కలెక్షన్ సెంటర్ల.. మాయాజాలం!
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:31 AM
పామాయిల్ గెల లను రైతుల నుంచి సేకరించి ఫ్యాక్టరీకి తరలించేం దుకు ప్రభుత్వం కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దూరాన్ని బట్టి రవాణా చార్జీలను నిర్ణయించి ఆ మేర కు టెండర్లను పిలిచింది.
రవాణా వ్యయం కంటే తక్కువకు టెండర్లు
నష్టాల నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కుతున్న వైనం
పామాయిల్ గెలల కలెక్షన్ సెంటర్ల టెండర్లలో లొసుగులు
పెదవేగి, మార్చి 12(ఆంధ్రజ్యోతి):పామాయిల్ గెల లను రైతుల నుంచి సేకరించి ఫ్యాక్టరీకి తరలించేం దుకు ప్రభుత్వం కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దూరాన్ని బట్టి రవాణా చార్జీలను నిర్ణయించి ఆ మేర కు టెండర్లను పిలిచింది. ఈ కలెక్షన్ సెంటర్లను దక్కిం చుకోవడానికి కొంతమంది వాస్తవ వ్యయం కంటే అతి తక్కువకు టెండర్ వేసి సెంటర్‌ను దక్కించుకుంటున్నా రు. ఆపై వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అడ్డదారు లు తొక్కుతున్నారు.
పెదవేగిలోని ఏపీ ఆయిల్‌ఫెడ్ పరిధిలో పెదవేగి, లింగపాలెం, కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి మండలాల నుంచి పామాయిల్ గెలలు పెదవేగిలోని ఏపీ ఆయిల్‌ప్రాసెసింగ్ యూనిట్ (పామాయిల్ ఫ్యాక్టరీ)కు వస్తుంటాయి. ఇక్కడ గెలల ప్రాసెసింగ్‌తో ముడిచమురు తీసి ఎగుమతి చేస్తుంటా రు. ఈ ఐదు మండలాలకు సంబంధించి 14,127 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోంది. ఇందులో 10,436 హెక్టార్లలో గెలల దిగుబడి వస్తోంది. గతేడాది 1.70 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఏలూ రు జిల్లాలో 15, కాకినాడ జిల్లాలో ఐదు కలెక్షన్ సెంట ర్లను ఆయిల్‌ఫెడ్ కేటాయించింది. దూరాన్ని బట్టి రవాణా చార్జీల చెల్లింపు ఉంటుంది. అయితే కొంత మంది ఏజెంట్లు ఆయిల్‌ఫెడ్ నిర్ణయించిన ధరకంటే అతితక్కువ ధరకు కోట్ చేస్తూ కలెక్షన్ సెంటర్లను దక్కించుకుంటున్నారు. ఏజెంట్లు కోట్ చేసిన ధరతో వారికయ్యే ఖర్చులో సగంకూడా రాదని ఫ్యాక్టరీ ప్రతి నిధులు చెబుతున్నారు. అలాంటప్పుడు కలెక్షన్ సెంట ర్లను ఎలా నిర్వహిస్తున్నారనేది ప్రశ్నార్థకమే. కలెక్షన్ సెంటర్ కాలపరిమితి రెండేళ్లు. రైతుల నుంచి సేకరిం చిన పామాయిల్ గెలలను సెంటర్ నుంచి ఫ్యాక్టరీకి తరలించే సమయంలో నష్టాలను పూడ్చుకోవడానికి కొంతమంది ఏజెంట్లు ఇసుక మట్టి, కంకర రాళ్లను గెలలతో పాటు కలపడం లేదా గెలలను నీటితో తడిపి ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో గెలల బరువు పెరిగి ఆదాయం వస్తుంది. దీంతోపాటు సీజన్‌లో ఆయిల్‌ఫెడ్‌కు తరలించాల్సిన గెలలను అధిక ధరకు ప్రైవేట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతువారీగా పరిశీలిస్తే ఇలాంటివి చాలా అరుదు.
ప్రైవేట్ ఫ్యాక్టరీలకు 70 వేల టన్నులు తరలింపు
ఏపీ ఆయిల్‌ఫెడ్ పరిధిలోని ఐదు మండలాల్లో విస్తరించి ఉన్న ఆయిల్‌పామ్ తోటల నుంచి గతేడాది 1.70 లక్షల టన్నుల గెలల దిగుబడి రాగా పెదవేగిలోని ఆయిల్‌ఫెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో లక్ష టన్నుల ప్రాసెసింగ్ జరిగింది. మిగిలిన 70 వేల టన్నుల గెలలను ప్రైవేట్ ఫ్యాక్టరీలకు విక్రయిం చామని ఏపీ ఆయిల్‌ఫెడ్ డివిజనల్ అధికారి జి.జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇలా విక్రయించే సమయంలో సాధారణంగా ఉన్న ధరకు అదనంగా మూడువేల రూపాయల వరకు ధరను ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఆయిల్‌ఫెడ్‌కు చెల్లిస్తుంటాయి. ఇదే అదనుగా తీసుకుని కలెక్షన్ ఏజంట్లు ఆయిల్‌ఫెడ్‌కు చెల్లించే ధరలో అనధికారికంగా రూ.500లు తగ్గించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా టన్నుకు రూ.2,500ల వరకు లబ్ధిని పొందుతున్నారని బహిరంగంగా వినిపిస్తున్న వాదనలు.
నూనె దిగుబడి శాతంపై ప్రభావం
గెలల బరువును పెంచుకోవానికి నీటితోపాటు ఇసుక, మట్టి వంటివాటిని గెలలతోపాటు కలిపి, ఫ్యాక్టరీకి తరలిస్తుండడంతో ఆ మేరకు నూనె దిగుబడి శాతం తగ్గుతుంది. పెదవేగి ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీలో పాతకాలంనాటి యంత్రాల కారణంగా కూడా నూనె దిగుబడి (ఆయిల్ రికవరీ) శాతం తగ్గుతోంది. ఇది రైతులకు చెల్లించే ధర నిర్ణయంపై ప్రభావం చూపుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంటోంది. కలెక్షన్ సెంటర్లకు టెండర్లను ఎంపిక చేసే సమయంలోనే కఠినంగా ఉంటే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉండవు కదా అని రైతులు వాపోతున్నారు.
నిబంధనలు మార్చి టెండర్ల ప్రక్రియ
కలెక్షన్ సెంటర్‌ను దక్కించుకోవాలంటే వేబ్రిడ్జి ఖచ్చితంగా ఉండాలనేది నిబంధన. ఈసారి ఆ నిబంధనలను పక్కన పెట్టి టెండర్లకు పిలుపునిచ్చారు. వేబ్రిడ్జి లేకపోయినా రూ.15లక్షలు డిపాజిట్ చేసి 45 రోజుల్లోగా వేబ్రిడ్జి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే చాలు వారు టెండర్లలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. ఇది అయినవారికి అవకాశం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఆయిల్‌ఫెడ్‌లోని ఓ పెద్ద నాయకుడు తీసుకున్న నిర్ణయంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.