Share News

కాలం మారినా.. ఇంకా పాత గుర్తులే !

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:54 PM

పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కొత్త తలనొప్పిగా మారింది. కాలం మారినా ఎన్నికల గుర్తులు మాత్రం మారడం లేదు.

కాలం మారినా.. ఇంకా పాత గుర్తులే !

పాతకాలం వస్తువులతో అభ్యర్థులకు కొత్త తిప్పలు

యువ ఓటర్లకు తెలియని గుర్తులు

ఎలా ప్రచారం చేయాలో తెలియక అయోమయం

మొబైల్‌, బైక్‌ వంటి ఆధునిక గుర్తుల కోసం విజ్ఞప్తి

ఏలూరు రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కొత్త తలనొప్పిగా మారింది. కాలం మారినా ఎన్నికల గుర్తులు మాత్రం మారడం లేదు. దశాబ్దాల క్రితం వాడుకలో ఉన్న వస్తువులు, పరికరాలనే ఇప్పటికీ ఎన్నికల గుర్తులుగా కేటాయిస్తుండటంతో అభ్యర్థులు తికమకపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత తరానికి పరిచయం లేని గుర్తులను ఓటర్లకు ఎలా వివరించాలో తెలియక సతమతమవుతున్నారు. ఒకప్పుడు నిత్యజీవితంలో భాగంగా ఉన్న వస్తువులు నేడు కనుమరుగవడంతో యువ ఓటర్లకు వాటి గురించి కనీస అవగాహన కూడా లేకపోవడం అభ్యర్థులకు ప్రచారంలో ఇబ్బందిగా మారింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచం పరుగులు తీస్తుంటే.. ఎన్నికల గుర్తులు మాత్రం ఇంకా పాతకాలంలోనే ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా ఆ పాత గుర్తులే

టెలిఫోన్‌, టీ కెటిల్‌, కీతో తిప్పే కెమెరా, రంపం, కుండ, తిరగలి వంటి గుర్తులు ఇప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. దశాబ్దాల క్రితం ఉపయోగించిన ఈ వస్తువులు నేటి తరానికి పెద్దగా పరిచయం లేనివి. దీంతో తమకు కేటాయించిన గుర్తులను ప్రజలకు పరిచయం చేయడానికి అభ్యర్థులు ప్రత్యేకంగా శ్రమించాల్సి వస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల గుర్తుల్లోనూ మార్పులు తీసుకురావాలని అభ్యర్థులు కోరుతున్నారు. మొబైల్‌ ఫోన్‌, మోటార్‌ సైకిల్‌, కారు, వాలీబాల్‌, గ్యాస్‌ స్టవ్‌, బల్బు వంటి ప్రస్తుతం ప్రజలకు సుపరిచితమైన వస్తువులను గుర్తులుగా కేటాయిస్తే ఓటర్లకు సులభంగా అర్థమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

గుర్తు చూపించాలన్నా.. వివరించాలన్నా కష్టమే!

సర్పంచ్‌ అభ్యర్థులకు కేటాయించే 25 గుర్తుల్లో చాలా వరకు పాతకాలం నాటి వస్తువులే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెలిఫోన్‌, తిరగలి, మట్టి నీటి కుండ, మట్టి పలక, కొవ్వొత్తులు, చేతికర్ర, ద్రాక్షపళ్లు, క్యారంబోర్డు, టీవీ యాంటెన్నా వంటి గుర్తులు నేటి ఆధునిక కాలంలో పెద్దగా వాడుకలో లేవు. ఇక వార్డు సభ్యుల అభ్యర్థులకు కేటాయించే 20 గుర్తుల్లోనూ పాతకాలం నాటి వస్తువులే ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో స్థానికంగా ప్రజలకు పరిచయమైన వస్తువులను ఎన్నికల గుర్తులుగా కేటాయిస్తున్నారని, అదే విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో గుర్తుల మార్పుపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Nov 20 , 2026 | 11:54 PM