పెరిగిన బొప్పాయి సాగు
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:48 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బొప్పాయి సాగువిస్తీర్ణం పెరిగింది. పండించిన రైతులు మంచి లాభాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు
ఈ ఏడాది పంట ఆశాజనకం
లాభాల కోసం రైతులు ఎదురుచూపు
తాడేపల్లిగూడెం, మార్చి 5(ఆంఽధ్రజ్యోతి) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బొప్పాయి సాగువిస్తీర్ణం పెరిగింది. పండించిన రైతులు మంచి లాభాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బొప్పాయికి ఆరోగ్యపరంగా వినియోగం పెరిగింది. వైద్యులు బొప్పాయి ఆరోగ్యప్రదాయిని అని ఈకాయలు తినడం మంచిదని సూచిస్తున్నారు. వీటి వినియోగం పెరిగి లాభాలు రావడంతో సాగు విస్తీర్ణం పెంచారు. ఈ ఏడాది అత్యధిక లాభాలు సాధించవచ్చని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా బొప్పాయి సాగు తూర్పుగోదావరి జిల్లాలోని ముక్కామల, పెరవలి, ఖండవల్లి, ప్రకాశరావుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాలో ద్వారకాతిరుమల, పెదవేగి, భీమడోలు, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో బొప్పాయిని సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వేసిన తోటులు ఇప్పుడిప్పుడే పరిపక్వ దశకు చేరుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇక్కడ పండించిన తోటల నుంచి కాయలు మార్కెట్‌కు వస్తాయి.
ప్రస్తుతం కర్నాటకలోని బళ్లారి, గుల్బర్గ నుంచి రెడ్‌లేడి రకానికి చెందిన బొప్పాయి వస్తుంది. హోల్‌సేల్‌గా తాడేపల్లిగూడెం మార్కెట్లో కిలో రూ.23 నుంచి 24 మధ్య రిటైల్ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఇక రిటైలర్స్ వినియోగదారులకు రూ.35 నుంచి 40 మధ్య విక్రయిస్తున్నారు. అక్కడి రైతు వద్ద మాత్రం కిలో రూ.10 నుంచి 15వరకు మాత్రమే ఇస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు పేరుతో, నాణ్యత వంకతో పండించిన రైతుకు గిట్టుబాటు కావడం లేదు. వ్యాపారులు సిండికేట్‌గా మారి బొప్పాయి ధరను పెరగనివ్వకుండా అక్కడి రైతులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ధరలేక పోయిన రంజాన్ మాసం కావడంతో బొప్పాయికి మరింత డిమాండ్ పెరిగింది. రిటైల్ వ్యాపారులు మాత్రం ధర దిగకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
పంట ఆశాజనకం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం 500 ఎకరాల్లో సాగు చేస్తే ఈ ఏడాది ఏకంగా వెయ్యి ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది ఎకరాకు ఖర్చులు పోను రూ.1.5లక్షలు వచ్చింది. ఎకరాకు 25 నుంచి 50 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది పంట ఆశాజనంకంగా ఉంది. ఎక్కువగా తెగుళ్లు ఆశించలేదు. ఈమేరకు ఎకరాకు 50 టన్నులపైనే పంట వస్తుందని రైతులు ఆశగా ఎదరుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎకరాకు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బొప్పాయి రకాలు ఇవే..
తైవాన్ 786 లేదా రెడ్‌లేడీ ఇది మంచి దిగుబడి ఇస్తున్న రకం. మంచి నాణ్యతతో పాటు నిలువకు ఆగుతుంది. కాని వైరస్‌ను తట్టుకునే సామర్థ్యం తక్కువ. కో–15 రకం వైరస్‌ను తట్టుకుంటుంది. స్థిరమైన దిగుబడి ఉంటుంది. గైనోడిసియస్ రకాలు ఇక్కడి నేలలకు మంచి అనుకూలంగా ఉంటాయని ఉద్యాన శాస్త్రవేతలు చెబుతున్నారు.