Share News

చినవెంకన్ననూ వదల్లేదు

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:22 AM

తిరుపతి వెంకన్న ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం ఇతర ప్రధాన ఆలయాలకు సోకుతోంది.

చినవెంకన్ననూ వదల్లేదు

ద్వారకాతిరుమల శ్రీవారి భక్తులకు షాక్‌

చక్కెర పొంగలి, లడ్డూ ప్రసాదాల తయారీకి ప్రతి నెలా 12 నుంచి 15 వేల కేజీల వినియోగం

పంపిణీదారు : తిరుపతికి చెందిన వినాయక ఏజన్సీ

కల్తీ దుమారంతో కాంట్రాక్టు సంస్థను మార్చిన కూటమి సర్కార్‌

ఇకపై నెయ్యిని తరచూ తనిఖీ చేస్తామన్న ఎమ్మెల్యే మద్దిపాటి

ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): తిరుపతి వెంకన్న ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం ఇతర ప్రధాన ఆలయాలకు సోకుతోంది. రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలకు నాణ్యత లేని, కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్‌ చార్జ్‌షీట్‌లో పేర్కొనడం దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో 2022–2024 మధ్య ప్రముఖ క్షేత్రమైన ద్వారకా తిరు మలకు సైతం ఈ కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని సిట్‌ పేర్కొంది. శ్రీవారి ఆలయంలో లడ్డూ, చక్కెర పొంగలితోపాటు స్వామి వారికి నివేదన జరిపే కొన్ని ప్రసాదాల తయారీకి, నిత్య కైంకర్యాలకు నెయ్యిని వినియోగిస్తారు. ప్రతీ ఆరు నెలలకోసారి నెయ్యి సరఫరాలకు టెండర్లు పిలుస్తారు. తక్కువ ధరను కోట్‌ చేసిన వారికి నేతిని సరఫరా చేసే హక్కును పొందగా, దానిని దేవదాయ కమిషనర్‌ అప్రూవల్‌ చేస్తారు. ద్వారకాతిరుమల ఆలయానికి నెయ్యి సరఫరాను 2022లో తిరుపతికి చెందిన వినాయక ఏజన్సీ దక్కించుకుంది. వైష్ణవి పేరుతో కేజీ రూ.532లకు సరఫరా చేసింది. ఈ నెయ్యినే ప్రసాదాలు, ఇతర అవసరాలకు దేవస్థానం వినియో గించేది. శ్రీవారి ఆలయానికి నెలకు 12 వేల నుంచి 15 వేల కేజీల వరకూ నెయ్యి అవసరం. సెప్టెంబరు 2024లో తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి సరఫరాపై దుమారం లేవడం తో చినవెంకన్న ఆలయంలో 2025 నుంచి అధికారు లు సంఘం డెయిరీ ద్వారా నెయ్యి సరఫరాకు శ్రీకారం చుట్టారు. కిలో నెయ్యి రూ.599కు కొటేషన్‌ వేసి ఈ మార్చి 31వ తేదీ వరకూ సరఫరా చేసే హక్కును పొందారు. ద్వారకాతిరుమల ఆలయంలో గతంలో సరఫరా అయిన నెయ్యిపై ఏ విధమైన ఫిర్యాదులు అందలేదని అధికారులు చెబుతున్నారు. అది కల్తీదా ? కాదా ? అన్న విషయాన్ని ల్యాబ్‌లు ఇచ్చే సర్టిఫికేట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నెయ్యి సరఫరాకు తాజాగా టెండరును పిలిచే అవకాశం ఉంది.

