సార్వా సేఫ్
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:30 AM
చాలాకాలం తర్వాత సార్వా సాగు సజావుగా సాగుతోంది.
ఎల్‌నినోతో తగ్గిన వర్షాలు.. డెల్టాలో తప్పిన ముంపు బెడద
జిల్లాలో 2 లక్షల 25 వేల ఎకరాల్లో సార్వా సాగు
10 వేల ఎకరాలకు పైగా పెరిగిన విస్తీర్ణం
చాలాకాలం తర్వాత సార్వా సాగు సజావుగా సాగుతోంది. జిల్లాలో డెల్టా ప్రాంతం ఎక్కువ.. అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా ఏటా పంట ముంపు బారిన పడేది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనివల్ల సాధారణ ఇబ్బందులు తలెత్తినా సార్వా వరి సాగు భద్రంగా ఉంది.
భీమవరం రూరల్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏటా సార్వాలో ఆదిలోనే వర్షాలకు నాట్లు మునకకు గురయ్యేవి. గతేడాది ముంపుకారణంగా లక్ష ఎకరాల వరకు ఎకరానికి 20 బస్తాల్లోపు పండింది. ఇప్పుడు ఎల్‌నినోతో భారీ వర్షాలు లేకపోవడం నాట్లు వేసిన ప్రతి చేను దాళ్వాలో ఉన్నట్టుగా ఏపుగా ఎదుగుతున్నాయి. దాదాపుగా వర్షపునీటి ముంపు నుంచి తప్పించుకున్నట్లేనని రైతులు అంటున్నారు. ఇక్కడ నుంచి వర్షాలు అధికంగా కురిసినా సాగుకు నష్టం ఉండదనే అంచనాలో ఉన్నారు. జిల్లాలో 2 లక్షల 25 వేల ఎకరాల వరకు సార్వా సాగు సాగింది. 2 లక్షల 5 వేల ఎకరాలు డెల్టాలో ఉండగా 20 వేల ఎకరాలు మెట్టలో సాగువుతోంది.
సాగు విస్తీర్ణం పెరిగింది
సార్వా సాగు చేయాలంటే ప్రకృతి అనుకూ లిస్తుందా లేదా అని రైతులు భయపడతారు. పంటచేతికి అందేవరకు ఆశలు పెట్టుకోరు. ఈసారి నాట్లు త్వరితగతిన పూర్తి చేశారు. ఆగస్ట్ నెల 20 లోపులోనే నాట్లు పూర్తయ్యాయి. గత ఏడాదికంటే 15 రోజులు ముందుగా నాట్లు అయినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వాతావరణం అనుకూలించడంతో లోతట్టు ప్రాంత భూములు సాగులోకి తీసుకువచ్చారు. 20 మండలాల్లోని సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. మొత్తం మీద 10 వేల ఎకరాలు పైగా సార్వా సాగు పెరిగింది.
తెగుళ్ల బెడద తప్పింది
జిల్లాలో వర్షపాతం సాధారణంకంటే 54 శాతం వరకు తక్కువ నమోదైంది. ఇప్పటి వరకు 649.0 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అలాంటిది కేవలం 294.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీనివల్ల సార్వా సాగుకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఎదిగే సమయంలో కొంతైనా వర్షం పడటం వల్ల వరిసాగుకు మేలు జరిగింది. ఎండ ప్రభావం ఉండటం వల్ల ఆకుముడత, పొడ, ఎండాకు తెగులు వంటివి రాలేదు. దీనివల్ల పురుగు మందుల పిచికారీ పెట్టుబడి తగ్గింది. అయితే సాగు ఎదుగుదలకు ఎరువులు అదనంగా వేయాల్సి వస్తుంది. అది కూడా ఎకరానికి బస్తా ఎరువు ఎక్కువ వేస్తున్నామని రైతులు చెబుతున్నారు. రూ. 2 వేలు పెట్టుబడి పెరుగుతుంది.
దిగుబడి బాగుంటుంది
డెల్టా ప్రాంతంలో పంట కాలువల నుంచి కావాల్సినంత సాగునీరు వస్తుంది. దీంతో సార్వా సాగుకు వర్షాలు లేకపోయినా పెద్ద నష్టం లేదు. చివరి వరకు ఇలా వాతావరణం సాగితే సక్రమంగా పంట మాసూలైతే ఎకరానికి 35 బస్తాలు పైబడి దిగుబడులు వస్తాయని రైతులు అంచనా వేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో చేలు అలాగే ఉన్నాయని అంటున్నారు.
వాతావరణం అనుకూలించింది
డెల్టా ప్రాంతం కాబట్టి వర్షపాతం తక్కువ నమోదైన సార్వా సాగుకు ఇబ్బంది లేదు. వర్షపు నీటి ముంపు లేనందున సాగు విస్తీర్ణం పెరిగింది. వీరవాసరం మండలంలో 11,800 ఎకరాలు సాగు జరిగేది. అలాంటిది 12,300 పైగా సాగు చేశారు. పల్లపు ప్రాంతాల్లో నాట్లు వేసుకునేలా వాతావరణం అనుకూలించింది. వరిచేలు బాగుగా వస్తున్నాయి.
– కొప్పర్తి శ్రీనివాస్, భీమవరం డివిజన్ ఏడీఏ