పింఛన్.. ప్లీజ్
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:08 AM
గత ప్రభుత్వ హయాంలో అర్హులైన తమకు పింఛన్లను తీసివేశారని కొందరు చెబుతున్నారు. అన్ని అర్హతలు వున్నా తమకు ఇవ్వలేదని మరికొందరు వాపోతున్నారు.
వృద్ధులు వేలల్లో దరఖాస్తులు.. సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు
కొత్త పింఛన్‌లపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
ఏలూరు సిటీ/పెదవేగి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి):గత ప్రభుత్వ హయాంలో అర్హులైన తమకు పింఛన్లను తీసివేశారని కొందరు చెబుతున్నారు. అన్ని అర్హతలు వున్నా తమకు ఇవ్వలేదని మరికొందరు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించలేదు. ఎప్పుడు ఇస్తారంటూ అర్హులు ఎదురుచూస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి వికలాంగత్వం లేని, సంపూర్ణ ఆరోగ్యంతో వున్న వ్యక్తులు రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలతో అక్రమ మార్గాల్లో వికలాంగులు గా సదరం ధ్రువీకరణ పత్రాలను పొంది, దివ్యాంగుల కోటాలో పింఛన్ల లబ్ధిని పొందారు. నాటి పాలకులు తమ అనుచరులకు దోచిపెట్టడడమే ధ్యేయంగా అక్రమ మార్గా లను ఎంచుకుని లబ్ధి కలిగించారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అనర్హుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. కానీ, మధ్యలోనే ఆ చర్యలను ఉపసంహరించు కుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సదరం ధ్రువీకరణ పత్రాలతో వేల సంఖ్యలో అనర్హులు దివ్యాంగ పింఛన్లు పొందారు. దీనిపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిం చినా పూర్తి చేయలేదు. తిరిగి సదరం ధ్రువీకరణ పత్రాల ను తీసుకుని, సమర్పించాలని అధికారులు ఆదేశించారు. సదరం ధ్రువీకరణలో వికలాంగత్వం చాలా మందికి తక్కు వ శాతం రావడం, రాజకీయ ఒత్తిళ్ల కారణంతో దానిని అక్కడితోనే నిలిపేశారు. ఒక్క దెందులూరు నియోజకవర్గం లోనే అక్రమ పింఛనుదారులు వెయ్యి మంది వరకు ఉన్నట్లు అంచనా. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులు 700లోపే ఉన్నారు. జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఉంటారో అంచనా వేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో నిరాదరణకు గురైన అర్హులు, కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశించిన వారికి ఇప్పటికి ఎదురుచూపులే మిగిలాయి. తమకు న్యాయం చేయాలని అర్హులు కోరుతున్నారు.
ఐదేళ్లుగా నిరీక్షణ
మా అబ్బాయికి ఎనిమిదేళ్లు. పుట్టుకతోనే శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. గత ప్రభుత్వ హయాంలో సదరం ధ్రువీకరణ పత్రం వచ్చింది. ఐదేళ్లుగా దివ్యాంగ పింఛను కోసం ఎదురుచూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛను వస్తుందని ఆశించినా ఇప్పటికి ఆ జాడ కనిపించడం లేదు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మా అబ్బాయికి అవసరమైన మందుల కొనుగోలుకే ఎంతో వ్యయమవుతోంది. ప్రభుత్వం దివ్యాంగ పింఛను అందిస్తే కొంత వెసులుబాటు ఉంటంది.
– వినోద్‌కుమార్, చిరుద్యోగి, ఏలూరు
అమ్మకు దివ్యాంగ పింఛన్ ఎప్పుడిస్తారో ?
మా అమ్మ జ్యోతి రెండు కాళ్లకు ఇన్ఫె క్షన్ సోకి ఆరేళ్లుగా మంచానికే పరిమి తమైంది. గత ప్రభుత్వంలో దివ్యాంగ పింఛను కోసం దరఖాస్తు చేసి ఎదురు చూస్తూనే వున్నాం. 50 శాతం వికలాం గత్వం ఉందంటూ సదరం ధ్రువీకరణ పత్రం ఉంది. ఐదేళ్లుగా పింఛను మంజూరు కాలేదు. మా అమ్మను ఎత్తుకుని తీసుకెళ్లడమే తప్ప, నడిచే పరిస్థితి లేదు. దివ్యాంగ పింఛను వస్తే చేదోడు, వాదోడుగా ఉంటుందనే ఆశతో ఉన్నాం.
– పడాల మణిబాబు, కారు డ్రైవర్, ఏలూరు
అర్హుల ఎదురుచూపు
కేవలం వితంతు పింఛన్ విషయంలో భర్త చనిపోతే భార్యకు ఆ నెలలోనే పింఛన్ ఇస్తున్నారు. జిల్లాలో వివిధ కేటగిరీల కింద పింఛన్ల కోసం ఇప్పటి వరకు 3,400 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక పింఛన్ల వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదిస్తామన్న ఎన్నికల హామీ అమలు కావాల్సి వుంది. 60 ఏళ్లు దాటిన వారు కొత్త పింఛన్ల కోసం గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ మొత్తాన్ని ఒకేసారి రూ.4 వేలకు పెంచడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. కిడ్నీ బాధిత లబ్ధిదారులతోపాటు పూర్తి వైకల్యం కలిగి, రూ.15 వేలు పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు ఏలూరు జిల్లాలో 1,400 మంది ఉండగా, వైకల్యం కలిగిన ఇతర దివ్యాంగ పింఛనుదారులు 33,350 మంది ఉన్నారు. వీరిలో పది నుంచి 15 శాతం మంది అనర్హులు ఉన్నట్లు అధికార వర్గాల భోగట్టా.