చిన్నబోయారు!
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:12 AM
పెద్ద బరుల నిర్వాహకులు కోట్ల లాభాలను చవిచూస్తే.. చిన్న చిన్న బరులు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఏడాది హైటెక్ కోడిపందేల బరులతో చిన్న,చితకా శిబిరాలు వెలవెలబోయాయి.
పెద్దబరులదే హవా..చిన్న బరుల నిర్వాహకుల లబోదిబో
కాస్త గట్టెక్కించిన గుండాట, పేకాట శిబిరాలు
ఈసారి ఎక్కడికక్కడ వెలసిన బరులు
అనుమతి పేరిట వసూళ్ల పర్వం
ఏలూరు,జనవరి 17(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందడి ముగిసింది. వచ్చిన ప్రయాణికులు, పందెం రాయుళ్లు తిరుగుముఖం పట్టారు. మరోవైపు మూడు రోజులుగా అరుపులు, కేకలు, కేరింతలు, డ్యాన్స్‌లు, మ్యూజికల్, డబ్బు మిషన్ల లెక్కింపుల సౌండ్, వాహ నాలతో కిటకిటలాడిన పార్కింగ్ ప్రదేశాలు శనివారం నిశ్శబ్దం నెలకొంది. శనివారం కూడా పందేలకు అనుమతి ఇస్తారని ఎదురుచూసిన నిర్వాహకులకు నిరాశే మిగిలింది. పట్టణం, గ్రామం అన్న తేడా లేకుండా ఈ సారి ప్రతి ఊరిలోను బరులు వేశారు. గతంతో పోలిస్తే బరుల సంఖ్య పెరిగాయి. పందెం రాయుళ్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే పెద్ద బరుల నిర్వాహకులు కోట్ల లాభాలను చవిచూస్తే.. చిన్న చిన్న బరులు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఏడాది హైటెక్ కోడిపందేల బరులతో చిన్న,చితకా శిబిరాలు వెలవెలబోయాయి. జిల్లాలో నారాయణ పురం, దుగ్గిరాల, మీర్జాపురంలో భారీగా ఏర్పాటు చేసిన హైటెక్ బరుల వైపే పందేంరాయుళ్లు మొగ్గు చూపారు. జిల్లా అంతటా కోడిపందేలు జోరుగానే సాగినా చిన్న,చితకా బరులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు మూడు రోజుల పందేల్లో అధికశాతం నష్టపోయారు. కొంతమంది గుండాట, పేకాట శిబిరాలతో కాస్త గట్టెక్కారు. బెల్టు షాపుల ద్వారా మద్యం తరలించి అదనంగా రేట్లు పెంచి అమ్మడం, నాన్‌వెజ్ వంటకాలు, బిర్యానీల విక్రయాలే వీరిని ఆదుకున్నాయి. గతంలో లేని విధంగా ఊహించని రీతిల్లో ఎక్కడికక్కడ సమీప గ్రామాల్లో ఓ మోస్తరు పందేలు జోరుగా సాగినా చాలాచోట్ల నిర్వాహకులకు నిరాశే ఎదురైంది. భీమడోలు, ఉంగుటూరు, దెందు లూరు, పెదపాడు, ఏలూరు రూరల్, బుట్టాయూడెం, కామవరపుకోట, టి.నరసాపురం, చింతలపూడి, లింగపాలెం శివారు ప్రాంతాల్లో సంక్రాంతి రోజున పందేలు ఊపందుకోలేదు. భోగి రోజున పరవాలేదని పించినప్పటికీ సంక్రాంతి, కనుమ రోజుల్లో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గుండాట, పేకాటలతోనే శిబిరాలను నడిపించేశారు. దాదాపుగా 75 బరుల వరకు చిన్న, చితకా ఏర్పాట్లు చేసిన వారు అతికష్టం మీద బయట పడ్డారు. గుండుగొలను, ఉంగుటూరు, చాటపర్రు, జాలిపూడి, శ్రీపర్రు, గుడివాకలంక, మల్కాపురం, చొదిమెళ్ల, అప్పనవీడు గ్రామాల్లో ఈ సారి పందేలు జోరుగా సాగలేదు.
షరా మామూళ్లే..
