Share News

పెదవాగు ప్రాజెక్టు దశ తిరిగేనా..!

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:24 AM

పెదవాగు ప్రాజెక్టు 18వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది.

పెదవాగు ప్రాజెక్టు దశ తిరిగేనా..!
గండిపడిన పెదవాగు ప్రాజెక్ట్‌

నిధులు మంజూరుకు సీఎం హామీ

నేడు గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ పరిశీలన

వేలేరుపాడు, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): పెదవాగు ప్రాజెక్టు 18వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. 2024లో భారీ వరదల తో గండి పడడంతో రైతులకు సాగు నీరు అందడంలేదు. అప్పట్లో ఏపీ, తెలంగాణ అధికారులు, మంత్రులు గండిపడిన ప్రాజెక్టును పరిశీలించి పునఃనిర్మిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రింగ్‌బండ్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు విడుదల చేయగా ఆ నిధులతో గండిపడిన చోట మర మ్మతులు చేశారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటే సుమారు రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు తయారు చేశారు. ప్రాజెక్టు తెలంగాణలో ఉండగా ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 16వేల ఎకరాలు, తెలంగాణలో 2 వేల ఆయకట్టు ఉంది. రాష్ట్ర విభజనలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంది. అధిక శాతం ఆయకట్టు ఏపీలో ఉండడంతో 85శాతం ఆంధ్రా, 15శాతం తెలంగాణ ప్రభుత్వం భరించేలా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ప్రాజెక్టు పునర్‌వ్యవస్థికరణ వ్యయంలో 85శాతం ఏపీ ప్రభు త్వం భరించాల్సి ఉంది. సరైన స్పందనలేదనే ఆరోపణలతో తెలంగాణ కూడా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. ఒక దశలో ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను గోదావరి రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినా ఇరు రాష్ర్టాల నుంచి స్పందన లేకపోవడంతో ఆ ప్రతిపాదన పక్కకుపోయింది.

ఈ దశలో జీఆర్‌ఎంబీ చైర్మన్‌ దొర్జేగ్యాంబ, సీఎం చంద్రబాబు పెదవాగుపై చర్చించినట్లు సమాచారం. నిధులు మంజూరు చేసేందుకు సీఎం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఇది ఆచరణలోకి వస్తే పెదవాగు ప్రాజెక్టుకు మహర్దశ పట్టనుంది.

1978లో పూర్తయిన ఈ ప్రాజెక్టు క్రమేపీ పూడికతో కట్ట కూడా బలహీనంగా మారింది. కుడి, ఎడమ కాల్వలు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మూడుగేట్లు మాత్రమే ఉండగా కొత్త ప్రతిపాదనలో ప్రాజెక్టు కట్ట పూర్తిస్థాయిలో పటిష్టం చేసి మూడుగేట్ల స్థానంలో మరో రెండుగేట్లు అదనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడానికి 100కోట్లు అవసరం కాగా ఏపీ ప్రభుత్వం వాటా రూ.85కోట్లు విడుదల చేస్తే తాము రూ.15 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మంత్రులు ఇప్పటికే ప్రకటించారు.

నేడు జీఆర్‌ఎంబీ చైర్మన్‌ పరిశీలన

జీఆర్‌ఎంబీ చైర్మన్‌ దొర్జేగ్యాంబ బుధవారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఒక నివే దికను రూపొందిస్తారు. ఈ మేరకు జీఆర్‌ఎంబీ చైర్మన్‌ ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆయన పర్యటనకు తెలంగాణ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. చైర్మన్‌ పర్యటన ఖరారు కావడంతో పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెదవాగు ప్రాజెక్టుకు పూర్వపు వైభవం వచ్చి తమ జీవితాలు వెలుగును ప్రసాదిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:24 AM