Share News

పల్లెలకు ఆఫర్‌

ABN , Publish Date - May 03 , 2026 | 12:36 AM

ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపులు చేపట్టే వారికి ప్రభుత్వం ఐదు శాతం తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది.

పల్లెలకు ఆఫర్‌

జిల్లాలో రూ.41.62 కోట్ల డిమాండ్‌

పది శాతం లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు

ఇప్పటికే రూ.20 లక్షల వసూలు

తాడేపల్లిగూడెం టౌన్‌, మే 2(ఆంధ్రజ్యోతి):ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపులు చేపట్టే వారికి ప్రభుత్వం ఐదు శాతం తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. గతంలో మున్సిపాలిటీల్లో మాత్రమే ఉండే ఈ పథకం ఇకపై పంచాయతీలకు వర్తింపజేస్తూ కొత్త పాలసీని తీసుకువచ్చింది. దీనికోసం పన్నుల వసూళ్లపై స్వర్ణ పంచాయతీ యాప్‌ను రూపొందించి తద్వారా ఈ పన్ను చెల్లించే వారికి ఆస్తి పన్నులో ఐదు శాతం తగ్గింపు అవకాశం కల్పించింది. ఈ విదానం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలవుతుండగా పంచాయతీలకు వర్తించే వెసులుబాటు కల్పించింది. జిల్లాలో రూ.41 కోట్ల 62 లక్షల ఆస్తి పన్ను డిమాండ్‌ ఉండగా ముందస్తు చెల్లింపుల పథకంలో ఇప్పటికే రూ.20 లక్షలు వసూలు చేశారు. పన్నులు వసూలు చేసి, ఆదాయం సృష్టించే అదికారులకు ప్రభుత్వం ప్రొత్సాహకంగా ఇప్పటికే అవార్డులను అందించింది. ఇలా అవార్డులు అందించడం ద్వారా రాబోయే రోజుల్లో పంచాయతీ పాలనలో పోటీతత్వం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీరాజ్‌ దినోత్సవంలో భాగంగా మండలానికి ఒక కార్యదర్శి చొప్పున ఎంపిక చేసి అవార్డులు అందించారు.

రూ.4 కోట్ల వసూలే లక్ష్యం..

ప్రభుత్వం ప్రకటించిన ముందస్తు పన్ను చెల్లింపుల పథకం ద్వారా జిల్లాలో రూ.41.62 కోట్ల డిమాండ్‌ ఉండగా వాటిలో పది శాతం అయినా పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ డిమాండ్‌ ప్రకారం రూ.4 కోట్లు వసూలు చేయాలని భావిస్తోంది. మొత్తం డిమాండ్‌ ఉన్న పన్నులు చెల్లిస్తే ప్రజలకు రూ. కోటీ 24 లక్షలు డిస్కౌంట్‌ ద్వారా లభించనుంది.

స్వర్ణ పంచాయతీ యాప్‌ ద్వారా పారదర్శకత

గతంలో పన్నుల వసూళ్ల విషయంలో పంచాయతీల్లో భారీ అవకతవకలు జరిగేవి. పన్నులు వసూలు చేసి కార్యదర్శులు, సర్పంచ్‌లు చేతివాటం చూపిస్తున్నారని వారిపై విచారణలు, సస్పెన్షన్‌లు విధించేవారు. దీంతో ఇటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు జమ కాక అమాయకులైన ప్రజలు సిబ్బంది చేతివాటంతో ఒకటికి రెండుసార్లు పన్నులు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ విధానానికి చెక్‌ పెడుతూ కూటమి ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ యాప్‌ను రూపొందించి తద్వారా పారదర్శకంగా ప్రజల సొమ్ము ప్రభుత్వానికి చేరడం ద్వారా ప్రజలకు సంక్షేమానికి ఉపయోగించే వీలుంటుంది.

మే 1 నుంచి 31 వరకు అమలు

స్వర్ణ పంచాయతీ యాప్‌ ద్వారా ముందస్తు పన్ను వసూలు చేపట్టేందుకు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు సన్నాహాలు చేశారు. ఈ విదానం మున్సిపాలిటిల్లో ఏటా ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకూ ముందస్తు చెల్లింపులు చేసిన వారికి అవకాశం కల్పించేవారు. పంచాయతీల్లో వసూళ్లకు ఈ ఏడాది యాప్‌ రూపకల్పనలో జాప్యం కారణంగా మే 1 నుంచి 31 వరకు అవకాశం ఇచ్చారు.

పట్టణాల్లో అదరహో..

ఆరు మునిసిపాల్టీల్లో ఆస్తి పన్ను రూ.27.23 కోట్ల వసూళ్లు.. భీమవరం టాప్‌

భీమవరం టౌన్‌, మే 2(ఆంరఽధజ్యోతి):మునిసిపాల్టీల్లో ముందస్తు ఆస్తి పన్ను వసూళ్లు అదరగొట్టాయి. ఈ ఏడాదికి సంబంధించి ఒకేసారి పన్ను చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం రాయితీని ప్రకటించింది. గత నెల 30వ తేదీ వరకు జిల్లాలోని ఆరు మునిసిపాల్టీల్లో రూ.27.23 కోట్లు వసూలు కాగా, ఇందులో ఒక్క గురువారమే రూ.3.28 కోట్లు వుంది. మొత్తంగా చూస్తే భీమవరంలో అత్యధికంగా రూ.8.83 కోట్లు వసూలు చేశారు. ఆస్తి పన్ను చెల్లింపులో యజమానులు స్వచ్ఛందంగా చెల్లించారు. గత ఏడాదికి సంబంధించి వడ్డీ రాయితీ పఽథకం పొడిగించడంతో ఈసారి ఎక్కువ మంది వినియోగించుకున్నారు. పట్టణాల వారీగా.. తణుకు రూ.6.48 కోట్లు, తాడేపల్లిగూడెం రూ.6.04 కోట్లు, పాలకొల్లు రూ.2.98 కోట్లు, నరసాపురం రూ.2.12 లక్షలు, ఆకివీడు రూ.78 లక్షలు వుంది. భారీ వసూళ్లపై మునిసిపాలిటీ అధికారులు ఖుషీగా వున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:37 AM