Share News

ముసునూరులో ఇంటింటి సర్వే

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:58 PM

ముసునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో కలుషిత నీటి వల్ల డయేరియా విజృంభిస్తోందని ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో జిల్లా వైద్యాధి కారులు స్పందించి ఆదివారం పీహెచ్‌సీలో తనిఖీలు చేపట్టారు.

ముసునూరులో ఇంటింటి సర్వే
ముసునూరులో డయేరియా సర్వే చేస్తున్న డాక్టర్‌ నరేంద్ర కృష్ణ, వైద్యసిబ్బంది

డయేరియా కేసుల నిర్ధారణ.. జిల్లా వైద్యాధికారుల తనిఖీలు

రెండు ఆర్వో ప్లాంట్లకు నోటీసులు.. మూసివేత

ముసునూరు, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ముసునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో కలుషిత నీటి వల్ల డయేరియా విజృంభిస్తోందని ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో జిల్లా వైద్యాధి కారులు స్పందించి ఆదివారం పీహెచ్‌సీలో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎడిడెమియాలజిస్ట్‌ డాక్టర్‌ భార్గవి, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ నరేంద్ర కృష్ణలు ఓపి, అన్‌లైన్‌ రికార్డులను తనిఖీ చేసి కొన్ని డయేరియా కేసులు ఉన్నట్టు గుర్తించారు. డయేరియాపై ఇంటింటి సర్వే తక్షణమే చేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించడంతో ఏఎన్‌ఎంలు, ఎంఏల్‌ హెచ్‌పీలు, ఆశా వర్కర్లు బృందాలుగా సర్వే చేపట్టారు. సిల్క్‌నగర్‌ కాలనీలోని పలు ఇళ్లకు జిల్లా వైద్యాధికారులు వెళ్లి తాగునీటి సరఫరా, డయేరియా లక్షణాలపై ఆరా తీశారు. అనం తరం ముసునూరులో రెండు మంచినీటి సరఫరా ట్యాంకుల వద్ద వాల్స్‌ లీకేజీలను పరిశీలించారు. డాక్టర్‌ నరేంద్ర కృష్ణ మాట్లాడుతూ డయేరియా కేసులు తక్కువగా ఉన్నాయని, ఇంటింటి సర్వే చేయిస్తున్నా మన్నారు. పీహెచ్‌సీ పరిధిలో ఉన్న 13 ప్రైవేట్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, మంచినీటి సరఫరా ట్యాంకులలో నీటి శాంపిల్స్‌ తీసి పరీక్షలకు ఇప్పటికే వైద్యాధికారిణి డాక్టర్‌ ఇవాంజలి పంపారని తెలిపారు. ప్రస్తుతం ఏడు ఆర్వో ప్లాంట్లుకు సంబంధించి రిజల్ట్‌ రాగా, ముసు నూరులో ఒకటి, చింతలవల్లిలో మరోక ప్లాంట్‌ వాటర్‌లో బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఈ రెండు ప్లాంట్లు యజమానులకు పంచాయతీ అధికారుల ద్వారా నోటీసులు ఇచ్చి, ప్లాంట్లును మూసివేయించినట్టు చెప్పారు. మంచినీటి సరఫరా పైప్‌లైన్‌లు, వాల్స్‌ లీకేజులను గుర్తించి, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చి సమస్యను పరిష్కరించేలా చూస్తామన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:58 PM