కొంత సొమ్ము దాచుకోండి
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:08 AM
సామాజిక పెన్షన్ల సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం కొంత దాచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.
క్షేత్రస్థాయిలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్
పాలకోడేరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): సామాజిక పెన్షన్ల సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం కొంత దాచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. పాలకోడేరు మండలం కుముదవల్లి పంచాయతీ చినపేటలో బుధవా రం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. ఆమె కుమారుడు భరత్ వృద్ధులకు పండ్లు పంపిణీచేశారు. జిల్లావ్యాప్తంగా 2,25,521 మంది లబ్ధిదారులకు 20 రకాల పింఛన్ల నిమిత్తం రూ.97.19 కోట్లు పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్, ఏపీవో ఎం.శ్రీనివాసప్రసాద్, ఎంపీడీవో రెడ్డయ్య, తహసిల్దార్ ఎన్.విజయలక్ష్మి, సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
5న గ్రామసభలు నిర్వహించాలి
భీమవరం రూరల్ : వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాల్లో విస్తృతంగా గ్రామసభ లు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. పల్లె పండుగ 2.0లో మంజూరైన రోడ్లు, క్యాటిల్ షెడ్లు, మ్యాజిక్ డ్రెయిన్లు తదితర పనులపై రెండు నుంచి 12 వరకు స్థానిక ప్రజా ప్రతినిధులతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించాలన్నారు.