Share News

పీఎఫ్‌ పంచాయితీ!

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:33 AM

కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు కావొస్తున్నా జిల్లా పరిషత్‌ విభజన జరగకపోవడంతో ఓల్డ్‌ పెన్షన్‌ స్కీముకు సంబంధించిన పంచాయతీ రాజ్‌ శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రావి డెంట్‌ ఫండ్‌ ఖాతాల నిర్వహణ విషయంలో ప్రతిష్టంభన వీడలేదు.

పీఎఫ్‌ పంచాయితీ!

జీతాల నుంచి మినహాయింపు.. జిల్లా ట్రెజరీకి బదిలీ

జిల్లా పరిషత్‌ ఖాతాలకు చేరని కంట్రిబ్యూషన్‌ సొమ్ము

నాలుగేళ్లుగా 1300 మంది విలీన ఉద్యోగులు ఇబ్బందులు

కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు కావొస్తున్నా జిల్లా పరిషత్‌ విభజన జరగకపోవడంతో ఓల్డ్‌ పెన్షన్‌ స్కీముకు సంబంధించిన పంచాయతీ రాజ్‌ శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రావి డెంట్‌ ఫండ్‌ ఖాతాల నిర్వహణ విషయంలో ప్రతిష్టంభన వీడలేదు. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ కావడం లేదు. కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు, నూజివీడు నియోజక వర్గాలకు చెందిన ఓల్డ్‌ పెన్షన్‌ స్కీము ఉద్యో గులు, ఉపాధ్యాయులకు ఈ సమస్య ఉత్పన్నమైంది.

ముదినేపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):జిల్లా విభజ న సమయంలో కైకలూరు, నూజివీడు సబ్‌ ట్రెజరీల ను కృష్ణా జిల్లా నుంచి విడదీసి ఏలూరు జిల్లా ట్రెజరీ కార్యాలయానికి అనుసంధానం చేశారే కాని ఉద్యోగుల ప్రావిడెంట్‌ఫండ్‌ ఖాతాలను కృష్ణా జిల్లా పరిషత్‌ నుంచి ఏలూరు జిల్లా పరిషత్‌కు మార్చ లేదు. దీంతో పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ సొమ్ము, ఏలూరు జిల్లా ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అవుతోంది. 2022 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు కృష్ణా జిల్లా పరిషత్‌లోని ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలకు సొమ్ము జమ కాలేదు.

జమకాని సొమ్ము రూ.90 కోట్లు

కృష్ణా జిల్లా పరిషత్‌లో ఉద్యోగులు, ఉపాధ్యా యుల పీఎఫ్‌ ఖాతాలకు జీతాల నుంచి గత 40 నెలలుగా మినహాయించిన సొమ్ము సుమారు రూ.90 కోట్లు జమ కావాల్సి ఉంది. కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు, నూజివీడు నియోజక వర్గాల్లోని ముదినేపల్లి, మండవల్లి, కలి దిండి, కైకలూరు, నూజివీడు, చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు మండలాలకు చెందిన సుమారు 1,300 మంది ఓపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఎఫ్‌ ఖాతాలు కృష్ణా జిల్లా పరిషత్‌లో ఉన్నాయి. ఈ ఉద్యోగుల జీతాల నుంచి వారి స్థాయిని బట్టి నెలకు రూ.90వేల నుంచి రూ.25 వేల వరకు పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ సొమ్మును మినహాయిస్తున్నారు. అయి తే కృష్ణా జిల్లా పరిషత్‌లోని పీఎఫ్‌ ఖాతాకు జమ కావడం లేదు.

రిటైర్డ్‌ ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలు ఖాళీ

రిటైరైన, మరణించిన పంచాయతీరాజ్‌ ఒపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఎఫ్‌ ఖాతాలు ప్రస్తు తం ఖాళీగా ఉన్నాయి. 2022 అక్టోబరు తర్వాత రిటై రైన ఉద్యోగులకు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అంతకు ముందు జమ అయిన పీఎఫ్‌ సొమ్మునే చెల్లిస్తున్నారు. ఆ ఏడాది అక్టోబరు నుంచి వారి ఖాతాలకు పీఎఫ్‌ సొమ్ము జమ కాకపోవడంతో రిటైర్‌ అయ్యే నాటికి రావాల్సిన పీఎఫ్‌ సొమ్ము పూర్తిస్థాయిలో చేతికి అంందడం లేదు. పాత పీఎఫ్‌ సొమ్ము చెల్లించడంతో ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిషత్‌లోని ఆ ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో నిల్వ లేకుండా పోయింది. ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు, నూజివీడులో 150 మందికి పైబడి ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు.

రుణాలకు లేని అవకాశం

ఒపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఎఫ్‌ ఖాతా లకు కంట్రిబ్యూషన్‌ సొమ్ము జమ కాకపోవడంతో పీఎఫ్‌పై వారు రుణాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యవసర సమయాల్లో ఉద్యోగులు పీఎఫ్‌ సొమ్ము ఉపసంహరణకు వీలు లేకుండా పోయింది. దీంతో పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులకు సొమ్ము అందుబాటులో లేకుండా పోయింది.

ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి

ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు, నూజివీడు నియోజక వర్గాలకు చెందిన ఒపీఎస్‌ పంచా యతీరాజ్‌ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సొమ్మును కృష్ణా జిల్లా పరిషత్‌లోని పీఎఫ్‌ ఖాతాలకు జమ చేయడంలో నెలకొన్న సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి.

– గొట్టిపాటి రమేష్‌, యుటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు

పీఎఫ్‌ సొమ్ము అందక ఇబ్బంది

పీఎఫ్‌ ఖాతాల్లో సొమ్ము జమకాక రిటైరైన ఉద్యోగులు, మరణించిన వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్లుగా పీఎఫ్‌ సొమ్ము ఒకొక్కరికి రూ. ఐదు లక్షల నుంచి రూ.ఎనిమిది లక్షల వరకు రావాల్సి ఉంది. సర్వీసులో ఉండగా తీసుకున్న అప్పులను చెల్లించేందుకు రిటైర్డ్‌ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

– బేతాళ రాజేంద్ర ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి, ముదినేపల్లి

Updated Date - Mar 05 , 2026 | 12:33 AM