మొగల్తూరు కాలువకు మోక్షం!
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:39 AM
సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు ఒకటో తేదీన ముఖ్యమంత్రి పర్యటించనుండటంతో మొగల్తూరు ప్రధాన కాలువ ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
గుర్రపుడెక్క, తూడు తొలగింపు.. రైతుల హర్షం
మొగల్తూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి):సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు ఒకటో తేదీన ముఖ్యమంత్రి పర్యటించనుండటంతో మొగల్తూరు ప్రధాన కాలువ ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అధికారులు యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టారు. నిడదవోలు నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రధాన కాలువ మొగల్తూరు వద్ద ఉప్పుటేరులో కలుస్తుంది. తీర ప్రాంతంలోని మొగల్తూరు, కేపీ పాలెం సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు (సీపీడబ్ల్యూఎస్) ఈ కాలువ నుంచే నీటిని లిఫ్ట్ చేస్తారు. అలాగే ఈ ప్రాంతంలో సాగు నీటి అవసరాలకూ ఇదే ప్రధాన వనరు. అయితే కాలువకు ఇది శివారు ప్రాంతం కావడంతో ఎగువ నుంచి భారీగా కొట్టుకొచ్చే గుర్రపుడెక్క, తూడు, చెత్తాచెదారం, జంతు కళేబరాలతో నీటి ప్రవాహం పూర్తిగా స్తంభించిపోయింది. మొగల్తూరు లాకుల వద్ద నీటిమట్టం పడిపోవడంతో పంట బోదెలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎట్టకేలకు డ్రమ్ ఎక్స్‌కవేటర్లతో పనులు
కాలువ ప్రక్షాళనపై గతంలో పలుమార్లు విన్నవించినా పనులు అరకొరగానే సాగాయి. ఆరు నెలల క్రితం పూడికతీత చేపట్టినప్పటికీ, నరసాపురం పట్టణ పరిధిలో జేసీబీలు దిగేందుకు వీలు లేక ఆ భాగాన్ని అలాగే వదిలేశారు. దీంతో నాలుగు నెలలుగా మళ్లీ కాలువలో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయింది. తాజాగా సెప్టెంబరు ఒకటో తేదీన సీఎం ఈ కాలువ మీదుగానే మొగల్తూరు నుంచి నరసాపురం వెళ్లనుండటంతో యంత్రాంగం కదిలింది. గతంలో వదిలేసిన నరసాపురం పట్టణ పరిధిలోని కాలువలో డ్రమ్ మిషన్‌పై ఎక్సకవేటర్‌ను ఏర్పాటు చేసి గుర్రపు డెక్కను, పూడికను తొలగిస్తున్నారు. మొగల్తూరు శివారు వరకు పేరుకుపోయిన తూడును పూర్తిగా తొలగిస్తున్నారు. సీఎం పర్యటన పుణ్యమా అని కాలువకు పట్టిన గ్రహణం వీడటంతో స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లలో బిజీబిజీ
నేతలు, అధికారుల వరుస సమీక్షలు
మొగల్తూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి):మరో మూడు రోజుల్లో సీఎం చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు, నాయకులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఒకటో తేదీ ఉదయం పది గంటలకు మొగల్తూరులో హెలీప్యాడ్ ప్రాంతానికి చేరుకుని గ్రామంలోని లబ్ధిదారులకు పింఛన్ అందించి వారితో మమేకమవుతారు. తర్వాత కాన్వాయ్ నరసాపురం చేరుకుంటుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీన్, జేసీ కె.కల్పశ్రీ, ఏఎస్పీ విశ్వనాధ్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ సలహదారుడు ఎంఏ షరీఫ్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం ఇన్‌చార్జ్ రామరాజులతోపాటు కూటమి నాయకులు సీఎం పర్యటన ప్రాంతాలు పరిశీలించారు. జేసీ కల్పశ్రీ మొగల్తూరు పంచాయతీ పరిధిలోని పెద్దపల్లవ పాలెంలో ఒకే కుటుంబంలో పింఛన్లు పొందుతున్న మైల రాజు, సంకరపు వెంకట నారాయణ, ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం పొందిన మైలా దుర్గ నివాసాన్ని సీఎం సందర్శించనున్నారు. ఇక్కడి ఏర్పాట్లపై సంబందిత అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. సీఎం పర్యటనకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించి విజయవంతమయ్యేలా చూడాలని టీడీపీ ఇన్‌చార్జ్ రామరాజు కోరారు. ఏర్పాట్ల పరిశీలనలో ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ మేకా సుధాకర్ డివిజన్, మండల స్ధాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
సీఎం పర్యటనలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ఎం.రవిబాబు వైద్యాధికారులను ఆదేశించారు. మొగల్తూరులో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ ప్రాంతాన్ని, స్థానిక ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. హెలీప్యాడ్ నుంచి సీఎం పర్యటించే ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వైద్యులు లక్ష్మీపార్వతి, హెన్నా, ఎంపీహెచ్‌వో భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రేవుల పరిశీలన
నరసాపురం : పట్టణంలోని వలంఽఽ దర్, అమరేశ్వర రేవులను శనివారం కలెక్టర్ నాగరాణి, జేసీ కల్పశ్రీ పరిశీ లించారు. సీఎం చంద్రబాబు నరసా పురం పర్యటనలో భాగంగా రేవులను చూసే అవకాశం ఉండటంతో వీటిని శుభ్ర పరుస్తున్నారు. కాన్వాయ్ మార్గాన్ని సీఎంవో అధికారులతో కలిసి పరిశీలించారు. చేపట్టే ఏర్పా ట్లపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ సుధాకర్‌బాబు, తహసీల్దార్ నాగార్జున, కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.