పెదపేటలో రామాలయం నిర్మిద్దాం
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:21 AM
ఆకివీడు పెదపేటలో రామాలయాన్ని నిర్మించాలంటూ నగర పంచాయతీ పాలకవర్గం తీర్మా నించింది.ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు తప్పని సరి హైకోర్టు ఆదేశాల మేరకు నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం అత్యవసర కౌన్సిల్ సమావేశం చైర్‌పర్సన్ జామి హైమావతి అధ్యక్షతన జరిగింది.
ఆకివీడు నగర పంచాయతీ కౌన్సిల్ తీర్మానం
డిప్యూటీ స్పీకర్ రఘురామ సహా 20 మంది కౌన్సిలర్ల మద్దతు
తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్‌కు అందజేస్తాం : డిప్యూటీ స్పీకర్ రఘురామ
ఆకివీడు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఆకివీడు పెదపేటలో రామాలయాన్ని నిర్మించాలంటూ నగర పంచాయతీ పాలకవర్గం తీర్మా నించింది.ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు తప్పని సరి హైకోర్టు ఆదేశాల మేరకు నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం అత్యవసర కౌన్సిల్ సమావేశం చైర్‌పర్సన్ జామి హైమావతి అధ్యక్షతన జరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. చైర్‌పర్సన్‌తో కలిపి 20 మంది సభ్యులలో వైస్ చైర్‌పర్సన్ వంగా జోత్స్నదేవి మినహా 19 మందితోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కలిపి మొత్తం 20 మంది రామాలయం నిర్మించా లంటూ తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ ‘కౌన్సిల్ చేసిన ఈ తీర్మానాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేస్తాం. పెదపేట ఆలయంపై రామాలయం అని బ్రిటీష్ కాలం నుంచి రాసి వుంది. 40 ఏళ్లుగా ఆర్య వైశ్యులు విద్యుత్ బిల్లులు కడుతున్నారు. ఒక స్థలంలో గుడి కడతామంటే వచ్చిన వారిని గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. అందరూ కలిసిగట్టుగా ఉంటూ అన్ని మతాలను గౌరవించాలి. పెదపేట గ్రామం కాదు. మున్సిపాల్టీ తీర్మానాన్ని అందరూ అంగీకరించాలి. ఈ రామాలయానికి వున్న రెండు ఎకరాలకు పైగా వున్న స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆకివీడులో తాగునీటి కోసం అమృత్–2లో రూ.73.43 కోట్లు మంజూరయ్యాయి. మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మిస్తాం’ అని అన్నారు. సమా వేశంలో కమిషనర్ జి.కృష్ణమోహన్, మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
సిటింగ్ జడ్జితో విచారణ జరపాలి..
పెదపేటలో వివాదంగా మారిన ఆలయ ప్రాంగణంలో సిటింగ్ జడ్జితో విచారణ చేసి ఆలయం నిర్మాణం చేయాలంటూ చైర్ పర్సన్ జామి హైమావతి, కమిషనర్ జి.కృష్ణమోహన్‌లకు వైస్ చైర్‌పర్సన్ వంగా జోత్స్నదేవి డిసెంట్ అందజేశారు. పెదపేట జనాభా అభిప్రాయాల మేర ఆలయం నిర్మాణం చేయాలని కోరారు.
భారీ బందోబస్తు
పట్టణ పరిధిలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా భీమవరం, తాడేపల్లిగూడెం డీఎస్పీలు రఘువీర్ విష్ణు, విశ్వనాధ్ నేతృత్వంలో సీఐలు శ్రీనివాసరావు, కాళీచరణ్, సత్యనారాయణ, ఎస్‌ఐలు హనుమంతు నాగరాజు, నజీరుల్లా, శ్రీనివాస్‌లతో పాటు రిజర్వర్డ్ పోలీసులు సుమారు యాభై మంది బందోబస్తు నిర్వహించారు.