Share News

అన్నదాతల ఆనందం

ABN , Publish Date - May 15 , 2026 | 12:29 AM

దాళ్వా పంటలో అధిక దిగుబడులు సాధించి ఆనందంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వరికి మద్దతు ధర క్వింటాకు రూ. 72 పెంచింది.

అన్నదాతల ఆనందం

వరికి మద్దతు ధర పెంపు

క్వింటా ధాన్యానికి రూ.72

ఇప్పటి వరకు రూ.2,369 ఉండగా

వచ్చే ఏడాదికి రూ.2,441

వచ్చే సార్వా, దాళ్వా నుంచి అమలు

ఎకరానికి రెండు పంటలకు

రూ. 5 వేలు అదనపు ఆదాయం

భీమవరం రూరల్‌, మే 14 (ఆంధ్రజ్యోతి) : దాళ్వా పంటలో అధిక దిగుబడులు సాధించి ఆనందంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వరికి మద్దతు ధర క్వింటాకు రూ. 72 పెంచింది. ఎప్పుడు రూ.50తో సరిపెట్టే ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి రూ.72 పెరగడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు క్వింటా కామన్‌ రకానికి రూ.2,369, గ్రేడ్‌–ఏ రకానికి రూ.2,389 ఉండేది. వచ్చే సార్వా, దాళ్వా పంటలకు (2026–27) కామన్‌ రకానికి రూ. 2,441, గ్రేడ్‌–ఏ రకానికి రూ.2,461గా నిర్ణయించారు. ఈ ఏడాది మూడు శాతం పెంచారు.

రైతన్నలకు రూ.100 కోట్లు ప్రయోజనం

ప్రతి ఏటా వరి సాగులో రెండు పంటలు పండిస్తున్నారు. జిల్లాలో లక్షా 30 వేల మంది రైతుల వరకు సార్వా సాగులో 2 లక్షల ఎకరాలు సాగు చేసి 6 లక్షల 50 వేల టన్నులు పైగా ధాన్యం పండిస్తున్నారు. దాళ్వాలో 2 లక్షల 31 వేల ఎకరాల్లో 8 లక్షల 50 వేల టన్నుల ధాన్యం దిగుబడి తెస్తున్నారు. ఏడాదిలో 15 లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నారు. ఇప్పుడు మద్దతు ధర పెరగడంతో వచ్చే రెండు పంటల్లో రైతులకు రూ.110 కోట్లు అదనపు ఆదాయం లభిస్తుంది. ఎకరానికి రూ.5 వేలు వరకు అదనంగా ఆదాయం వస్తుంది.

రైతన్నలకు భరోసా..

కూటమి ప్రభుత్వం వచ్చాక వరిసాగులో రైతన్నలకు భరోసా వచ్చింది. గత ప్రభుత్వంలో పండించిన ధాన్యం అమ్ముకోవడానికే అవస్థలు పడ్డారు.సొమ్ము చెల్లింపులైతే నెలల తరబడి పట్టింది. వాటన్నింటికీ స్వస్తి చెప్పేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పంట మాసూళ్లయిన వెంటనే కొనుగోలు చేయడం, 48 గంటలలోపే ధాన్యం సొమ్ములు రైతులు ఖాతాల్లో పడుతున్నాయి. ఇలా రెండు పంటలలో 15 లక్షల టన్నుల ధాన్యాన్ని రూ. 3,600 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దాంతోపాటు పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవల పథకం కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలు అందిస్తున్నారు. రెండేళ్ళుగా రైతుల్లో జోష్‌ కనిపిస్తున్నది.

సాగు విస్తీర్ణం పెరుగుతోంది

గడిచిన నాలుగు పంటల్లో సాగుభూమి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది దాళ్వాలో జిల్లాలో 2 లక్షల 17 వేల ఎకరాల్లో సాగు జరగ్గా ఈ ఏడాది 2 లక్షల 31 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. 14 వేల ఎకరాలు ఎక్కువగా చేశారు. సరాసరి దిగుబడి ఎకరానికి 55 నుంచి 60 బస్తాలు వస్తోంది. రానున్న పంటల్లో సాగు విస్తీర్ణం మరికొంత పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాలో ఉంది.

Updated Date - May 15 , 2026 | 12:29 AM