Share News

లారీలు ఎప్పుడొస్తాయో..?

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:27 AM

ప్రభుత్వం చెప్పే మాటలు నీటిమాటలుగానే మిగిలిపోతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యంను మిల్లుకు తోలలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

లారీలు ఎప్పుడొస్తాయో..?
కల్లంలోనే ఉన్న ధాన్యం బస్తాలు

ధాన్యం ఎగుమతికి రైతుల ఎదురుచూపులు

నిడమర్రు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చెప్పే మాటలు నీటిమాటలుగానే మిగిలిపోతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యంను మిల్లుకు తోలలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు సఽమాధానం చెప్పే నాథుడే లేక రైతులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా అధి కారులు అలసత్వం రైతుల పాలిట శాపంగా మారుతోంది. నిడమర్రు మండలంలో రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండల స్థాయిలో పరిస్థితిని సరిదిద్దాల్సిన అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బావాయిపాలెం , సిద్ధాపురం, ఛానమల్లి, క్రొవ్విడి రైతు భరోసా కేంద్రాల్లో రైతులు పదిరోజుల నుంచి ధాన్యం తోలడానికి లారీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చేను కోసి పదిహేను రోజులైందని, వారం రోజుల నుంచి ఆరబెట్టి ధాన్యంను బస్తాల్లో కల్లాల్లో నిల్వ చేశామని, రోజూ ధాన్యం తోలుకెళ్లే లారీల కోసం ఎదురుచూస్తున్నామని వాపోతున్నారు. మారుతున్న వాతావరణం భయపెడుతోందని, రోజూ ఉదయం, సాయంత్రం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా మమ్మల్ని పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు బావాయిపాలెం సందర్శించగా ధాన్యం లారీలు కొరత విషయం ఆయన వద్ద మొరపెట్టుకోగా సత్వరం పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

లారీలు పంపడం లేదు..

సిద్ధాపురంలో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. వరిచేను కోసి పది రోజులైన ఇప్పటివరకు లారీలు పంపడం లేదు. పలుమార్లు తిప్పించుకుని సంచులు ఇచ్చారు. మరోవైపు డీజిల్‌ సమస్య కారణంగా లారీలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం మిల్లుకు తోలేలా చర్యలు తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలి.

– అల్లు రాంబాబు, కౌలు రైతు, సిద్ధాపురం

Updated Date - Apr 26 , 2026 | 12:27 AM