Share News

నాలుగు ప్యాకేజీల్లో ఓఆర్‌ఆర్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:42 AM

అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు అడుగులు చకచకా పడుతున్నాయి. మొత్తం 189.93 కిలోమీటర్లతో రూ.13,091.75 కోట్లతో ఆరు వరసల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను నిర్మించడానికి జాతీయ రహదారుల సంస్థ టెండర్లు ఆహ్వానించింది.

నాలుగు ప్యాకేజీల్లో ఓఆర్‌ఆర్‌

189.93 కిలోమీటర్ల పొడవు.. రూ.13,091.75 కోట్ల వ్యయం

నవంబరు 18 వరకు బిడ్లకు దరఖాస్తు.. 19న ఖరారు

అన్ని అనుమతులకు ముందే క్లియరెన్సులు తీసుకోవాలి

రాజధాని అమరావతికి అన్నివైపుల నుంచి మార్గం సుగమం

విజయవాడ, గుంటూరు నగరాల్లో ట్రాఫిక్‌కు చెక్‌

విజయవాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు అడుగులు చకచకా పడుతున్నాయి. మొత్తం 189.93 కిలోమీటర్లతో రూ.13,091.75 కోట్లతో ఆరు వరసల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను నిర్మించడానికి జాతీయ రహదారుల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. నాలుగు ప్యాకే జీల్లో డిజైన్‌ బిల్డ్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీవోటీ), హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) విధానాల్లో పనులు చేపడతారు. నవంబరు 18 వరకు కేంద్ర ఈ టెండర్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేనెల 19న ఓపెన్‌ చేస్తారు.

ప్యాకేజీల వారీగా టెండర్లు ఇలా..

ప్యాకేజీ–1: ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల నుంచి నందిగామ వరకు రూ.3,346.81 కోట్లతో ఓఆర్‌ ఆర్‌ నిర్మాణం చేపడతారు.మొత్తం 27 (0–27) కిలోమీటర్ల మేర పనులు జరుగుతాయి. అంచ నా వ్యయంలో జీఎస్టీ మినహాయించగా రూ.2, 957.47 కోట్లుగా ఉంది. పీపీపీ అప్రైజల్‌ కమిటీ అనుమతి ఇచ్చే తేదీ నాటికి జీఎస్టీ మినహా యించి రూ.3,346.81 కోట్లుగా నిర్ణయించారు.

ప్యాకేజీ–2:ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నుంచి దావులూరు వరకు రూ.3,260.30 కోట్లతో టెండ ర్లు పిలిచారు. మొత్తం 56 (27–83) కిలో మీటర్ల పొడవున నిర్మించనున్నారు. అంచనా వ్యయం మొదట్లో రూ.2,864.69 కోట్లు ఉండగా, పీపీపీ అప్రైజల్‌ కమిటీ అనుమతి ఇచ్చే నాటికి రూ.3,260.30 కోట్లకు చేరింది.

ప్యాకేజీ–3: కృష్ణాజిల్లా కోలవెన్ను నుంచి గుంటూరు జిల్లాలోని కోర్నెపాడు వరకు రూ.3,219.62 కోట్లతో టెండర్లు పిలిచారు. పొడవు 55 (83–133.500) కిలోమీటర్లు. తొలు త అంచనా వ్యయం రూ.2,827.95 కోట్లు కాగా, పీపీపీ అప్రైజల్‌ కమిటీ ఆమోదం తర్వాత బిడ్‌ ప్రాజెక్టు వ్యయం రూ.3,219.62 కోట్లకు చేరింది.

ప్యాకేజీ–4:గుంటూరు జిల్లాలోని కోర్నె పాడు నుంచి అమరావతి బయట నుంచి కృష్ణా జిల్లా కంచికచర్ల వరకు రూ.3,265.02 కోట్లతో టెండర్లు పిలిచారు. మొత్తం 55 (135. 500–189) కిలోమీటర్ల మేర నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. తొలుత అంచనా వ్యయం జీఎస్టీ మినహాయించి రూ. 2,869.59 కోట్లు కాగా, పీపీపీ అప్రైజల్‌ కమిటీ ఆమోదం నాటికి రూ.3,265.02 కోట్లుగా ఉంది.

భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి

ఓఆర్‌ఆర్‌ నిర్మాణ పనులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అవుటర్‌ పరిధిలోకి వచ్చే ప్రాం తాల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. భూ సేకరణ నోటిఫికేషన్లను ఇప్పటికే జారీ చేశారు. రెవెన్యూ యంత్రాంగం తరఫున 3ఏ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మిగిలిన దశలను పూర్తిచేసి భూములను సేకరించాలి. దీంతో పాటు గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టు కావటం వల్ల పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవాలి. ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ చేపట్టాలి. ముందే హైటెన్షన్‌ ట్రాన్స్‌మిషన్‌ టవర్స్‌ షిఫ్టింగ్‌ పనులను వేగవంతం చేయాలి.

అమరావతికి అత్యుత్తమ అనుసంధానం

ఆరులైన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే కావడం వల్ల రాజధాని అమరావతికి అన్నివైపుల నుంచి వేగవంతమైన ప్రయాణానికి అనుసంధానత ఏర్పడుతుంది. విజయవాడ–ఛత్తీసగఢ్‌ (ఎన్‌హెచ్‌–30), విజయవాడ–ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలతో పాటు ఎన్‌హెచ్‌–16, 65, 544డీకి అనుసంధానమవుతుంది. విజయవాడ–నాగపూర్‌ ఎకనమిక్‌ కారిడార్‌తో పాటు విజయవాడ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వేలకు కూడా ఓఆర్‌ఆర్‌ అనుసంధానం కావటం వల్ల అమరావతికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలతో నేరుగా రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఓఆర్‌ఆర్‌ వెళ్తున్న గ్రామాల్లో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి. టెండర్లు పిలవటంతో భూముల రేట్లు మరింత పెరగనున్నాయి. ఎన్టీఆర్‌, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఏలూరు జిల్లాల పరిధిలోని అలైన్‌మెంట్‌ పరిధిలో ఆకాశమే హద్దుగా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్ర యోజనాలు అనేక రకాలుగా ఉండనున్నాయి. విశాఖపట్నం–చెన్నై, విశాఖ పట్నం–హైదరాబాద్‌, విశాఖపట్నం–విజయవాడ పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానత ఏర్పడుతుంది. ఓఆర్‌ఆర్‌ వల్ల ఐదు జిల్లాల పరిధిలో లాజిస్టిక్‌ పార్కులు, ఇండస్ర్టియల్‌ హబ్‌లు, గోడౌన్ల ఏర్పాటు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా మార్గాల్లో ప్రయాణించే భారీ సరుకు రవాణా వాహనాలు, లారీలు విజయవాడ, గుంటూరు నగరాల్లోకి రాకుండా రాకపోకలు సాగించవచ్చు.

Updated Date - Oct 03 , 2026 | 12:42 AM