మురుగు డ్రెయిన్ గోడ కూలడంపై రగడ
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:32 AM
నూజివీడు మున్సిపల్ పరిధిలో మురుగు డ్రెయిన్ గోడ కూలడంపై కౌన్సిల్ సమావేశంలో వాడి వేడి చర్చ సాగింది.
నూజివీడు కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదం
నూజివీడు టౌన్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): నూజివీడు మున్సిపల్ పరిధిలో మురుగు డ్రెయిన్ గోడ కూలడంపై కౌన్సిల్ సమావేశంలో వాడి వేడి చర్చ సాగింది. చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ఉద్దేశించిన బ్యాటరీ వాహనాలు మరమ్మతుకు గురికావడంతో వాటికి తక్షణం మరమ్మ తులు చేయించాలని, వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు కావాల్సిన ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని సమావేశంలో తీర్మానించారు. అనంతరం బాపునగర్‌లో నిర్మాణంలో ఉన్న మురుగు డ్రెయిన్ గోడ కూలడాన్ని వైసీపీ కౌన్సిలర్లు ప్రస్తావించడంతో కొద్దిసేపు టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. దీనిపై వైస్‌ఛైర్మన్ పగడాల సత్యనారాయణ, ప్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్ స్పందిస్తూ జరిగిన ఘటన దురదృష్టకరమని, డ్రెయిన్ నిర్మాణ సమయంలో మురుగునీరు నిల్వ ఉండడంతో స్థానికులు డ్రెయిన్ నిర్మాణానికి అడ్డుకట్టగా వేసిన ఇసుక బస్తాలను తొలగించడంతో ఒక్కసారిగా డ్రెయిన్‌లోకి నీరు రావడంతో గోడ కూలిందని, దానిని కాంట్రాక్టర్ పున్నర్మిం చేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. నాణ్యత లోపాలు లేకుండా చర్యలు చేపడతామని కమిషనర్ పేరయ్య హామీ ఇవ్వడంతో గందరగోళం సద్దుమణిగింది. సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.