాటిని చూస్తే తమకెక్కడ ఒత్తిడులు వస్తాయోనని కిందస్థాయి సిబ్బందిని పంపి ఆపై రిమార్కులు రాసి పైస్థాయి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

మండల స్థాయిలో టీమ్‌ వర్క్‌ లేదాయే ..

మండలాల్లో వాస్తవంగా తహసీల్దార్‌ కార్యాలయంలో అందరూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనివల్ల అక్కడికక్కడే కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరుకుంది. తహసీల్దార్‌, ఎంపీడీవో, మండల ఇంజనీర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ, అగ్రికల్చర్‌ ఏవో, ఇతర వర్కు ఇన్‌స్పెక్టర్లు, సర్వే సిబ్బంది, వీఆర్వోలు ఆ రోజు విధిగా అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలిస్తే పీజీఆర్‌ఎస్‌కు స్థానికంగా ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరుగుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చాలా మండలాల్లో తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చి మొక్కుబడిగా కొద్దిసేపు ఉండి వెళ్లిపోతున్నారనే విమర్శలున్నాయి.

ప్రజల్లో సానుకూలత ఏదీ ?

ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ప్రభావం ఎక్కడ కానరావడం లేదు. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు ఎంత చేసినా పీజీఆర్‌ఎస్‌ నిర్వహణలో సంస్కరణలు చేసినా.. అధికారులు పరిష్కారంలో కీలకంగా వేగంగా వ్యవహరించకపోవడం వల్ల ప్రజలు సమస్యలు పెరుగుతున్నాయి. మండల స్థాయిలోనే రశీదులు ఇచ్చి.. వాటి పరిష్కారాలకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 30 , 2026 | 12:19 AM