మోసం గురూ..
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:31 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలను నిలువునా ముంచేసిన మరో భారీ మోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది.
ఆన్‌లైన్ ట్రేడింగ్ మాయాజాలం
‘క్యూవీఎస్‌ఈ’ యాప్ బురిడీ.. డాలర్ల వ్యాపారం పేరుతో భారీ మోసం..
చిక్కుల్లో ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగ యువత
బంగారం కుదువబెట్టి.. అధిక వడ్డీలకు తెచ్చి పెట్టుబడులు..
విత్‌డ్రాలు బంద్.. మరో రూ.50 వేలు ఇస్తేనే అసలు ఇస్తామంటూ నిర్వాహకుల మెలిక..
ఉమ్మడి పశ్చిమలో కోట్లు స్వాహా! బాధితుల గగ్గోలు
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలను నిలువునా ముంచేసిన మరో భారీ మోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. పెట్టుబడులపై రాత్రికి రాత్రే రెట్టింపు లాభాలు వస్తాయంటూ ఆశ చూపిన ఓ ముఠా... ‘క్యూవీఎస్‌ఈ’ అనే నకిలీ యాప్ ద్వారా వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఉభయ జిల్లాల పరిధిలో యువత, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఉచ్చులో చిక్కుకుని కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
నరసాపురం రూరల్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): నకిలీ యాప్ నిర్వాహకులు రూపొందించిన పథకం ప్రకారం.. యాప్‌లో నగదు జమ చేసి తక్కువ ధరకు డాలర్లు కొనాలి. డాలర్ విలువ పెరిగి నప్పుడల్లా పెట్టుబడి రెట్టింపు అవుతుందని ప్రచారం చేశారు. పెట్టుబడిదారులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక ఓటీపీ లు పంపిస్తూ, వాటిని మరో యాప్‌లో నమోదు చేయించేవారు. మొదట్లో కొందరికి లాభాలు ఇస్తున్నట్లు నమ్మించడంతో వేలాది మంది రంగంలోకి దిగారు. నరసాపురం పట్టణానికి చెందిన ఓ డ్వాక్రా సంఘం మహిళ తన కుటుంబ రుణాలను తీర్చేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంది. యాప్‌లో యాభై వేల రూపాయలు పెడితే లక్షన్నర రూపాయలు వస్తాయని బంధువులు నమ్మించ డంతో.. ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు జమచేసింది. రోజులు గడుస్తున్నా లాభం రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. ఇదే పట్టణానికి చెందిన ఓ మహిళా ఉద్యోగి మూడు లక్షల రూపాయల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టి చివరకు లబోదిబోమంటోంది. మండలంలోని మరో గ్రామానికి చెందిన యువకుడు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి నగదు జమచేశాడు. ప్రస్తుతం ఓటీపీలు రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నాడు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పాలకొల్లు, మొగల్తూరు తదితర ప్రాంతాల్లోనూ ఈ బాధితులు ఉన్నారు.
చైన్ లింక్ తరహాలో విస్తరణ.. విత్‌డ్రాలు బంద్
ఒకరి ద్వారా మరొకరు చేరే చైన్ లింక్ విధానంలో ఈ దందా వేగంగా విస్తరించింది. ‘నాకు భారీగా లాభాలు వచ్చాయి.. మీరూ చేరండి’ అంటూ ఒకరిని చూసి మరొకరు యాభై వేల నుంచి లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఒక్కొక్కరి ద్వారా సుమారు ఇరవై మంది వరకు ఈ యాప్‌లో చేరినట్లు సమాచారం. ఇందుకోసం అత్యధికులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం, అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం చేశారు. ఖాతాల్లో లాభాలు కనిపిస్తుండటంతో కొందరు నగదును వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించారు. పది రోజులుగా విత్‌డ్రా ఆప్షన్ పనిచేయడం ఆగిపోయింది. లాభాలు రాకపోయినా కనీసం తమ అసలు సొమ్ము ఇప్పించాలని బాధితులు కోరగా.. మరో యాభై వేల రూపాయలు చెల్లిస్తేనే పాత సొమ్మును విత్‌డ్రా చేసుకునే వీలుంటుందని నిర్వాహకులు బెదిరింపు ధోరణిలో సమాచారం పంపుతున్నారు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
కష్టపడకుండా డబ్బులు రావు: సీఐ ఆకుల రఘు
తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో వచ్చే తప్పుడు లింక్‌లు ఓపెన్ చేసి సొమ్ములు పోగ్గొ ట్టుకుంటున్నారు. కష్టపడకుండా డబ్బులు ఎవరికి రావన్న విష యం గ్రహించాలి. ఇతరులకు డబ్బులు వచ్చాయన్న ఆశతో చాలా మంది సైబర్ వలలో పడుతున్నారు. దీనిపై ప్రజలకు తరుచూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు మారాలి. సైబర్ నేరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.