పరిషత్ పోరుకు నగారా..
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:41 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కిం ది. ఓ వైపు పుర పోరులో నామినేషన్ల ఘట్టం ముగిసింది. కూటమి పార్టీల్లో రెబల్స్ అభ్యర్థులను బుజ్జగిస్తూ ఓ కొలిక్కి తెస్తున్న వేళ.. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫి కేషన్ విడుదల చేసింది. బుధవారం నామినేషన్లు స్వీకరిం చనున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఈనెల 21వ తేదీ ఉదయం 10.30 గంటలనుంచి నామినేషన్ల స్వీకరణ
వచ్చే నెల 3న ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
ఏలూరు, భీమవరం జడ్పీల్లో జడ్పీటీసీలకు..
మండల కేంద్రాల్లో ఎంపీటీసీలకు నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల ఖర్చు : జడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు మించరాదు
కొలిక్కి వస్తున్న కూటమి సీట్ల సర్దుబాట్లు
నాయకత్వ లేమితో వైసీపీ శ్రేణుల డీలా
(భీమవరం/ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కిం ది. ఓ వైపు పుర పోరులో నామినేషన్ల ఘట్టం ముగిసింది. కూటమి పార్టీల్లో రెబల్స్ అభ్యర్థులను బుజ్జగిస్తూ ఓ కొలిక్కి తెస్తున్న వేళ.. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫి కేషన్ విడుదల చేసింది. బుధవారం నామినేషన్లు స్వీకరిం చనున్నారు. ఈ తరుణంలో కూటమి నేతలు స్థానాల పంపకంపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. నాయకత్వ లేమితో అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు డీలా పడుతున్నాయి
నామినేషన్ల స్వీకరణ.. నిబంధనలు
ఈ నెల 21న రిటర్నింగ్ అధికారి ఫారం–2లో ఎన్నికల నోటీసు జారీ చేయడంతోపాటు, ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. ఆ రోజు నుంచే అభ్య ర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఎంపీటీసీలు అభ్యర్థులు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ఆర్వో(ఎంపీడీవో)కు పత్రాలు సమర్పించాలి. తహసీల్దార్లు ఇక్కడ ఏఆర్వోలుగా వ్యవహరిస్తారు. జడ్పీటీసీలు అభ్యర్థులు ఏలూరులోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు వేయాలి. ఇక్కడ జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ ఆర్వోగా వ్యవహరిస్తుండగా, జడ్పీ సీఈవోతోపాటు మరో ఆరుగురు ఏఆర్వోలుగా ఉన్నారు.
కొలిక్కి వస్తున్న పంపకాలు
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అధికార కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటుపై పెద్ద కసరత్తే జరుగుతోంది. ఏలూరులో ఇంకా స్పష్టత రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో పంపకాలు పూర్తయ్యాయి. ఉండి నియోజకవర్గంలో ఆకివీడు ఎంపీపీ, కాళ్ల జడ్పీటీసీ స్థానాలను జనసేనకు కేటాయించారు. ఆకివీడు జడ్పీటీసీ, కాళ్ల ఎంపీపీ, ఉండి ఎంపీపీ, జడ్పీటీసీ, పాలకోడేరు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు టీడీపీకి దక్కాయి. భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం ఎంపీపీ, భీమవరం జడ్పీటీసీలు జనసేనకు.. భీమవరం ఎంపీపీ, వీరవా సరం జడ్పీటీసీ స్థానాలు టీడీపీకి కేటాయించారు. పాలకొల్లు నియోజక వర్గంలో యలమంచిలి జడ్పీటీసీని జనసేనకు ఇచ్చారు. మంత్రి నిమ్మల చొరవతో మిగిలిన యలమంచిలి ఎంపీపీ, పాలకొల్లు రూరల్ ఎంపీపీ, జడ్పీటీసీల్లో టీడీపీ పోటీ చేయనుంది. తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వ్యూహాత్మకంగా ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆచంట, నర్సాపురం పరిధిలోని రెండు మండలాల్లో సీట్ల సర్దుబాటు మంగళవారానికి కొలిక్కి రానుంది.
తాడేపల్లిగూడెంలో వీడని ఉత్కంఠ
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. పెంటపాడు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను జనసేనకు.. తాడేపల్లిగూడెం రూరల్ స్థానాలను టీడీపీకి కేటాయించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రతిపాదించారు. అయితే, టీడీపీ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి దీనికి సమ్మతించడం లేదు. రెండు మండలాల్లోనూ రెండు పార్టీలకు చెరో పదవి (ఒక మండలంలో ఒక పార్టీకి ఎంపీపీ, రెండో పార్టీకి జడ్పీటీసీ) ఉండాలని ఆయన సూచిస్తున్నారు.
వైసీపీలో వేట
మరోవైపు అర్ధబలం, అంగబలం ఇచ్చే నాయకులు దూరం కావడంతో వైసీపీ శ్రేణులు అత్యధిక నియోజకవర్గాల్లో డీలా పడ్డాయి. నర్సాపురంలో ఆ పార్టీ జిల్లా అధ్చ్యక్షుడు వైసీపీ బలాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ రంగరాజు బలమైన అభ్యర్థులను తమ పార్టీ నుంచి రంగంలోకి దింపేలా నిత్యం కేడర్‌తో సంప్రదింపులు సాగిస్తున్నారు. ఏలూరు జిల్లాలోనూ ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు పట్టుదల కనబరుస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను రంగంలోకి దింపడానికి అన్వేషణ ప్రారంభించింది.
డిపాజిట్, ఎన్నికల వ్యయం
నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ముగ్గురిని మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థికి చెందిన ఒక వాహనాన్ని మాత్రమే కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు అనుమతిస్తారు. అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలతోపాటు నిర్ణీత ధరావతు చెల్లించాలి. ఎంపీటీసీ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500, ఇతరులు రూ.3 వేలు డిపాజిట్ చెల్లించాలి. వీరి ఎన్నికల ఖర్చు నాలుగు లక్షల రూపాయలకు మించకూడదు. జడ్పీటీసీ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఇతరులు రూ.6,000 డిపాజిట్ కట్టాలి. వీరు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఎన్నికల వ్యయం చేయవచ్చు.
షెడ్యూల్
ఎంపీటీసీ/జడ్పీటీసీల నామినేషన్ల తేదీ : అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు
నామినేషన్ల పరిశీలన: 24వ తేదీ
అభ్యంతరాల స్వీకరణ: 25వ తేదీ
అభ్యంతరాల పరిష్కారం: 26వ తేదీ
నామినేషన్ల ఉపసంహరణ.. తుదిజాబితా ప్రకటన: 27వ తేదీ
పోలింగ్ తేదీ: నవంబరు 3వ తేదీ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు
అవసరమైతే రీపోలింగ్: 4వ తేదీ
కౌంటింగ్, ఫలితాలు విడుదల: 5వ తేదీ