కొత్త పార్లమెంట్ స్థానం నూజివీడు?
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:21 AM
జిల్లాల పునర్విభజనతో ఏలూరు జిల్లాలో విలీనమైన నూజివీడు నియోజకవర్గం ప్రస్తుత నియోజకవర్గాల పున ర్విభజనతో పార్లమెంట్ నియోజకవర్గం కానుందనే రాజకీ య విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
పార్లమెంట్ స్థానంతో సరికొత్త సమీకరణ
ఎన్టీఆర్ జిల్లాకు మారుతుందా?
రాజకీయ పార్టీల అంచనా
జిల్లాల పునర్విభజనతో ఏలూరు జిల్లాలో విలీనమైన నూజివీడు నియోజకవర్గం ప్రస్తుత నియోజకవర్గాల పున ర్విభజనతో పార్లమెంట్ నియోజకవర్గం కానుందనే రాజకీ య విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని స్థానికులు డిమాండ్ చేస్తు న్నారు. చంద్రబాబు ఎన్నికల్లో సానుకూలంగా స్పందించినా కార్యాచరణలో పలు ప్రతిబంధకాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నూజివీడు పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటు కానుందనే ప్రచారం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో నూజివీడు పార్లమెంట్ నియోజకవర్గ ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను గందరగోళం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెనమలూరు, గన్నవరం, నూజివీడు ప్రాంతాల ప్రజలు ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చిక్కుముడులను సరిచేయాలనుకున్న కూటమి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. స్థానిక డిమాండ్లను, గ్రేటర్ విజయవాడ అంశాన్ని గమనంలోకి తీసుకున్న ప్రభు త్వం అన్ని చిక్కుముడులకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉంది. దీనిని బట్టి గన్నవరం, పెనమలూరులోని కొంత ప్రాంతం ఎన్టీఆర్ జిల్లాలో కలుస్తాయి. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నూజివీడునూ కలిపే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. దీంతో కొత్త పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటుకు నూజివీడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. నూజివీడు, గన్నవరం, విజయవాడ రూరల్ (కొత్తది), తిరువూరు, మైలవరం నియోజకవర్గాలతో కలిపి పార్లమెంట్ స్థానం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.
విజయవాడ పార్లమెంట్ స్థానం ఇలా..
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రస్తు తం విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు ఉన్నాయి. కొత్తగా విజయవాడ నగరంలో ఉత్తరం, దక్షిణం రెండు నియోజక వర్గాలు పెరుగుతాయి. ఇబ్రహీంపట్నం (కొండపల్లి), కంచిక చర్ల నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి పెరుగుతుంది. విజయ వాడ గ్రేటర్ ప్రతిపాదనలో ఉన్న విజయవాడ రూరల్ మం డలం ప్రత్యేకంగా నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంది. గ్రేటర్‌ను దృష్టిలో పెట్టుకుని, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నూజివీడుతో పాటు గన్నవరాన్ని కూడా కలిపితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండుగా చేసే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమలో తాడేపల్లిగూడెం?
పశ్చిమ గోదావరిలో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు లోక్‌సభ స్థానాలు కూడా పెరగనున్నాయి. తాడేపల్లిగూడెం కేంద్రంగా పార్లమెంట్ స్థానం ఏర్పడవచ్చని భావిస్తున్నారు. వైసీపీ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగలేదంటూ కూటమి ప్రభుత్వం కొద్ది మార్పులతో కొత్త గా జిల్లాలను పెంచింది. ఏలూరు, తూర్పుగోదావరి, నర సాపురం పార్లమెంట్ స్థానాల పరిధిలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ఇప్పుడు ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు పెంపు అనివార్యం కానుంది. అదే జరిగితే తాడేపల్లిగూడెం నియోకవర్గానికి మూడు వైపులా ఉన్న పార్లమెంట్ స్థానాల పరిధిలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. దాంతో ఇప్పుడు మరో పార్లమెంట్ స్థానం ఇక్కడ పెంచాల్సి ఉంటుంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటు కానుందంటూ చర్చ జరుగుతోంది.
అనుకూలతలు ఎన్నో..
తాడేపల్లిగూడెం కేంద్రంగా పార్లమెంట్ నియోజకవర్గ ఏర్పాటుకు పలు అనుకూలతలు ఉన్నాయి. జాతీయ రహదారి, ప్రధాన రైలు మార్గం, జాతీయ విద్యా సంస్థ ఏపీ నిట్, రాష్ట్రస్థాయి విద్యా సంస్థ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. వాణిజ్య కేంద్రంగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. భీమవరం తర్వాత జిల్లాలో అధిక జనాభా ఉన్న మునిపాలిటీ కూడా తాడేపల్లిగూడెం కావడం విశేషం. ఇటీవల రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు అనుకూల అంశాలు. లోక్‌సభ నియోకవర్గ కేంద్రాలైన ఏలూరు, రాజమండ్రికి సమాన దూరంలో ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. ఈ రెండింటి మధ్య మరో లోక్‌సభ స్థానం ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వవర్గాలు కూడా ఉన్నట్టు సమాచారం.