ఏజెన్సీ భూవివాదాలపై అధికారుల విచారణ
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:27 AM
ఏజన్సీ గిరిజన–గిరిజనేతర భూవివాదాలపై అధికారులు తహసీల్ధారు కార్యాలయంలో సోమవారం విచారణ నిర్వహించారు.
గిరిజనులు–అధికారుల మధ్య వాగ్వివాదం
హైకోర్టు తీర్పు అమలు చేయాలని గిరిజనేతర రైతుల డిమాండ్
గిరిజన హక్కులు, చట్టాలు కాపాడాలని గిరిజనుల వినతి
పోలవరం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఏజన్సీ గిరిజన–గిరిజనేతర భూవివాదాలపై అధికారులు తహసీల్ధారు కార్యాలయంలో సోమవారం విచారణ నిర్వహించారు. ఐటీడీఏ పీవో రాములు నాయక్, డీఎస్పీ రవిచంద్ర, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ, తహసీల్ధారు బి.సాయిరాజు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ విచారణలో గిరిజనుల తరపున ఏజన్సీ గిరిజన సంఘం రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ, గిరిజనేతర రైతులు పాల్గొనగా గత 40 ఏళ్ళుగా గిరిజనుల సాగులో ఉన్న భూములను హైకోర్టు ఆదేశాల పేరిట గిరిజనేతరులకు అప్పగించాలని అధికారులు ప్రయత్నించడాన్ని ఏజన్సీ గిరిజన సంఘం రైతు కూలీ సంఘం తప్పుపట్టింది. 2004లో జస్టిస్ కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నాన్ షెడ్యూలు ప్రాంతంలో ఉన్న గిరిజన భూములను 1/70 చట్టం ప్రకారం గిరిజనుల సాగులో ఉన్న భూములను గిరిజనులకు అప్పగించాలని గిరిజన నాయకులు అధికారులను కోరారు. ఐటీడీఏ రాములు నాయక్ మాట్లాడుతూ 1/70 చట్టం రాకమునుపే ఆ భూములకు గిరిజనేతరులు పట్టాలు కలిగి ఉన్నారని ఈ విషయంపై హైకోర్టుని ఆశ్రయించగా ఆ భూములు గిరిజనేతరులకు అప్పగించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిందని హైకోర్టు తీర్పు ప్రకారం ఆ భూములు వారికి ఇప్పటికే అప్పగించాల్సి ఉండగా అమలు చేయకపోవడం వలన స్థానిక రెవెన్యూ అధికారులను కోర్టు ధిక్కార నేరంగా పరిగణించిందన్నారు. గిరిజనులు తమకు భూములపై ఉన్న హక్కు పత్రాలను సంబంధిత రికార్డులను తీసుకుని కోర్టుని ఆశ్రయించాలి గానీ మధ్యంతర పంచాయితీలు పెట్టడం తగదన్నారు. అధికారులు కోర్టు తీర్పుని అమలు పరచడం తప్ప చేయగలిగింది లేదన్నారు. గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ 1994 సంవత్సరానికి ముందు జిల్లా కలెక్టర్ రామకృష్ణ గ్రామంలో సభలు నిర్వహించి ఆ భూములను ఎడబ్ల్యు భూములుగా తేల్చారని చెప్పడంతో అప్పటి నివేదికలు చూపమని పీవోకి గిరిజన నాయకుల మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. డీఎస్పీ రవిచంద్ర వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తగిన ఆధారాలతో రావాలని గిరిజనులకు సూచించడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో రైతు కూలీ సంఘం నాయకురాలు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండు నెలలు గడువు ఇవ్వాలని కోరడంతో అధికారులు అంగీకరించారు. గిరిజనేతర రైతులకు ఆ భూములు ఎలా సంక్రమించాయిని ఐటీడీఏ పీవో గిరిజనేతరులను ప్రశ్నించడంతో 1915–30 సంవత్సరాల్లో గంగోలు ఫిఠాపురం జమీన్లు వేసిన భూముల వేలంలో తమ పూర్వీకులు కొనుక్కున్నారని సంబంధిత రికార్డులను పట్టాలను హైకోర్టులో ధాఖలు చేయడంతో కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు.