పాలకవర్గాలకు ముగిసిన గడువు
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:00 AM
మండల ప్రజా పరిషత్(ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్(జడ్పీ) పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది.
పాలకవర్గాలకు ముగిసిన గడువు
నేటితో మండల పరిషత్, రేపటితో జిల్లా పరిషత్‌కు..
ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం
ఎన్నికల ముంగిట మొదలైన రాజకీయ వేడి
(ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి):
మండల ప్రజా పరిషత్(ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్(జడ్పీ) పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. మండల ప్రజా పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం ఈ నెల 23వ తేదీతో, జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం 24వ తేదీతో ముగియనుంది. దీంతో ఇప్పటి వరకు పదవుల్లో ఉన్న ఎంపీ టీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్ పర్సన్ పదవీకాలం పూర్తవుతుంది. మండల ప్రజా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం బుధ వారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేకాధి కారుల నియామకానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమించను న్నారు. జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగియ నుంది. దీంతో ఇప్పటివరకు పదవుల్లో ఉన్న జడ్పీ చైర్‌పర్సన్, జడ్పీటీసీల పదవీకాలం కూడా పూర్తవుతుంది. రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్‌ల విభజన జరిగిన నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజా పరిషత్‌కు ప్రత్యేకాధికారిగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవహరిస్తారు. ప్రత్యేకాధికారుల పాలన గడువు ఆరు నెలల వరకు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు పూర్తై కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.
జిల్లాలో మొదలైన ఎన్నికల వేడి
ఎంపీపీ, జడ్పీ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుండటం, మరోవైపు జడ్పీ, ఎంపీపీ ఎన్నికలను త్వరలో నిర్వహిస్తారన్న రాష్ట్ర ప్రభుత్వ సంకేతాలతో జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులకు అభ్యర్థుల ఎంపికపై రాజకీ య పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎంపీ టీసీ అభ్యర్థుల ఎంపికను గ్రామాల్లోని నాయకులు చూసుకుంటారని, ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు జడ్పీ చైర్మన్ ఎంపిక వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానాలు పర్యవేక్షిస్తా యని వివిధ పార్టీల నాయకులు చెబుతున్నారు. అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నేటి నుంచి ఏలూరు కార్పొరేషన్‌లో
రిజర్వేషన్లకు
కసరత్తు
ఏలూరు/టు టౌన్, సెప్టెంబరు 22(ఆంధ్ర జ్యోతి):ఏలూరు కార్పొరేషన్ డివిజన్లలో ఫొటో లతో కూడిన ఓటర్ల జాబితాలను అధికారులు మంగళవారం ప్రదర్శించారు. దీంతో ఈ నెల 23 నుంచి ఈ నెలాఖరు వరకు డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియను చేపడతారు. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఓటర్ల జాబితాల ఆధారంగా కార్పొరేషన్ సిబ్బంది ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లను డివిజన్లు, పోలింగ్ కేంద్రాల ఆధారంగా డోర్ నెంబర్ల వారీగా ఇంటింటికి తిరిగి ఈ వర్గాలను గుర్తిస్తారు. 23 నుంచి 25 వరకు 62 డివిజన్లల్లో చేపట్టి ఓటర్ల సంఖ్యలను నిర్థారిస్తారు. 26న ఈ జాబితాలను ప్రదర్శిస్తారు. వీటిపై 27, 28వ తేదీల్లో ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 29, 30వ తేదీల్లో అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబరు 1న పోలింగ్ కేంద్రాల వారీగా ఎస్టీ, ఎస్టీ, మహిళా ఓటర్ల వారీగా పురపాలక శాఖ డైరెక్టర్‌కు నివేదిస్తారు. బీసీ ఓటర్లకు కూడా పై పద్ధతి ద్వారా గుర్తిస్తారు. అనంతరం పురపాలక శాఖ డైరెక్టరేట్ నుంచి డివిజన్ల వారీగా రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటిస్తారు.