డిపోకు ఒక్క బస్సే
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:28 AM
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రజలు వచ్చేందుకు గతంలో భారీగా స్పెషల్ బస్సులు నడిపిన ఆర్టీసీ అధికారులు ఈసారి రోజుకు ఒకటే ఏర్పాటు చేశారు.
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి
తగ్గిపోయిన స్పెషల్ సర్వీసులు
భీమవరం టౌన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతికి హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రజలు వచ్చేందుకు గతంలో భారీగా స్పెషల్ బస్సులు నడిపిన ఆర్టీసీ అధికారులు ఈసారి రోజుకు ఒకటే ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత సర్వీసులు పెట్టిన తరువాత బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఈ సంక్రాంతికి స్పెషల్ సర్వీసులకు కోతపడింది. జిల్లాలో నాలుగు డిపోలు ఉన్నాయి. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు డిపోల నుంచి ఒక్కో బస్సు వేశారు. 9వ తేదీ నుంచి 13వ తేదీవరకు రోజూ డిపో నుంచి ఉదయం బయలుదేరి హైదరాబాద్ వెళ్లి మరుసటి రోజు ప్రయాణికులను తీసుకువచ్చేలా ఏర్పాటు చేశారు. గతంలో ఒక్కో డిపో నుంచి 4 వరకు స్పెషల్ సర్వీసుల నడిచేవి. హైదరాబాద్ నుంచి వచ్చే రెగ్యులర్ 14 సర్వీసులకు రెండు నెలల క్రితమే రిజర్వేషన్‌లు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలలోనే స్పెషల్ సర్వీసుల ఏర్పాటుకు ఆర్టీసీ అఽధికారులు కసరత్తు చేసేవారు. ఈసారి ప్రత్యేక సర్వీసులు నడపలేమని ముందుగా చెప్పారు. కానీ సంక్రాంతి రద్దీ దృష్టా ఒక్కో బస్సు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో పెట్టగానే హట్‌కేకుల్లా టికెట్లు అయిపోయాయి. వేల సంఖ్యలో ప్రజలు జిల్లాకు వచ్చే సమయంలో డిపో నుంచి ఒక్క బస్సు ఏర్పాటు చేస్తే ఎలా సరిపోతాయంటూ ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ మరింత దోపిడీకి దిగుతారని అంటున్నారు. సంక్రాంతికి వచ్చేవారు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.