Share News

మరింత పెన్షన్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:55 AM

రిటైర్డ్‌ ఉద్యోగుల్లో సీనియర్లకు అదనపు పెన్షన్‌ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌/ ఫ్యామిలీ పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరిస్తూ మంగళవారం జీవోని విడుదల చేసింది.

మరింత పెన్షన్‌

మరింత పెన్షన్‌

వృద్ధాప్యం మురిసెన్‌!

జిల్లాలో 3,500 మందికి

అదనపు ప్రయోజనం

జగన్‌ ప్రభుత్వం కోత పెట్టిన పెన్షన్‌ను పునరుద్ధరించిన

కూటమి ప్రభుత్వం

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 22(ఆంధ్ర జ్యోతి):రిటైర్డ్‌ ఉద్యోగుల్లో సీనియర్లకు అదనపు పెన్షన్‌ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌/ ఫ్యామిలీ పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరిస్తూ మంగళవారం జీవోని విడుదల చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగుల్లో 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు బేసిక్‌ పెన్షన్‌ను 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అదనంగా చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది. గతంలో ఇదే మొత్తంలో అదనంగా పెన్షన్‌ చెల్లించే విధానం ఉండగా, జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు పెన్షన్‌ను ఏడు శాతం, 12 శాతానికి తగ్గిస్తూ 2022 ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీచేసింది. అదనపు పెన్షన్‌ తగ్గింపును వ్యతిరేకిస్తూ అప్పటి నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం సమక్షంలో జరిగిన చర్చలకు అనుగుణంగా అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ను పాత పద్ధతిలోనే 10 శాతం, 15 శాతం చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తాజా ఉత్తర్వుల వల్ల ఏలూరు జిల్లాలో సుమారు 3500 మందికి ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్‌పై అదనపు ఆర్థిక ప్రయోజనం లబిస్తుందని ఖజానా శాఖ జిల్లా అధికార వర్గాలు అంచనా వేశాయి. పెరిగిన పెన్షన్‌ను ఈ ఏడాది డిసెంబరు నుంచి వర్తింపజేస్తారు. ఆ మేరకు వచ్చే ఏడాది జనవరి 1న తీసుకునే పెన్షన్‌కు అదనపు పెంపుదల ఉంటుంది. ఏలూరు జిల్లాలో మొత్తం 13,300 మంది పెన్షనర్లు వున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జీవో విడుదల చేయడంపై ఏపీ ఎన్జీవోల సంఘం, జేఏసీ జిల్లా చైర్మన్‌ సీహెచ్‌.శ్రీనివాస్‌, కన్వీనర్‌ టి.రామారావు, అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ ఆర్‌.ఎస్‌.హరనాథ్‌, కార్యదర్శి ఎన్‌.రామారావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 23 , 2026 | 12:55 AM