బుక్..య్యారు!
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:27 AM
పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఒకప్పుడు రైతులే అధికారులు చుట్టూ తిరిగేవారు. పాస్ పుస్తకం వస్తే రైతులకు అదో వరం. ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వం వద్ద సంప్రదింపులు జరిపి పాస్ పుస్తకాలు మంజూరు చేసేలా గట్టి ప్రయత్నాలు చేసేవారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు జారీకి రెవెన్యూ ఆపసోపాలు
వెంటాడుతున్న రీసర్వే తప్పిదాలు
గత ప్రభుత్వంలో 178 గ్రామాల్లో సర్వే
ఇవ్వాల్సినవి 1,27,334 .. ఇప్పటివరకు ఇచ్చింది 56,176
ప్రతినెలా 9న జారీకి కసరత్తు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఒకప్పుడు రైతులే అధికారులు చుట్టూ తిరిగేవారు. పాస్ పుస్తకం వస్తే రైతులకు అదో వరం. ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వం వద్ద సంప్రదింపులు జరిపి పాస్ పుస్తకాలు మంజూరు చేసేలా గట్టి ప్రయత్నాలు చేసేవారు. పాస్ పుస్తకం పొందా లంటే రెవిన్యూ సిబ్బందికి చేయి తడపాల్సిందే. అటువంటిది ఇప్పుడు అధికారులే పట్టాదారు పుస్తకాలు ఇస్తామంటూ రైతులు చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడున్నాసరే సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కెవైసీ చేస్తున్నారు. అయినా సరే పాస్ పుస్తకాలు ఇవ్వలేక రెవిన్యూ సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో రీసర్వే పూర్తయిన 178 గ్రామాల్లో పాస్ పస్తకాలు మంజూ రుకు సన్నాహాలు చేశారు. మొత్తంపైన 1,27,334 పుస్తకాలు రైతులకు పంపిణీ చేయాలి. ఇప్పటిదాకా 56,176 మాత్రమే అందించ గలిగారు. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో దొర్లిన తప్పిదాలు సరిదిద్దేందుకు రెవెన్యూ సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. జాయింట్ ఎల్‌పీ నంబర్‌లు ఇచ్చేశారు. రైతులు భూమి పరిమితిని కుదించేశారు. హద్దులను మార్చేశారు. పేర్లు నమోదులోనూ తప్పిదాలు దొర్లాయి. రీసర్వే పూర్తపోవాలంటూ లక్ష్యాలు విధించడంతోనే తప్పిదాలకు కారణమైంది. సిబ్బంది తక్కువ. మరోవైపు లక్ష్యాలను నిర్దేశించడంతో గ్రామాల్లో తమకు తోచిన రీతిలో పేర్లు నమోదు చేసేశారు.
తప్పులతోనే పాస్ పుస్తకాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు పంపిణీకి శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 110 గ్రామాల్లో 76804 పాస్ పుస్తకాలు కేటా యించింది. అందులోనూ తప్పులు దొర్లాయి. దాంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ముందుగా రైతుల వద్దకు నమూనా పాస్ పుస్తకాన్ని తీసుకు వెళుతున్నారు. అంతా సవ్యంగా ఉందంటూ రైతు చెపితేనే ముద్రణకు పంపుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు జారీకానున్నాయి. ప్రతినెలా తొమ్మిదో తేదీన పాస్ పుస్తకాలు జారీకి చర్యలు తీసుకుంటున్నారు. నెల రోజులపాటు రైతుల వద్ద ఈ కెవైసీ చేసి తదుపరి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇలా తప్పిదాలు లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వడానికి రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో రైతులను సంప్రదిస్తున్నారు.
లక్ష్యాన్ని చేరుకోవడంలో అవస్థలు
ప్రతినెలా నియోకజవర్గంలోని రెండు గ్రామాలను ఎంపిక చేసుకుని పట్టాదారు పాస పుస్తకా జారీకి చర్యలు చేపడుతున్నారు. మార్చి నెలలో 11 వేల పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది రైతులతో సంప్రదింపులు జరిపారు. అయితే ఆరు వేల పాస్ పుస్తకాలకు మాత్రమే అర్హత లభించింది. రైతులు సమ్మతించారు. అంతా ఒకే అన్న తర్వాత ఈకెవైసీ తీసుకున్నారు. వాటిని ముద్రణకు పంపారు. గతంలో మిగిలిన పుస్తకాలను ఇప్పుడు అందజేస్తున్నారు. రైతులు స్థానికంగా అందు బాటులో ఉండడం లేదు. మరోవైపు మ్యూటేషన్ పూర్తికాలేదు. ఇవన్నీ పూర్తి చే యాలంటే సమయం పడుతుంది. పట్టాదారు పుస్తకాల జారీలో జాప్యం జరుగు తోంది. తప్పిదాలు లేకుండా ఇవ్వడానికి రెవెన్యూశాఖ మల్లగుల్లాలు పడుతోంది.