సీటుకో రేటు..!
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:54 PM
పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. పదవి దక్కించుకోవడం, ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడమే లక్ష్యంగా ఆశా వహులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
సర్పంచ్‌గా ఏకగ్రీవానికి కోట్లు ఆఫర్
ఆచంటలో రూ.2కోట్లు, మోదుగ్గుంటలో 60 లక్షలు
గ్రామాభివృద్ధికి నిధులు, భూములు, వంతెనల హామీలు
నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. పదవి దక్కించుకోవడం, ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడమే లక్ష్యంగా ఆశా వహులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సర్పంచ్‌గా అవకాశం కల్పి స్తే సొంత ఖర్చుతో గ్రామాభివృద్ధి చేస్తామంటూ కోట్ల రూపాయల నిధులు, భూములు, వంతెనల నిర్మాణాలను ముందుపెడుతు న్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే భారీ నజరా నాలకుతోడు అభ్యర్థుల హామీలతో పల్లెల్లో ‘ఆఫర్ల ట్రెండ్’ నడు స్తోంది. మరోవైపు మేజర్ పంచాయతీల్లో కూటమి ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో వారిని బుజ్జగించి రాజీ చేయడం నేతలకు తలనొప్పిగా మారింది.
ఆచంటలో రెండు కోట్లు!
ఆచంట మేజర్ పంచాయతీ రూర్బన్ పంచాయతీగా మారింది. నగర పంచాయతీ తరహాలో ఇక్కడ పాలన ఉండనుంది. ఈ సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు కావడంతో కూటమిలో పోటీ నెలకొంది. తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రెండు కోట్లు ఇస్తానని ఓ అభ్యర్థి ప్రకటించారు. దీంతో ఏకగ్రీవం అవుతుందని ఆశించినా.. మరో వర్గం కూడా తెరపైకి రావడంతో ఇద్దరు అభ్యర్థులు గట్టిగా పోటీ పడుతున్నారు.
భూములు, వంతెనలు ఇస్తామంటూ..
భీమవరం రూరల్ మండలం గొల్లవానితిప్పలో ఓ అభ్యర్థి గ్రామస్తులతో సమావేశమై ఏకంగా రెండు ఎకరాల భూమి ఇస్తానని ప్రకటించారు. దీంతో పోటీలో ఉన్న మరో అభ్యర్థి గ్రామసభ ఏర్పాటు చేసి తాను ఎంత ఇస్తానో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మారంపల్లిలో సర్పంచ్ పదవి కోసం 15 లక్షలు ఇచ్చేందుకు ఆశావహులు ముందుకొస్తుండగా.. అదే మండలంలోని మోదుగ్గుంటలో గ్రామాభివృద్ధికి అరవై లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంతర్గతంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పాలకోడేరు మండలం కొండేపూడిలో ఓ అభ్యర్థి ఏకంగా వంతెన నిర్మిస్తానని ప్రకటించారు.
నేటి నుంచి తొలి విడత నామినేషన్లు
జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు శనివారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సాపురం రూరల్, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, వాసవి పెనుగొండ మండలాల పరిధిలోని 96 పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.