సొంతింటికి చేయూత
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:25 AM
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం మరింత ఊరటనిచ్చింది. పల్లెల్లో ఇళ్లు నిర్మించుకుంటే రూ.2.39 లక్షలు సాయంగా అందించేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొత్తాన్ని భరించేవి.
ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షలు
పీఎంఏవై 2.0 కింద సాయం
త్వరలో మంజూరు కానున్న ఇళ్లు
(భీమవరం–ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం మరింత ఊరటనిచ్చింది. పల్లెల్లో ఇళ్లు నిర్మించుకుంటే రూ.2.39 లక్షలు సాయంగా అందించేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొత్తాన్ని భరించేవి. ఇందులో 40 వేలు రుణంగాను మిగిలిన లక్షా 99 వేలు సాయంగా ఉండేది. ప్రస్తుతం రుణ భారం లేకుండా రూ.2.39 లక్షలు మొత్తం సాయం ఇచ్చేలా నిర్ణయించారు. పట్టణ లబ్దిదారులకు రూ.2.50 లక్షలు ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష భరిస్తుంది. ఇందులో ఎటువంటి మార్పు లేదు. సొంత స్థలం ఉన్న పట్టణ లబ్ధిదారులకు ఇదివరకే ఇళ్లు మంజూరు చేసింది. జిల్లాలో 595 ఇళ్లను కేటాయించారు. లబ్దిదారులు తమకు అనుకూలమైన రీతిలో గృహ నిర్మాణం చేపట్టినా సరే పట్టణ లబ్దిదారులకు అనుకున్న విదంగానే రూ.2.50 లక్షలు విడతలు వారీగా జమ చేయనున్నారు. ఇదే విధానం గ్రామీణ లబ్దిదారులకు వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సొంతస్థలం ఉన్న లబ్ధిదారుల గుర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న లబ్దిదారులను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. సచివాలయ సిబ్బంది లబ్దిదారుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 7,300 మంది సొంతింటి కోసం ధరఖాస్తు చేసుకున్నారు. వారందరికి సొంత స్థలం ఉన్నట్టు ప్రభుత్వం గుర్తిం చింది. మరో వైపు గ్రామ సచివాలయాల ద్వారా సర్వే నిర్వహించింది. దాంట్లో సొంత స్థలం ఉన్నవారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం గృహ కార్పోరేషన్ గణాంకాల ఆధారంగా దాదాపు 14,500 మందికి గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలాలు ఉన్నాయి. వారందరికి త్వరలోనే ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుంది.
ప్రభుత్వ స్థలాల్లోనూ వేగవంతం
గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఆవాస యోజన 1.0లో జిల్లాకు 70,471 ఇళ్లను మంజూరు చేశారు. వైసీపీ హయాంలో నిర్మాణం నత్త నడకన సాగింది. ఫలితంగా ప్రధాన మంత్రి ఆవాస యోజన 2.0 ఇళ్ల మంజూరుకు అవరోధంగా మారింది. దాంతో 1.0లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి దాకా 54,799 ఇళ్ల నిర్మాణం పూర్తవగా 15,672 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. ఇందులో కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ఇళ్లు కూడా ఉన్నాయి. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించారు.