Share News

ముంగిట ఓపెన్‌ విద్య!

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:55 AM

ఏలూరు జిల్లా కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ డిజిటల్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మేలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొద్ది రోజుల్లోనే అకడమిక్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

ముంగిట ఓపెన్‌ విద్య!

25లోగా ‘డెబ్‌ ’ అనుమతికి మార్గం సుగమం

తొలివిడతలో ఆరు యూజీ ప్రోగ్రాంలు

విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నెరవేరనున్న విద్యార్థుల ఉన్నత విద్య కల

ఏలూరు అర్బన్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ డిజిటల్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మేలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొద్ది రోజుల్లోనే అకడమిక్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. తొలివిడతగా బీఏ, బీకాం, బీఎస్సీ లలో ఆరు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) ప్రోగ్రాంలలో గరిష్ఠంగా ఆగస్టు 15 లేదా అంత కంటే వారంరోజులు ముందుగానే అడ్మిషన్ల నోటిఫికేషన్‌ జారీ చేయడానికి యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి దూరవిద్య కోర్సులకు అనుమతు లిచ్చే డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) కమిటీ ఈ నెల 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ డిజిటల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు అవ సరమైన పరిశీలనలు పూర్తిచేసింది. ఆ మేరకు ఈనెల 25లోగా ‘డెబ్‌ ’నుంచి అనుమతి వస్తుం దని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఇంటర్మీడియట్‌, ఓపెన్‌ స్కూల్స్‌, తదితర కోర్సు ల్లో నిర్ణీత విద్యార్హతలు సాధించిన వారంతా అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆఫర్‌ చేసే యూజీ ప్రోగ్రాంలలో అడ్మిషన్లు తీసుకుని డిగ్రీ విద్యార్హతలు సాధించవచ్చు. మలివిడతలో ఈ ఏడాది డిసెంబరులో మరో 5 లేదా 6 యూజీ ప్రోగ్రాంలను ప్రవేశపెడతారు. తొలివిడతలో అడ్మిషన్లు తీసుకున్నవారికి వచ్చే ఏడాది జన వరిలో పరీక్షలు జరుగుతాయి. ప్రస్తుతానికి పాఠ్యపుస్తకాలు ఆంగ్లంలో ముద్రితమవుతున్నా, పరీక్షలను అభ్యర్థులు తెలుగు లేదా ఇంగ్లీషులో రాసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ డిజిటల్‌ ఓపెన్‌ యూనివర్సి టీకి రాష్ట్రవ్యాప్తంగా 76 స్టడీసెంటర్లున్నాయి. అభ్యర్థులు వీటిలో తమకు సమీపంలోని ఏ సెంటర్‌నైనా ఎంచుకోవచ్చు. అదే సెంటర్‌ నుం చి కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అందజేస్తారు. యూనివర్సిటీకి ఇప్పటికేవున్న బోధనేతర సిబ్బందికి, మరికొందరు రిటైర్డ్‌ అధ్యాపకులు, పార్ట్‌టైం లెక్చరర్లు, అకడమిక్‌ కౌన్సెలర్లకు బకాయిపడిన జీతభత్యాలను చెల్లిం చేందుకు ఏలూరు ఖజానాశాఖకు మ్యాపింగ్‌ చేసి కొద్దిరోజుల్లో చెల్లించనున్నారు. వీరితో పాటు ఒక్కో స్టడీసెంటర్‌కు వున్న 4 లేదా 5మంది సిబ్బంది వివరాలను ఏలూరు ట్రెజరీకి మ్యాపింగ్‌ చేశారు.

శాశ్వత భవనాలకు భూములెక్కడ ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రాష్ట్ర విభజన అనంతరం పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో తన విద్యాసేవలనందించింది. నిర్ణీత పదేళ్ల గడువు ముగియడంతో ఆంధ్ర ప్రదేశ్‌లో సేవలు నిలిచిపోయాయి. దీంతో వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ చొరవతో ఏలూరులో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ డిజిటల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. శాశ్వత భవనాల నిర్మాణం కోసం కనీసం 10 నుంచి 12 ఎకరాల భూము లు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారుల బృందం ఆ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 22న కలెక్టర్‌ వెట్రిసెల్విని ఏలూరులో విశ్వవిద్యా లయ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ విజయభాస్కర రావు, ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాక్టర్‌ వెలగా జోషి, తదితరులు కలుసుకుని చర్చలు జరిపా రు. ఏలూరు సమీపంలోని గోపన్నపాలెంలో ప్రభుత్వ వ్యాయామవిద్య శిక్షణ కళాశాలకు సమీపంలో వున్న భూములను, కళాశాలలోని ఓ హాస్టల్‌ భవనాన్ని పరిశీలించారు. ఇవి యూ నివర్సిటీ భవిష్యత్తు అవసరాలకు ఏమాత్రం అనువుగాలేవన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఓవైపు శాశ్వత భవనాలకు ఏలూరు, సమీప ప్రాంతాల్లో భూములను ఖరారు చేయకపోవ డం, మరోవైపు అకడమిక్‌ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ‘డెబ్‌ ’ అనుమతులు రాకపో వడంతో పురోగతి మందగించింది. తాజాగా ‘డెబ్‌’ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ లబిస్తుండటం తో ముందుగా యూజీ కోర్సుల్లోకి అడ్మిషన్లతో అకడమిక్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. కాగా ఏలూరుకు సమీపంలో జాతీయ రహదారికి దగ్గరగా చిన్నతరహా పరిశ్రమల స్థాపన (ఎంఎస్‌ఎంఈ) కోసం ప్రభుత్వం సేకరించడానికి ప్రతిపాదించిన భూములనుంచే అంబే డ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి శాశ్వత భవనాల నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో భూములను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వుండగా, రైతులు ధరలు అధికంగా డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేప థ్యంలో వర్సిటీకి ఏలూరులో శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు లేదా తాత్కాలిక భవనాలు ఖరారయ్యే వరకు యూనివర్సిటీ కార్యక లాపాల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ డిజిటల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ట్రాన్జిట్‌ క్యాంపస్‌ నుంచే అకడమిక్‌ కార్యకలాపాలను పర్యవేక్షించాలని నిర్ణయించారు.

Updated Date - Jul 16 , 2026 | 12:55 AM