ముందుగానే వరి నాట్లు
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:13 AM
సార్వా సాగుకు వాతావరణం సహకరించక పోయినా రైతన్నల పట్టుదలతో నాట్లు పూర్తి చేస్తున్నారు.
2 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి
20 వేల ఎకరాల్లో వేయాలి
15 తేదీ కల్లా పూర్తవుతాయన్న అంచనాలో వ్యవసాయ శాఖ
గత సార్వా కంటే 20 రోజులు ముందుగానే పూర్తి ..
భీమవరం రూరల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : సార్వా సాగుకు వాతావరణం సహకరించక పోయినా రైతన్నల పట్టుదలతో నాట్లు పూర్తి చేస్తున్నారు. సాగునీటి ఎద్దడిని అధిగమించి మొన్న కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాల ముంపును తట్టకుని నాట్లు కొనసాగించారు. దీంతో గతేడాది సార్వా సాగు కంటే ఇరవై రోజుల ముందుగానే నాట్లు ప్రక్రియ పూర్తి కాను న్నది. జిల్లాలో 2 లక్షల 20 వేల సాగుకు గాను ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మిగి లిన 20 వేల ఎకరాల నాట్లు వారం రోజుల లోపులోనే వేయనున్నారు. అధిక వర్షాలు పడనందున ఎక్కడా వర్షపు నీటి ముంపు ఇబ్బందులు తలెత్తలేదు. దీనివల్ల వేసిన నాట్లు సక్రమంగా ఉన్నాయి. పది రోజులపాటు ఎక్కువ వర్షపాతం నమోదు కాకుండా ఉంటే ఈ సార్వా పంట ఆదిలో వచ్చే ముంపు నష్టం నుంచి సాగు గట్టెక్కినట్లేనని రైతులు అంచనా వేస్తున్నారు.
వేగంగా ఈ–పంట నమోదు
నాట్లు వేగంగా రైతులు వేస్తుంటే వ్యవసాయ శాఖ అధికారులు అదే వేగంతో ఈ పంట నమోదు చేస్తున్నారు. రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి చేస్తే ఈ పంట నమోదు లక్ష ఎకరాలు పూర్తి చేశారు. నాట్లు వేసిన 15 రోజులు తర్వాతనే ఈ–పంట నమోదుకు వీలవుతుంది. అందువల్ల మిగిలిన సాగు కూడా త్వరితగతినే ఈ పంట నమోదు చేసేలా అధికారులు ప్రణాళికలో ఉన్నారు. ఈ పంట నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీన వరకు మాత్రమే వ్యవధి ఉంది. ఈసారి నాట్లు ముందుగా అయినందున అధికారులకు చివరితేదీ కన్నా ముందుగానే ఈ–పంట నమోదు పూర్తిగా చేసుకునే అవకాశం ఉంది.