Share News

సహకారం బంద్‌!

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:35 AM

తమ డిమాండ్ల పరిష్కా రాన్ని కోరుతూ ఏపీ పీఏసీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘాల ఉద్యోగులు సోమవారం నిరవధిక సమ్మెను చేపట్టారు.

 సహకారం బంద్‌!
మూతపడిన ముదినేపల్లి పీఏసీఎస్‌

పీఏసీఎస్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె

మూతపడిన కార్యాలయాలు

ముదినేపల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్ల పరిష్కా రాన్ని కోరుతూ ఏపీ పీఏసీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘాల ఉద్యోగులు సోమవారం నిరవధిక సమ్మెను చేపట్టారు. మూడు నెలలుగా తాము చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈవోలు, ఇతర ఉద్యోగులు విధులను బహిష్కరించి, పీఏసీఎస్‌ కార్యాలయాలను మూసివేశారు. ఏలూరు డీసీసీబీ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 260 పీఏసీఎస్‌లకు చెందిన సుమారు 1,200 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో 260 మంది సీఈవోలు కాగా, మిగిలిన వారు కంప్యూటర్‌ ఆపరేటర్లు, గుమాస్తాలు ఉన్నారు. 2019 తర్వాత నియమితులైన సుమారు 90 మంది రెగ్యులర్‌ కాని ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. పీఏసీఎస్‌లు మూతబడడం తో సహకార సంఘాల లావాదేవీలు స్తంభించాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచి కార్యాలయాల్లో పీఏసీఎస్‌లకు సంబంధించిన లావాదేవీలు జరుగలేదు. పీఏసీఎస్‌ ఉద్యోగులకు సంబంధించిన జీవో నంబర్‌ 36ను అమలు చేయాలని, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉమ్మడి నిధిని ఏర్పాటు చేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని, హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలని, ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, 2019 తర్వాత నియామకం పొందిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా ఉద్యోగుల అసోసియేషన్‌ నాయకులు నీలం నాగేశ్వరరావు, నీలం శ్రీనివాసరావు, పళ్ళెం శ్రీనివాసరావు ఆధ్వర్యం లో పీఏసీఎస్‌ల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.

నేడు చర్చలు

పీఏసీఎస్‌ ఉద్యోగుల సమస్యలపై మంగళవారం రాష్ట్రస్థాయిలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, కృష్ణా డీసీసీబీ చైర్మన్‌ నెట్టెం రఘురామ్‌ చర్చలకు చొరవ తీసుకుని ఆప్కాబ్‌ ఎండీ, సహకార సంఘాల రిజిస్టరేట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.

సమ్మె సక్సెస్‌ : బొల్లినేని రఘురామ్‌, జేఏసీ నాయకుడు

సమస్యల పరిష్కారం కోసం పీఏసీఎస్‌ ఉద్యోగులు సోమవారం చేపట్టిన నిరవధిక సమ్మె విజయవంతం అయింది. ఉద్యోగులు అందరూ ఐక్య వేదిక పిలుపునకు స్పందించి విధులను బహిష్క రించారు. ఇప్పటికైనా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి.

Updated Date - Feb 17 , 2026 | 12:38 AM