Share News

స్తంభించిన సహకారం!

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:35 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘాల ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల కార్యకలాపాలు స్తంభించాయి.

స్తంభించిన సహకారం!
ముదినేపల్లి మండలం వడాలిలో మూతబడిన పీఏసీఎస్‌ భవనం

నాలుగు రోజులుగా పీఏసీఎస్‌ ఉద్యోగుల సమ్మె

రుణాల చెల్లింపులు బంద్‌..

రైతులపై అపరాధపు వడ్డీ భారం

ముదినేపల్లి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘాల ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల కార్యకలాపాలు స్తంభించాయి. సమ్మె కారణంగా సహకార సంఘాల కార్యాలయాలు మూతబడ్డాయి. సంఘాల సీఈవోలతో పాటు, ఇతర ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో సహ కార సేవలు పూర్తిగా నిలిచి పోయాయి. ఏపీ పీఏసీఎస్‌ అసోసియేషన్‌, ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్లు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి ఆందోళన చేపట్టడంతో ఏలూరు డీసీసీబీ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలకు చెందిన 296 సహకార సం ఘాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 1,600 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 36ను అమలు చేయాలని, ఉద్యోగుల రిటైర్‌ మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచా లని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సహకార నిధిని ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతాలను ఆ నిధి నుంచి చెల్లించాలని, 2019 తర్వాత నియా మకం పొందిన ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచనను విరమించుకోవాలని యూనియన్ల డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులకు నష్టం

పీఏసీఎస్‌ల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరి స్థితి ఏర్పడింది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల మంజూరుతో పాటు వసూళ్ల సమయం ఇది. ఈ పరిస్థితుల్లో సంఘాల సీఈవోలు, ఇతర ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొనడం రైతు లు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. రుణాల చెల్లింపులు స్తంభించి పోవడంతో రైతులు మూడు శాతం వడ్డీ రాయితీని కోల్పోవడమే కాక గడువు మీరిన రుణాలపై అపరాధపు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కొత్త రుణాల మంజూ రుకు సి ఫారం తయారు చేసే అవకాశం లేదు.

రబీ రైతులకు ఇబ్బందులే..

జిల్లాలో దాళ్వా సాగు జరుగుతున్న ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులు సహకార సంఘాల ద్వారా ఎరువులు కొనుగోలు చేస్తు న్నారు. యూరియా అమ్మకాల్లో సహకార సం ఘాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు సంఘాల్లో పది వేల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. ఉద్యోగుల సమ్మె వల్ల ఎరువుల అమ్మకాలు ఆగిపోయాయి. క్యాష్‌ కౌంటర్లు ఉన్న సంఘాల్లో నగదు జమలు, నగ దు తీసుకోవడం నిలిచిపోవడంతో సంఘాల్లో ఖాతాలున్న ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

చర్చలెప్పుడు..

నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి, యూనియన్లకు మధ్య చర్చలు జరగకపోవడంతో సమ్మె ఎప్పటికి ముగుస్తుందనేది అయోమయంగా ఉంది. ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు చొరవ తీసుకుంటున్నప్పటికీ అధికార యంత్రాంగం చర్చలకు సిద్ధం కావడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సమ్మె విరమణ ఎప్పటికి జరుగుతుందో నన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

Updated Date - Feb 20 , 2026 | 12:35 AM