Share News

పంచాయతీ నిధులకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:28 AM

పంచాయతీలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పంచాయతీ నిధులపై ఆంక్షలను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

పంచాయతీ నిధులకు గ్రీన్‌సిగ్నల్‌

ఎం బుక్‌ బిల్లుల మంజూరుకు ప్రభుత్వం ఓకే

ఉత్తర్వుల కోసం పంచాయతీల ఎదురుచూపు

ఆర్థిక సంఘం నిధులపై ఇప్పటిదాకా ఆంక్షలు

పారిశుధ్య నిర్వహణ, సిబ్బంది వేతనాలకే వెసులుబాటు..

(భీమవరం–ఆంధ్రజ్యోతి) : పంచాయతీలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పంచాయతీ నిధులపై ఆంక్షలను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా ఎం బుక్‌ బిల్లులను కూడా మంజూరు చేసేలా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పంచాయతీల్లో అభివృద్ధి పనులన్నీ ఎంబుక్‌లో నమోదు చేసి బిల్లులు మంజూరు చేస్తుంటారు. ఆ బిల్లులుకు చెల్లింపులు చేయాలని ఆదేశాలివ్వడంతో పంచాయతీలు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాయి..

ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి ముగియనుండడంతో విచ్చలవిడి ఖర్చుకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. అత్యవసరాలకు మాత్రమే నిధులు వినియోగించాలని దిశానిర్దేశం చేసింది. దుబారాకు పాల్పడితే చర్యలు తప్పవంటూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పారిశుధ్యం నిర్వహణ, సిబ్బంది వేతనాలకు మాత్రమే నిధులు వినియోగిస్తూ వస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులొస్తాయన్న ఉద్దేశంతో పంచాయతీల్లో ఇటీవల కొన్ని పనులు చేపట్టారు. తీరా నిధులు మంజూరైనా సరే బిల్లులు మంజూరు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు సర్పంచ్‌లు కూడా తమ హయాంలో పనులు పూర్తి చేసి బిల్లులు చెల్లించేయాలంటూ తహతహలాడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గడచిన కొద్ది రోజులుగా పంచాయతీలపై ఆంక్షలు విధించింది.

పంచాయతీ ఖాతాల్లో నిధులు

పంచాయతీ ఖాతాల్లో ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను జమ చేసింది. జిల్లాలోని 309 పంచాయతీలకు సుమారు రూ.21 కోట్లు విదుదలయ్యాయి. వీటికోసం కొన్ని నెలలుగా పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఉపయోగించుకోవచ్చని ఆశించాయి. ప్రభుత్వం మాత్రం ఝలక్‌ ఇచ్చింది. నిధులను ఇష్టారీతిన వెచ్చిస్తే చర్యలు తప్పవంటూ కార్యదర్శులకు హెచ్చరిక చేసింది. ఫలితంగా నిధులకు బ్రేక్‌ పడ్డాయి. పనులు చేయాలంటే పంచాయతీ కార్యదర్శులు ముందూ వెనుక ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విద్యుత్‌ బిల్లులకు కొంత మేర కేటాయించాలని పంచాయతీలకు సూచించారు. ప్రతి పంచాయతీ తమకు జమ అయిన ఆర్థిక సంఘం నిధుల్లో 10 నుంచి 15 శాతం వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఆ మేరకు పంచాయతీలు చర్యలు తీసుకున్నాయి. పారిశుధ్య నిర్వహణకు నిధులు వెచ్చిస్తున్నారు. సిబ్బంది వేతనా లను మంజూరు చేస్తున్నారు. మేజర్‌ పంచాయతీలకు మాత్రమే సొంత నిధులున్నాయి. ఆస్తిపన్ను రూపంలో నిధులు జమ అవుతున్నాయి. ఇటీవల జిల్లా పంచాయతీ అధికారులు పంచాయతీల ఆదాయం పెంచేలా వ్యూహ రచన చేశారు. పంచాయతీ కాలువగట్లపై ఉన్న కొబ్బరిచెట్లకు వేలం వేశారు. తద్వారా పంచాయతీలకు కొంతమేర ఆదాయం సమకూరింది. నివాసాలకు, ఖాళీ స్థలాలకు సక్రమంగా పన్ను వేయడంతో పంచాయతీల ఆదాయం పెరిగింది. అయినాసరే పంచాయతీల్లో అభివృద్ధికి సరిపడా నిధులు అందుబాటులో లేకపోవడంతో విద్యుత్‌ బిల్లులను చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో ఆర్థిక సంఘం నిధులు జమ అయ్యాయి. పంచాయతీలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఆంక్షలతో నిధులు వెచ్చించుకోలేకపోయారు. తాజాగా ప్రభుత్వం నిధులు వెచ్చింపుపై సానుకూల నిర్ణయం తీసుకుంది.

ఉత్తర్వులొస్తేనే ఊరట

ప్రభుత్వ నిర్ణయం మేరకు పంచాయతీ రాజ్‌ శాఖ ఉత్తర్వులు ఇవ్వాలి. అప్పుడే ఎంబుక్‌లో బిల్లులను మంజూరు చేయడానికి పంచాయతీలకు అవకాశం ఉంటుంది. రహదారులు, డ్రెయిన్‌లు, ఇతర పనులకు బిల్లులు చెల్లించే వెసులు బాటు కలుగుతుంది. నిజానికి పంచాయతీకి ఇతర మార్గాల్లోనూ ఆదాయం వస్తుంటుంది. రిజిస్ర్టేషన్‌లు జరిగితే సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల నుంచి 1.5 శాతం పన్ను స్థానిక సంస్థలకు చెల్లించాలి. గడచిన రెండేళ్ల నుంచి అవి జమ కావడం లేదు. మరోవైపు ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో ప్లాన్‌ పెట్టుకున్నట్టయితే నిర్మాణదారులు చెల్లించిన రుసుములో 80 శాతం స్థానిక పంచాయతీలకు తిరిగి ఇవ్వాలి. ఇప్పటిదాకా నిధులు మంజూరు చేయలేదు. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికీ నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీలు సతమతమవుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ఆర్థిక సంఘం నిధులపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వుల కోసం ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:28 AM