హడావుడిగా ఓఅండ్‌ఎం పనులు
ABN , Publish Date - May 27 , 2026 | 12:24 AM
సాగు నీరు సక్రమంగా అందించేందుకు వేసవిలో కాల్వల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటివరకు 40 శాతం పనులు పూర్తి
గోదావరి కాల్వకు 1న నీరు విడుదల
సాగు నీరు సక్రమంగా అందించేందుకు వేసవిలో కాల్వల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. మే నెల ముగుస్తోంది.. జూన్ మొదటి వారంలో కాల్వలకు నీరు విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాల్వల పనులు పూర్తవుతాయా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
కాల్వల పనులకు నిధుల మంజూరు ఆల స్యం కావడంతో పనులపై ప్రతిష్టంభన నెల కొంది. నీటి విడుదల సమయం సమీపిస్తుం డడంతో సాగునీటి సంఘాలు, అధికారులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఓఅండ్‌ఎం కింద 248 పనులకు రూ. 15 కోట్లు నిధులు మంజూరయ్యాయి. సాగునీటి సంఘాల ద్వారా మేజర్ డ్రెయిన్లు, కాల్వల్లో పూడికలు తీయడంతో పాటు వివిధ ఛానల్స్‌లో సాగునీటికి ఆటంకంగా ఉన్న గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులు చేస్తున్నారు. మే మొ దటి వారంలో ప్రారంభమైన పనులు ఇప్పటికి 40 శాతం పనులు పూర్తయ్యాయి. నీరు విడుదల చేసే సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పనులు వేగవంతం అయ్యాయి.
వెంటాడుతున్న ప్రజాప్రతినిధులు
ఓఅండ్‌ఎం పనులు ప్రగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్య వేక్షణతో అధికారుల్లో కదలిక వచ్చింది. గోదావరి కాల్వ ప్రక్షాళన చేయాలని ఉంగుటూరు, భీమ డోలులో పరిధిల్లో పనులు చేయకపోతే శివారు ప్రాంతాలైన దెందులూరు నియోజకవర్గానికి సాగు, తాగునీటికి ఇక్కట్లు ఉంటాయని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను వెంటాడుతున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మ రాజు కూడా గోదావరి కాల్వ ప్రక్షాళన పనులు ఎట్టి పరిస్థితుల్లో జూన్ 5 నాటికి పూర్తి చేయాలని అధికారుల వెంట పడుతున్నారు.
కాల్వల పూడికతీత కీలకం
ప్రధానంగా గోదావరి, కృష్ణా కాల్వల్లో పూడిక తీత, డ్రెయిన్లలో గుర్రపు డెక్క, కిక్కిస తొలగిం పు పనులు ఈ సీజన్‌కు కీలకం. ప్రస్తుతం 10 శాతం కూడా ఈ పనులు పూర్తి కాలేదని గుర్తించారు. రానున్న వారం రోజుల్లో సాధ్యమై నంత మేర గుర్రపు డెక్క, కిక్కిసలను తొల గించిన నీటి విడుదలకు ఆటంకాలను తొలగించాలని అధికారులు చర్యలు చేపట్టారు. జూన్‌లో కాల్వలకు నీటి విడుదల చేసి ముందస్తు ఖరీఫ్‌తో వరద గండం నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
1న గోదావరి నీరు
విజ్జేశ్వరం నుంచి గోదావరి కాల్వకు జూన్ 1న నీటి విడుదల చేస్తారని జలవనరుల శాఖ ఎస్‌ఈ సీహెచ్ దేవప్రకాష్ తెలిపారు. ఉంగు టూరు, భీమడోలు మండలాల్లో పూడికలు, కిక్కిస తొలగింపు జూన్ 5లోగా పూర్తి చేస్తా మన్నారు. కృష్ణాకాల్వకు జూన్ 12 తర్వాత నీటి విడుదలయ్యే అవకాశం ఉంది. విజయవాడ పరిధిలో బుడమేరు మరమ్మతు పనులు, ఇతర కాల్వల పనులతో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏలూరు జిల్లాలో రూ.10.15 కోట్లతో 150 పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.