నిఘా కట్టుదిట్టం
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:23 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పోలవరం పర్యటన సంద ర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం పదిన్నరకు సీఎం రాక : ఎస్పీ కిశోర్
పోలవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పోలవరం పర్యటన సంద ర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌శివకిశోర్ మ్యాప్ పాయింటింగ్ ద్వారా సిబ్బం దికి దిశా నిర్దేశం చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ ప్రాంతా లను వినియోగించేలా చూడాలి. రూట్ బందోబస్తు, రూఫ్ టాప్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. కల్వర్ట్ చెకింగ్, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో యాంటీ సబోటేజ్ చెకింగ్ ఆర్వోపీ, కూంబింగ్‌లను క్షుణ్ణంగా నిర్వహించాలి. విధుల్లో అలసత్వం వహి స్తే శాఖా పరమైన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. సీఎం పర్యటన ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
అడుగడుగునా గస్తీ
సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. పోలవ రం నుంచి ప్రాజెక్టులో పవర్‌హౌస్ ప్రాంతాల వరకూ అడుగడుగునా పోలీసు బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర సరిహద్దుల్లోను, మారేడుమిల్లి, రంపచోడవ రం ప్రాంతాల్లో భారీ మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు జరగడం, ఏలూరులో మకాం వేసిన మావోల అరెస్టులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏ ఒక్కరిని పంపడం లేదు. భద్రతా ఏర్పాట్లలో ఇద్దరు ఏఎస్పీలు, తొమ్మిది మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 900 మంది పోలీసు బలగాలు, 150 మంది ప్రత్యేక పోలీసులను వినియోగిస్తున్నారు. ఏలూరు ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, డీఎస్పీలు ఎం.వెంకటేశ్వరరావు, శ్రవణ్‌కుమార్, ప్రసాద్, చంద్రశేఖర్, ఎస్.బి. ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం టూర్ షెడ్యూల్
సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.40 గంటలకు పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టును ఆసాంతం పరిశీలించి, అధికారులు, కాంట్రాక్టు సంస్థతోను సమీక్షిస్తారు. సాయంత్రం 3.35 గంటలకు పోలవరం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి తాడేపల్లి వెళతారు.