చాటపర్రు చిన్నోడికి పద్మశ్రీ
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:54 AM
చాటపర్రు చిన్నోడుగా జిల్లావాసులకు సుప్రసిద్ధుడు.. విలక్షణ పాత్రలతో వెండితెరపై వెలుగులు విర జిమ్మిన సినీనటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ను పద్మశ్రీ వరించింది.
ఏలూరు,జనవరి 25 (ఆంధ్రజ్యోతి): చాటపర్రు చిన్నోడుగా జిల్లావాసులకు సుప్రసిద్ధుడు.. విలక్షణ పాత్రలతో వెండితెరపై వెలుగులు విర జిమ్మిన సినీనటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ను పద్మశ్రీ వరించింది. 52 ఏళ్ల సినీజీవితంలో అరుదైన గుర్తింపు ఆయనకు ఈ అవార్డుతో లభించింది. ఈ నేపథ్యంలో ఆయన సొంతూరులో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మురళీమోహన్ బాబు అసలు పేరు రాజాబాబు. చాటపర్రు గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు మాగంటి మాధవరావు, వసుమతి దేవీలకు ప్రఽథమ సంతానంగా 1940 జూన్ 24 మురళీమోహన్ జన్మించారు.1963లో ఎలక్ర్టికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారంలోకి ప్రవేశించారు. విజయవాడలో నాటకాల్లో నటించడం కలిసి వచ్చింది. ఆయన భార్య పేరు విజయలక్ష్మి, వీరికి మధుబిందు అనే కుమార్తె, రామమోహన్ అనే కుమారుడు, కోడలు రూప ఉన్నారు.
1973లో జగమేమాయతో సినీ ప్రవేశం
సినీనటుడు ఘట్టమనేని కృష్ణతో కలిసి ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కలిసి చదివారు. విలక్షణ నటుడిగా విశిష్టమైన పాత్రలతో వెండితెరపై అభినయాలను పండించారు. కథా నాయకుడిగా చాలా చిత్రాల్లో నటించినా... రెండు దశాబ్దాలుగా క్యారెక్టర్ ఆర్టిస్‌గా రాణించిన మాగంటి మురళీమోహన్ చిరు నవ్వుతో అందర్ని ఆకట్టుకునేతత్వం కలిగి ఉన్నారు. 1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణ చంద్రరావు నిర్మించిన జగమే మాయ చిత్రంతో సినీరంగం ప్రవే శం చేశారు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో నటునిగా గుర్తింపు వచ్చింది. హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను రాణించారు. 350 చిత్రాల్లో నటించారు. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 350 పైగా చిత్రాల్లో నటించి.. జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో 25కు పైగా చిత్రాలను నిర్మించిన మురళీ మోహన్ తన సొంత ట్రస్ట్ ద్వారా వెయ్యి మంది పేద విద్యా ర్థులకు ఉన్నత విద్యకు సాయం చేశారు. వీలు చిక్కినప్పుడుల్లా సేవ కార్యక్రమాల్లో మమేకం అయ్యే ఆయన టీడీపీలో చేరారు. అదే సంవత్సరం 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌కుమార్ చేతిలో 2,147 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తిరిగి 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుంచి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. రాజమండ్రి సిటీఅభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టారు.
అందుకున్న పురస్కారాలు...
1985లో నటించిన ఓ తండ్రి తీర్పు చిత్రానికి నంది పురస్కారం ఉత్తమ నటుడిగా కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయనటుడిగా ప్రేమించు (2001), వేగుచుక్కలు (2003)లో నంది అవార్డులను అందు కున్నారు. 2016లో సైమా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారు.
చాటపర్రుతో విడదీయరాని సంబంధం
సొంతూరితో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. స్థానికుల యోగ క్షేమాలు తెలుసుకోవడంతో పాటు అక్కడే ఉన్న బంగ్లాలోనే వచ్చినప్పుడల్లా విడిది చేస్తారు. మల్లెపూవు సినిమాలో శోభన్‌బాబుతో ఈ ప్రాంతంలో షూటింగ్‌లో నటించారు. ఆయన బంగ్లాలోనే పట్నం వచ్చిన ప్రతివతలు.. బొట్టు–కాటుక అనే సినిమాలు తీశారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగించిన మురళీమోహన్ ఏలూరులోని మాగంటి బాబు ఇంట్లో విజయ అనే సినిమా తీశారు.