పోరుబాట
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:17 AM
తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం పీఏసీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నుంచి ప్రాథమిక వ్యవసా
నేటి నుంచి పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
ముదినేపల్లి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి):తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం పీఏసీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నుంచి ప్రాథమిక వ్యవసాయ సహ కార పరపతి సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మెను చేపట్టనున్నారు. గతేడాది డిసెంబరు 5 నుంచి ఈ ఏడాది జనవరి 5 వరకు, జనవరి 27 నుంచి ఈనెల 13 వరకు సహకార బ్యాంకు బ్రాంచిస్థాయి నుంచి రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ర్టార్ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందుగా పీఏసీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ల జేఏసీ ప్రకటించిన విధంగా ఈనెల 16 నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెను పాటించ నున్నారు. ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 260 సహకార సంఘాల ఉద్యోగులు సుమారు 1,200 మంది సమ్మెబాట పట్టనున్నారు. నిరవధిక సమ్మెతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బంద్ కానున్నాయి.
సమస్యల పరిష్కారానికి సమ్మె తప్పలేదు..
పీఏసీఎస్ ఉద్యోగులు మూడు నెలలుగా సమ స్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపో వడంతో నిరవధిక సమ్మెను చేపడుతున్నాం. గతం లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను అమలు చేయాలి. పీఆర్సీ కమిటీ వేయాలి. 2019 తర్వాత నియామకం పొందిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
– బొల్లినేని రఘురాం, పీఏసీఎస్ ఉద్యోగుల సంఘాల జేఏసీ నాయకుడు