కుర్చీ ఖాళీ
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:13 AM
పంచాయతీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం నేటితో ముగియనుంది. సర్పంచ్‌లు ఇకపై మాజీలు కానున్నారు. రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది.
సర్పంచ్‌లు ఇక మాజీలు
నేటితో ముగిసిన పాలకవర్గాల గడువు
చేదు– తీపి అనుభవాలతో
వైదొలగుతున్న సర్పంచ్‌లు
పాలన కోసం ప్రత్యేక అధికారులు సిద్ధం
కొత్త వారు వచ్చే వరకు ప్రత్యేక పాలనే
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పంచాయతీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం నేటితో ముగియనుంది. సర్పంచ్‌లు ఇకపై మాజీలు కానున్నారు. రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ప్రతి పంచాయతీకి ప్రత్యేక అధికారిని నియమించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టేవరకు ప్రత్యేక పాలనే కొనసాగుతుంది.. చేదు..తీపి అనుభవాలతో తమ పదవుల నుంచి సర్పంచ్‌లు వైదొలగారు.. జిల్లాలో 409 పంచాయతీలుంటే పట్టణాల్లో విలీనసమస్యతో 28 పంచాయతీలకు పాలక వర్గాలు లేవు.
పాలక వర్గాల గడువు ముగియడంతో జిల్లావ్యాప్తంగా మార్చి 31న చివరి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఐదేళ్లపాటు పంచాయతీలకు చేసిన సేవలను సర్పంచ్‌లు మననం చేసుకున్నారు. పలు నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలను సన్మానించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. వైసీపీ హయాంలో లేని గౌరవం కూటమిలో దక్కిందంటూ పాలకవర్గాలు చర్చించుకున్నాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీ సానుభూతి పరులుగా విజయం సాధించినప్పటికీ అప్పట్లో పంచాయతీలకు పెద్దగా మన్నన లేకుండా చేసేశారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. నిర్వహణ వ్యయమంతా పంచాయతీలది. సచివాలయాలపై పెత్తన మంతా మండల పరిషత్‌లదీ అయ్యింది. పంచాయతీల్లో సిబ్బంది సెలవు పెడితే సర్పంచ్‌లకు తెలియపరచాల్సి వచ్చేది. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది మాత్రం మండల పరిషత్ అభివృద్ధి అధికారికి చెప్పుకొనేవారు. ఇలా గ్రామాల్లో పంచాయతీలకు సమాంతరంగా ఏర్పాటైన సచివాలయాలపై సర్పంచ్‌లకు ఎటువంటి ప్రమేయం లేకుండా పోయింది. దీనిపై సర్పంచ్‌లంతా మనోవేదన పడ్డారు. గత ప్రభుత్వంలో నిధులు కూడా మంజూరు చేయలేదు. పంచాయతీ నిధులను పక్క దారి పట్టించారు. ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకున్నారు. కనీస అభివృద్ధి పనులు కూడా పంచాయతీల్లో చేపట్టలేక పోయారు. కేవలం మేజర్ పంచాయతీల్లోనే సొంత నిధులు కాస్త ఉంటే వాటితో కొద్దిపాటి అభివృద్ధి పనులు చేశారు. ఆ బిల్లులు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం నానా తిప్పలు పెట్టింది.
రెండేళ్ల నుంచి పూర్వ వైభవం
మూడేళ్లపాటు కనీస గౌరవానికి నోచుకోని సర్పంచ్‌లు కూటమి ప్రభుత్వంలోనే కాస్త ముఖమెత్తుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయ తీలను బలోపేతం చేశారు. సాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు గరిష్టంగా రూ. 25 వేల వరకు ఖర్చు పెట్టుకునే వెసులు బాటు కల్పించారు.పంచాయతీలకు జమయ్యే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించకుండా నేరుగా ఖర్చు పెట్టుకునే అవకాశమిచ్చారు. బిల్లుల మంజూరులో ఆంక్షలను ఎత్తివేశారు. ముందుగా ఆమోదం పొందిన పనులకు బిల్లు పెట్టుకున్న 24 గంటల్లోనే మంజూరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.పంచాయతీల్లో పదోన్నతులు కల్పించింది. సిబ్బందిలో ఉత్సాహం నింపింది. కూటమి ప్రభుత్వంలోనే జిల్లాలో దాదాపు ఉపాధి పథకంలో రూ.86 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.100 కోట్లు మంజూరు చేశారు.దాంతో పల్లెల్లో అభివృద్ధి జోరందుకుంది. వైసీపీ మద్దతులో ఆ పార్టీ నేతలే సర్పంచ్‌లుగా ఎన్నికైన ప్పటికీ కూటమిలోనే తమకు గౌరవం దక్కిందన్న భావన పాలకవర్గాల్లో నెలకొంది. కూటమి ఎమ్మెల్యేలతో సర ్పంచ్‌లు సఖ్యత ఏర్పరచుకున్నారు. ఇలా వైసీపీ సానుభూతిపరులైన సర్పంచ్‌లు కూడా కూటమి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు చెప్పుకొంటూ సన్మానించిన సందర్భాలు ఉన్నాయి.
రేపటి నుంచి ప్రత్యేక అధికారులే
పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది. రూర్బన్ పంచాయతీలకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించనున్నారు. జిల్లాలో జనాభా,ఆదాయం ప్రాతిపదికన 20 పంచాయతీలు రూర్బన్ పంచాయ తీలుగా ఎంపికయ్యాయి. మిగిలిన వాటికి మాత్రం గతంలో మాదిరిగా మూడు లేదా నాలుగు పంచాయ తీలకు కలిపి ఒక ప్రత్యేక అధికారిని నియమించ నున్నారు. ఏప్రిల్ మూడో తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. బిల్లులు మంజూరులో మాత్రం ప్రభుత్వం ముందుగానే మేల్కొంది. డివిజనల్ అభివృద్ధి అధికారి పరిశీలన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తున్నారు. నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం డీడీవోల పరిశీలన కోసం బిల్లులను పంపాలంటూ ఆదేశాలు జారీచేసింది. కొత్త పాలకవర్గాలు ఏర్పాట య్యేంత వరకు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.