వంటనూనె సలసల
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:13 AM
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఉంది పరిస్థితి. ఇరాన్ – ఇజ్రా యెల్, అమెరికా యుద్ధాల ప్రభావం వంట నూనెలపై పడింది. సోమవారం మార్కెట్లో 750 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.119కు పెంచేశారు.
తాడేపల్లిగూడెం, మార్చి 10(ఆంధ్రజ్యోతి):ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఉంది పరిస్థితి. ఇరాన్ – ఇజ్రా యెల్, అమెరికా యుద్ధాల ప్రభావం వంట నూనెలపై పడింది. సోమవారం మార్కెట్లో 750 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.119కు పెంచేశారు. ఇంతకు ముందు ఇదే ప్యాకెట్ ధర రూ.112 ఉండేది. మంగళవారం రూ.117 ఉంది. ఒక్కసారిగా ప్యాకెట్‌కు రూ.7 పెంచి కంటి తుడుపుగా రూ.2 తగ్గించారు. రెండు రోజులుగా పెద్దపెద్ద మాల్స్‌లో కూడా ఆయిల్ ప్యాకెట్లు లేవు. కొరత సృష్టించి బ్లాక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులకు సరిపోయినంత సరకు ఇవ్వడం లేదని వాపోతున్నారు. 10 బాక్సులు (కేసులు) కావాలని ఇండెంట్ పెడుతుంటే కేవలం 5 మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. యుద్ధం ప్రభావం ఎక్కువగా వంట నూనెలపై పడింది. లీటర్ (910 గ్రామలు)ఉండే పామాయిల్ ప్యాకెట్ రిటైల్‌గా రూ.127, ఫ్రీడమ్ సన్‌ప్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ రూ.174, వేరుశనగ ఆయిల్ ప్యాకెట్ రూ.180లకు విక్రయిస్తున్నారు. రెండు వారాల కిందట ధరలతో పోల్చుకుంటే ప్యాకెట్‌కు రూ.10 కంటే అదనంగా పెంచి అమ్ముతున్నారు. ఇక 15 లీటర్లు (13.5 కిలోలు) ఉండే ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా గతంలో రూ.2450 ఉంటే ఇప్పుడు రూ.2600కు విక్రయిస్తున్నారు. యుద్ధం కొనసాగితే నూనె ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
జిల్లాకు ఈ పోర్టులే పెద్ద దిక్కు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు 70 టన్నులు నూనె వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వంట నూనెలో 60 శాతం దిగుమతులపై ఆధార పడటం వల్ల గ్లోబల్ సరఫరా సమస్యలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. జిల్లాకు వంటనూనెకు సంబంధించిన ముడిసరుకు జలమార్గం ద్వారానే జరుగుతుంది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టు నుంచే ముడి ఆయిల్ వస్తుంది. రిఫైనరీలో శుద్ధి చేసి ప్యాకింగ్, డబ్బాల్లో నింపి వినియోగదారులకు అందజేస్తుంటారు. సింగపూర్, మలేషియాల్లో పామాయిల్‌ను ఎక్కువగా సాగు చేస్తుం టారు. ఇక సన్‌ప్లవర్ ఆయిల్‌కు సంబంధించిన ముడి సరకు ఇండోనేషియా ద్వారా భారతదేశానికి వస్తుంది. యుద్ధ ప్రభావంతో పూర్తిగా జలరవాణా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితులను అదునుగా చేసుకుని హోల్‌సేల్ వ్యాపారులు సరుకు బ్లాక్ చేసి ధరలు పెంచేస్తున్నారు.