గతంలో వాడింది సహకార సంస్థల నెయ్యే

2011 నుంచి శ్రీవారి దేవస్థానం ప్రసాదాల తయారీకి కో ఆపరేటివ్‌ సంస్థల నెయ్యినే వినియో గించే వారు. 2014 నుంచి 2019 వరకూ సంఘం, హెరిటేజ్‌ సంస్థల బ్రాండెడ్‌ నెయ్యినే అప్పటి ధరను బట్టి కేజీకి సుమారు రూ.480కు సరఫరాకు చేశారు. ఆ తర్వాత పెరిగిన నెయ్యి రేటుకు అనుగుణంగా అన్ని దేవస్థానాల మాదిరి తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికి ఈ హక్కును అందజేస్తున్నారు. అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ 2019 మేలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు నెయ్యి, పాల ఉత్పత్తులను సహకార డెయిరీల నుంచి కొనుగోలు చేయాలని ఇచ్చిన ఆదేశాలను 2022లో వచ్చిన కమిషనర్‌ మార్పు చేశారు. అన్ని ఆలయాల్లో నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల సరఫరాకు డెయిరీలు, డీలర్లు, రిటైల్‌ సరఫరాదారులకు సైతం అవకాశం ఇవ్వాలని అప్పటి నిబంధనలను సడలించారు. దీంతో వివిధ సంస్థల కల్తీ దందా ఆలయాల్లో ప్రారంభమైంది. అసలు ఎందుకు నిబంధనలను సడలించాల్సి వచ్చిందన్న దానిపై సైతం విచారణ చేయాల్సి ఉంది. ఇతర డెయిరీలు, డీలర్లు, రిటైల్‌ వ్యాపారులకు అవకాశం ఇవ్వాలని అప్పడు ఎందుకు ఆదేశాలు వచ్చాయన్నది తేల్చాలి.

తక్కువ కోట్‌ చేసిన వారికే కాంట్రాక్ట్‌

రాష్ట్రంలోని దాదాపు అన్ని ఆలయాల్లోనూ ఏ కాంట్రాక్టర్‌ తక్కువ ధరకు కోట్‌ చేస్తే వారికే నేతిని సరఫరా చేసే హక్కు దక్కుతోంది. తమకు ఫలానా బ్రాండ్‌ నెయ్యి సరఫరా చేయాలని దేవస్థానాలు టెండర్‌లో పిలవడం లేదు. ప్రసాదాల తయారీలో నెయ్యి కావాలని మాత్రమే పిలుస్తున్నారు. ఇలా అయితే ఆ నెయ్యిలో నాణ్యత ఏ మేరకు ఉంటుందనేది దేవస్థానాలు పట్టించుకోవడం లేదు, ప్రతీ ఆలయంలోను కాంట్రాక్టుదారుడు సరఫరా చేసే నెయ్యి ముందుగా ఆయా ఆలయ పరిధిలోని సెంట్రల్‌ స్టోర్‌కు వెళుతుంది. అక్కడ వారు ఆ నెయ్యిని లేబ్‌కు పంపించి నాణ్యతను పరిశీలించాలి. అయితే ఆలయాల పరిధిలో లేబొరేటరీలు లేకపోవడంతో వారు కాంట్రాక్టర్‌ తెచ్చిన నాణ్యతా సర్టిఫికేట్‌ను ఆడిట్‌లో వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు.

మహాయజ్ఞ నిర్వహణకు బ్రాండెడ్‌ వాడకం

గత ప్రభుత్వ హయాంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 2023 మే 12 నుంచి మే 17 వరకూ జరిగిన మహాయజ్ఞంలో బ్రాండెడ్‌ నెయ్యిని వాడారు. రాజస్థాన్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌ లీటరు రూ.1200 విలువ చేసే 15 లీటర్ల డబ్బాలు 375 సరఫరా చేసేలా కాంట్రాక్ట్‌. అయితే శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఎంతగానో ఇష్టపడే లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి అంత నాణ్యత కల్గిన నెయ్యిని ఎందుకు వాడటం లేదన్నది ప్రశ్నార్థకమే.

వైసీపీ నేతలు తప్పు ఒప్పుకోవాలి

నెయ్యి కల్తీ జరిగింద న్నది సిట్‌ తేల్చింది. సిట్‌ నివేదిక చూసి భక్తుల గుండెలు పగిలాయి. వేల సంవత్సరాల తరబడి వున్న హిందూ సంస్కృతి సంప్రదాయాలను గత వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసింది. అధికారిక నివేదికలతో రుజువైన వాస్త వాన్ని వైసీపీ నేతలు ఒప్పుకోవడం లేదు. నెయ్యి లో జంతువుల కొవ్వు లేదని చెబుతున్నారు తప్ప ఇతర రసాయనాలు లేవని అనడం లేదు. అంటే నెయ్యి కల్తీదే అంటున్నట్లే కదా.. వైసీపీ నేతలు తప్పనిసరిగా తమ తప్పును ఒప్పుకోవా లి. ఇకపై ద్వారకాతిరుమల ఆలయంలో ప్రసాదాల తయారీ, నెయ్యి ఎలా ఉంది అన్న దానిపై తరచూ తనిఖీలు చేస్తుంటాం.

–మద్దిపాటి వెంకట్రాజు, గోపాలపురం ఎమ్మెల్యే

Updated Date - Feb 12 , 2026 | 12:22 AM