Share News

పెసర పంటకు కష్టకాలం !

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:35 AM

గోదావరి, కృష్ణా కాల్వల కింద రెండో పంటగా సాగుచేసిన పెసల పంటకు కష్ట కాలమొచ్చింది. ఈ ఏడాది పంటకు చీడపీడల తాకిడితో పాటు దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెసర పంటకు  కష్టకాలం !
సత్యనారాయణపురంలో పంటను ్చగ్రేడింగ్‌ చేస్తున్న రైతులు

ఇంకా ఏర్పాటు చేయని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు

చీడపీడలతో తగ్గిన పంట దిగుబడి

ఆందోళనలో రైతులు

దెందులూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):

గోదావరి, కృష్ణా కాల్వల కింద రెండో పంటగా సాగుచేసిన పెసల పంటకు కష్ట కాలమొచ్చింది. ఈ ఏడాది పంటకు చీడపీడల తాకిడితో పాటు దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే కాలం సమీపిస్తున్నప్పటికీ ఇంకా వీటిని కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా 30 శాతం పైబడి పంట కోతలు పూర్తయ్యాయి. ఆరుగాలం పండించిన పెసలను రైతులు ఒబ్బిడి చేసుకుని.. నూర్పిడి చే యడానికి సర్వం సన్నద్ధం అవుతున్నారు. దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్‌, పెదవేగి, భీమడోలు, ఉంగుటూరుల్లో ఐదు వేల ఎకరాల పైబడి ఈ ఏడాది పెసలు పంటను రైతులు సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో దిగుబడి తగ్గి దిగులు చెందుతున్నారు.

‘మొంథా’తో దెబ్బతిన్న రైతు..

గతేడాది తుఫాన్‌ల తాకిడితోపాటు మొంథా తీవ్రంగా వరి రైతులను దెబ్బతీసింది. ఆ పంట చాలా వరకు పోయినప్పుటికి.. రెండో పంటలోనైనా అతి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వచ్చే పెసల పంటపై రైతులు ఆసక్తి కనబర్చారు. ఈ పంటకు రైతులందరూ గ్రామాల్లోని పెట్టుబడిదారులైన పురుగుమందు వ్యాపారులను ఆశ్రయించారు. వ్యవసాయశాఖ ధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. తగిన సూచనలు, సలహాలు ఇచ్చే వారు లేకుండాపోయారు. పెట్టుబడి ఇచ్చేది పురుగుమందు వ్యాపారులే కావడంతో పంట కాలం పూర్తయే సమయానికి ఒకటి లేదా రెండుసార్లు పిచికారీ చేసే పురుగుమందులను వ్యాపారుల లాభాల కోసం రైతులతో నాణ్యమైనవంటూ చెప్పి మందులు అంటకట్టి ఎక్కువ ధర గల పురుగుమందులను నాలుగు లేక ఐదు సార్లు పెసల పంటలకు పిచికారీ చేయించారు. మొదట్లో పంట బాగా ఉన్నప్పటికి పంట చేతికొచ్చే సరికి పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. చివరకు ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు పంట దిగుబడి రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

కొనుగోలు కేంద్రాలెక్కడ ?

ప్రస్తుతం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. రైతులు 30 శాతం నియోజకవర్గంలో పెసల కోతలు పూర్తైన నేపథ్యంలో ఆ పంటలను క్వింటా రూ.7వేలకు పెట్టుబడి పెట్టిన పురుగుమందుల యజమానులే కొనుగోలు చేస్తామని ముందుకొస్తున్నారు. పెట్టుబడి తీసుకుని ఉండడం.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోవడంతో ఏమి చేయాలో తెలియని అయోమయస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు మద్దతు ధర రూ.8,600కు ఇచ్చి పెసలను కొనుగోలు చేసింది. ఇప్పుడా ఆ పరిస్థితి లేక రైతులు ఎవరిని ఆశ్రయించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారో ? అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా పంట కోతలు పూర్తయిన చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రజాప్రతి నిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

వరి పంట తీవ్ర నష్టాలను మిగిల్చింది. పెసల పంట లాభం వస్తుందనుకుని ఎనిమిది ఎకరాల పొలంలో సాగుచేస్తే చీడ,పీడల వల్ల అనుకున్నస్థాయిలో పంట చేతికి రాలేదు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చాలాతక్కువ ధరకు పంటలను దళారులు అడుగుతున్నారు. సత్వరమే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తెరిచి ఆదుకోవాలి

– బలుసు రామచంద్రరావు రైతు, దెందులూరు

ఎకరాకు రూ.7 వేలు నష్టం

దెందులూరు గ్రామ సరిహద్దులోని సత్యనారాయణపురం పరిధిలో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని పెసల పంటను సాగు చేశా. ఎకరానికి మూడు క్వింటాళ్ల చొప్పున పంట దిగుబడి వచ్చింది. తీరా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు క్వింటా రూ.7 వేలకే ఇవ్వమంటున్నారు. దీనివల్ల ఎకరాకు రూ. నష్టపోతున్నా.

– కంచెర్ల కొండయ్య, కౌలురైతు

Updated Date - Feb 27 , 2026 | 12:35 AM