పర్యాటక బోటు కదిలేదెప్పుడు?
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:31 AM
పాపికొండల పర్యాటక బోట్లు వారం రోజులుగా నిలిచిపోయాయి.
నిలిచిన పాపికొండల పర్యాటకం
అనుమతి కోసం నిర్వాహకుల ఎదురుచూపులు
పోలవరం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): పాపికొండల పర్యాటక బోట్లు వారం రోజులుగా నిలిచిపోయాయి. ఒక బోటు సాంకేతిక కారణాలతో గోదావరిలో నిలిచిపోవడంతో రంపచోడవరం ఆర్డీవో స్వాతి ఆదేశాల పాపి కొండల పర్యటన బోట్లను ఏపీ టూరిజం అధికారులు నిలిపివేశారు. బోట్ల తనిఖీ అనంతరం అనుమతి ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో 15 బోట్లు గండిపోచమ్మ ఆలయ సమీపంలోని బోట్ పాయింట్ వద్ద నిలిపి ఉంచారు. సిబ్బంది జీతాలు, నిర్వహణ భారంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్ప టికే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకున్న పర్యాటకుల సొమ్ము తిరిగి ఇవ్వడంతో నష్ట పోయామని బోటు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల సీజన్‌లో నీటి ప్రవా హవేగం, నీటిమట్టం పెరిగితే టూరిజం రాక పోకలు నిలిచిపోతాయని, నాలుగు నెలల పాటు తమతో పాటు బోటు సిబ్బంది ఉపాధి నిలిచిపోతుందన్నారు.
పర్యాటక బోట్ల నిర్వహణపై సుమారు 300 మంది ఉపాధి పొందుతున్నామని బోట్లు నిలిపివేయడం వల్ల మూడు వందల మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయని అధికారులు స్పందించి సత్వరమే బోట్ల తనిఖీ నిర్వహించి అనుమతి ఇప్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీ టూరిజం అధికారి గంగబాబును వివరణ కోరగా రంపచోడవరం ఆర్డీవో, అధికారులు బోట్ల తనిఖీ నిర్వహించాల్సి ఉందన్నారు. బోట్ల ఫిట్‌నెస్, అనుమతులు, రక్షణ చర్యలు, కాకి నాడ పోర్టు అధికారుల పర్యవేక్షణ సంబం ధిత పత్రాలు, లైసెన్సుల తనిఖీ నిర్వహించిన అనంతరం అనుమతి ఇస్తామన్నారు.