Share News

పెదవాగు ప్రాజెక్టుకు పూర్వవైభవం

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:44 AM

పెదవాగు మీడియం ప్రాజెక్టును పునరుద్దరించి పూర్వ వైభవం తెస్తామని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌ పి.దొర్జి గ్యాంబా రైతులకు హామీ ఇచ్చారు.

పెదవాగు ప్రాజెక్టుకు పూర్వవైభవం
పెదవాగు ప్రాజెక్టు వద్ద రైతులతో మాట్లాడుతున్న చైర్మన్‌ దొర్జి గ్యాంబా

నిధులు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం

ఆంధ్ర, తెలంగాణ రైతులతో జీఆర్‌ఎంబీ చైర్మన్‌ దొర్జి గ్యాంబా

వేలేరుపాడు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి):పెదవాగు మీడియం ప్రాజెక్టును పునరుద్దరించి పూర్వ వైభవం తెస్తామని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌ పి.దొర్జి గ్యాంబా రైతులకు హామీ ఇచ్చారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లిలో వున్న ఈ ప్రాజెక్టును బుధవారం ఆయన పరిశీలించారు. గతంలో వచ్చిన వరదలకు ప్రాజెక్టు తెగిపోయిన కారణాలను ఇరిగేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి మించి వరద పోటెత్తడం, సమయానికి గేట్లు మొరాయించటం తదితర కారణాలతో అప్పటికే బలహీనంగా వున్న ప్రాజెక్టు కట్టపై ఒత్తిడి అధికమవడంతో భారీ గండిపడటానికి కారణమైందని అధికా రులు వివరించారు. శిథిలావస్థకు చేరిన మూడింటిలో రెండు గేట్లు మొరాయిస్తున్నాయి. ఈ కారణంగా ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. ప్రాజెక్టు పునఃనిర్మాణంలో భాగంగా మరో రెండు పెంచి ఐదు గేట్లతో ఏర్పాటు చేస్తే ఎంత వరద వచ్చినా దిగువ ప్రాంతాలకు నీరు వదిలే వీలు వుంటుందని, దీని ప్రకారమే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు చైర్మన్‌కు వివరించారు. అనంతరం ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన రైతులతో చైర్మన్‌ మాట్లాడారు. ప్రాజెక్టు పునఃనిర్మించేందుకు ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యామని మంగళ వారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన సందర్భంలో ఆయన పెదవాగు ప్రస్తావన తెచ్చారని ప్రాజెక్టును పునఃనిర్మిం చేందుకు అవసరమైన నిధులు విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే ప్రాజెక్టు మరమ్మతులకు ఇరు రాష్ర్టాలు తమ వాటాలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, పనులు ప్రారంభించి పునర్‌వైభవం తెస్తామని రైతులకు భరోసా కల్పించారు. ఆంధ్రా, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 12:44 AM