Share News

ధాన్యం.. దైన్యం!

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:54 AM

ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక అన్నదాతలు అవస్థలు పడు తున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్‌లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయకముందే ఏలూ రు రూరల్‌ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసి వేశారు.

ధాన్యం.. దైన్యం!
మాదేపల్లిలో మిల్లులకు తరలించేందుకు సిద్ధం చేసిన ధాన్యం

అమ్ముకునే దారిలేక కల్లాల్లోనే ధాన్యం బస్తాలు

టార్గెట్‌ పూర్తయిందంటూ కొనుగోలు చేయని మిల్లర్లు

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

ఏలూరు రూరల్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి):ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక అన్నదాతలు అవస్థలు పడు తున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్‌లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయకముందే ఏలూ రు రూరల్‌ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసి వేశారు. టార్గెట్‌ పూర్తయిందని ధాన్యం కొనుగోలు చేయలే మంటూ మిల్లర్లు చేతులు ఎత్తేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నూర్పిడి చేసిన ధాన్యం నిల్వ ఉండిపోతోంది. ప్రస్తుతం మిల్లింగ్‌ చేయకపోవడంతో మిల్లుల ప్రాంగణాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. రైస్‌ మిల్లులకు బ్యాంక్‌ గ్యారెంటీలకు అనుగుణంగా లేకపోవడంతో ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 110 రైస్‌ మిల్లులకు బ్యాంక్‌ గ్యారెం టీలు ఇచ్చారు. కేవలం ఏలూరు రూరల్‌ మండలం, దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు, తదితర మండలాల్లోని మిల్లులు గ్యారెంటీ పూర్తయ్యా యని చెబుతున్నారు. బ్యాంక్‌ గ్యారెంటీలు అయిపోవడంతో రైతు భరోసా కేంద్రం సిబ్బంది ఏమి చేయలేని పరిస్థితి. ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని తెలపడంతో రైతులు ధాన్యం కల్లాల్లోనే ఉంచేశారు. జిల్లాలో 111 రైస్‌ మిల్లులు ఉండగా 103 మిల్లులకు బ్యాంక్‌ గ్యారెంటీలు ఉన్నాయి. 5.08 లక్షల టన్నులు ధాన్యం దిగుబడి అంచనా కాగా 4.09 లక్షల టన్నుల సేకరణ లక్ష్యానికి ఇప్పటి వరకు 3.94 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. చాలా మిల్లుల్లో బియ్యం నిల్వలు ఉండడంతో పాటు ఎఫ్‌సీఐ గొడౌన్స్‌ ఖాళీగా లేవని తెలుస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ విధా నంలోను ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఏలూరు రూరల్‌ మండలంలో సుమారు 11 వేల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. మల్కాపురం, జాలిపూడి, చాటపర్రు, కాట్లంపూడి, మాదేపల్లి, పోణంగి, సుంకరవారి తోట ప్రాంతా ల్లో ఇంకా 35శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది. మండలంలో నాలుగు మిల్లులకు ధాన్యం అమ్మకాలకు అవకాశం కల్పించారు. పండించిన ధాన్యాన్ని ఏ మిల్లులోనైనా అమ్ముకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయినా వరి పండించిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేశాం.. ఇక తీసుకోబోమని మిల్లర్లు తెగేసి చెప్పడంతో ధాన్యం లోడుతో ట్రాక్టర్లు, ధాన్యం బస్తాలు కల్లాలోనే ఉన్నాయి. రైతులు తమకు నచ్చిన మిల్లుకే ధాన్యం తోలుకోవచ్చని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చేసేదిలేక రైతులు ధాన్యం బస్తాలను పొలంలోనే ఉంచి చలిలో కాపలా కాస్తున్నారు. ‘ఏలూరు రూరల్‌ మండలంలో కొంత మంది మిల్లర్లకు టార్గెట్‌ పూర్తయిందనే పేరుతో రైతుల నుంచి ధాన్యం సేకరించడం లేదు. రైతు తనకు నచ్చిన మిల్లుకు ధాన్యం తోలుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఆ పరిస్థితి లేదు. రైతు సేవా కేంద్రాల్లో మేము చెప్పిన మిల్లుకే ధాన్యం తోలుకోవాలని చెబుతూ అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్నారు. రైతు తనకు నచ్చిన మిల్లుకు ధాన్యం తోలుకునేలా టార్గెట్స్‌ ఇవ్వాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు

ఒక గోనె సంచికి 580 గ్రాములు లెక్కించాల్సి ఉండగా కేజీ ధాన్యం తూచుకోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలి. ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు పెడుతున్న కొర్రీలతో ఇబ్బందులు పడుతున్నాం. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముకోవాలంటే పొలం పనులు మానుకొని కాళ్ళరిగేలా ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తీరా వెళ్తే టార్గెట్‌ పూర్తయ్యింది అంటారు. మిల్లర్లు బాగా ఇబ్బంది పెడుతున్నారు.

– రామారావు, రైతు, మాదేపల్లి.

Updated Date - Jan 20 , 2026 | 12:54 AM