గ్రామ, మండల కేంద్రాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేసుకునే విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అనుచరగణం, కాస్త పేరొందిన నాయకులే అనుమతిలిచ్చేసి వసూళ్ల దందాలకు దిగారు. అటువైపుగా పోలీసులు పండుగ మూడు రోజులు కన్నెత్తి చూడకుండా నడుచుకునేలా డీల్స్ మాట్లాడారు. ఊరికి దూరంగా అయితే ఒక రేటు, దగ్గరగా అయితే మరో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో నిర్వాహకులు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వరకు చోటా, మోటా నాయకు లకు ఏకమొత్తంగా సమర్పించుకున్నారు. చివరకు బరుల నిర్వాహకుల సంగతి ఎలా ఉన్నా పందేల పేరుతో దాదాపు అన్నిచోట్ల చోటా, మోటా నాయకులు సొమ్ములు దండుకున్నారు.
పందేల్లో చిన్నగొడవ.. రూ.14 లక్షల నష్టం
కొయ్యలగూడెం : పందేల్లో జరిగిన చిన్న గొడవకు పందెం నిర్వాహకుడికి సుమారు రూ.14 లక్షలు నష్టం వాటిల్లింది. కొయ్యలగూడెం పట్టణానికి ఆనుకుని ఉన్న ఒక గ్రామంలో ఒక నిర్వాహకుడు భారీగా కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. భారీ టెంట్లు వేసి పందెంరాయుళ్లను ఆకర్షించాడు. పందేల్లో ఎక్కువగా పందేలు కొట్టినవారికి రోజుకు ఒక బుల్లెట్ అని ప్రకటించి మూడు బుల్లెట్లను అక్కడ ఏర్పాటు చేశాడు. ముసుగుపందేంలో గెలుపొందిన పందెం రాయుడికి కాసు బంగారం ప్రకటించాడు. మొదటి రోజు పందేలు బాగానే జరగ్గా ఎక్కువ పందేలు గెలుపొందిన వ్యక్తికి బుల్లెట్ బహుకరించారు. ముసు గు పందెం విజేతకు కాసు బంగారం బహుకరిం చారు. రెండోరోజు ఒక పందేం విషయంలో విజేతను నిర్ణయించడంపై తలెత్తిన చిన్న గొడవ కాస్తా ముదరడంతో పందేలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తనకు రూ.14 లక్షల వరకు నష్టం వాటిల్లిం దని నిర్వాహకుడు వాపోతున్నాడు.
ఈసారి కలిసిరాని బరులు
నూజివీడు టౌన్ : నూజివీడు నియోజకవర్గంలో ఈసారి గ్రామాల్లో కోడిపందేల బరులు నిర్వాహకులకు నష్టాలను మిగిల్చాయి. గత పందేలతో పోలిస్తే ఈ ఏడాది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ పందేంరాయుళ్లను ఆహ్వానించారు. అధిక పందేలు గెలుపొందిన వారికి బుల్లెట్లు నుంచి కారు వరకు బహుమతులు ప్రకటించారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన పందెం రాయుళ్లు సపోర్టు పందేలను (బయట నుంచి వచ్చినవారు) సైతం ఆర్గనైజ్ పందేలుగా మార్చారు. ఆర్గనైజ్ వైపు కాకుండా పందేలను సాధారణంగా చూడడానికి వచ్చిన పందేరాయుళ్ల వైపు హెచ్చు పందేలు పట్టారు. దీంతో బయట నుంచి వచ్చినవారు లాభపడగా, సాధారణ పందెంరాయుళ్లు నష్టపోవాల్సి వచ్చింది. సంక్రాంతి కోడిపందేం వరిస్తుందని కొందరు అప్పులు చేసి మరీ పందేలు వేసి డబ్బు పోగొట్టుకున్నారు.
పేకాట గొడవలో గొలుసు చోరీ
ఆకివీడు రూరల్ : గుమ్ములూరులో పేకాట వద్ద జరిగిన గొడవలో తన నాలుగు కాసుల బంగారు గొలుసు దొంగిలించారని పోలీసులకు చెప్పినా, 100కు కాల్ చేసినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు.
మూడు నెలల జీతం పందెంపాలు
కాళ్ల : తెలంగాణకు చెందిన మహేశ్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. నెలకు రెండు లక్షల జీతం వరకు వస్తుంది. సంక్రాంతికి కాళ్లకు చెందిన మిత్రుడి ఇంటికి వచ్చాడు. పెద అమిరం లో ఏర్పాటు చేసిన కోడి పందేల్లో పాల్గొని రూ.4 లక్షలు, కోతాట(పేకాట)లో మరో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడు నెలల జీతం సొమ్మును కేవలం మూడు రోజుల్లో జూదంలో సమర్పించుకున్నాడు. సంక్రాంతి మూడు రోజులు ఎంజాయ్ చేయడం ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదని అతను చెప్పడం కొసమెరుపు.