Share News

తీరనున్న పత్తేబాధ!

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:58 AM

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తొలి రైతుబజార్‌గా పేరొందిన పత్తేబాద రైతు బజార్‌లో వసతుల కల్పనకు మార్గం ఏర్పడింది.

తీరనున్న పత్తేబాధ!
పత్తేబాద రైతుబజార్‌

పత్తేబాద రైతుబజార్‌కు మోక్షం.. అభివృద్ధికి రూ.15 లక్షలు మంజూరు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తొలి రైతుబజార్‌గా పేరొందిన పత్తేబాద రైతు బజార్‌లో వసతుల కల్పనకు మార్గం ఏర్పడింది. 2000లో దీనిని ప్రారంభించారు. ఏలూరు నగరంలో చెప్పుకోదగ్గ రీతిలో ప్రజల ఆదరణ చూరగొన్నది. చాలాకాలంగా అభివృద్ధి పనులు లేక వ్యాపారులు, రైతులు, వినియోగదారు లు తీవ్ర ఇక్కట్ల పాలవుతు న్నారు. వర్షం వస్తే రైతు బజార్‌ మునిగే పరిస్థితి నెలకొంది. ఇది నగరంలోనే లోతట్టు ప్రాంతం కావడంతో వర్షం కురిస్తే డ్రెయిన్లలో నీరు రైతుబజార్‌ ప్రాంగణంలోకి ప్రవేశిస్తోంది. ఏళ్ల తరబడి ఇదే దుస్థితి నెలకొంది. ఇక్కడ వినియోగదారులు, వివిధ సామాజిక సేవా కార్యకర్తలు రైతుబజార్‌ను అభివృద్ధి చేయాలని వినతులు సమర్పించారు. ఇటీవల నెలన్నర క్రితం జేసీ అభిషేక్‌గౌడ, అటు తర్వాత రాష్ట్ర రైతుబజార్ల సీఈవో మాఽధవీలత రైతుబజార్‌ స్థితిగతులను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో ఇక్కడ అభివృద్ధి పనులకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇక్కడ సమస్యలను వారు స్వయంగా పర్య వేక్షించడం వల్ల నిధుల మంజూరుకు మార్గం ఏర్పడింది. ఈ మేరకు పత్తేబాద రైతుబజార్‌ అభివృద్ధికి రూ.15 లక్షలు మంజూరయ్యాయి.

భారీగానే దుకాణాలు

ఏలూరు రైతుబజార్‌లో 95కు పైగా వివిధ కూర గాయలు, ఆకుకూరలు, ఇతర దుకాణాలున్నాయి. ఇందులో రైతులకు సంబంధించి 50 వరకు ఉండగా, 45 ప్రైవేట్‌ వ్యక్తులు ఇత రత్రా దుకాణాలున్నాయి. వీరు నెలనెలా అద్దెలు చెల్లిస్తారు. దుకాణాల మధ్యలో పల్లంగా ఉన్న ప్రాంతాలు, ప్లాట్‌ఫారాలను పూర్తిగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి రూ.12.5 లక్షలు వెచ్చించనున్నారు. మినరల్‌ వాటర్‌ అందించేందుకు రూ.2.5లక్షలతో ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మహేంద్ర చెప్పారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మార్కెటింగ్‌శాఖ నిధులతో రైతుబజార్‌కు త్వరలో మోక్షం కలగనుంది. అయితే ప్రధానంగా బయటరోడ్లపైనే దుకాణాల నిర్వహణను అరికడితే ఇంకా మెరుగ్గా రైతుబజార్‌ నడుస్తుంది. రైతులు తాము పండించిన ఉత్పత్తులకు లాభాలు అందుకోవచ్చు.

Updated Date - Aug 27 , 2026 | 12:58 AM